‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ –అనే రామయ్య

1959లో మాస్కో లో ఒక ఇంటర్వ్యు ఇస్తూ రామయ్య ‘’ఇండియా, రష్యా ప్రజలకు సహాయం చేయటం నావిధి .వారు ఒకరినొకరు పరస్పరం అర్ధం చేసుకోవాలి .’’అన్నారు చెప్పటమేకాడు అక్షరాలా చేసి చూపించారు .ఈ ఇంటర్ వ్యూ ను ‘’సోవియట్ లాండ్ ‘’పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు అందులో రామయ్యగారు భౌతిక ,రసాయన శాస్త్రాలలో చేసిన కృషిని వివరిస్తూ ఆయన అందించిన విశిష్ట సేవలను ప్రస్తుతించాడు ఇంటర్వ్యు చేసిన అయన .రామయ్య గారు తన  ఫ్లాట్ లో తరచుగా ఇండియన్ ,రష్యన్ స్నేహితులతో కలిసి మాట్లాడేవారు .’’ఓరియెంటల్ స్టడీస్ ‘’,ఇండాలజీ ‘’లకు చెందిన విద్యార్ధులు వచ్చి తెలుగు నేర్చుకొనేవారు రామయ్యగారి వద్ద .’’ప్రోగ్రెస్ ‘’అనే ప్రచురణ సంస్థ రామయ్య గారి దగ్గరకు వచ్చి ,తమ ఇండియా ప్రచురణల పై ,ఇండియాను గురించి తెస్తున్న ప్రచురణలపై సలహాలు తీసుకొనే వారు .సంప్రదింపులు  జరిపే వారు . వారందరికీ భారతీయమైన సంప్రదాయమైన ఆతిధ్యం ఇవ్వటం రామయ్య గారి ప్రత్యేకత .వారు అడిగే ప్రశ్నలకు వివరంగా సమాధానాలు చెప్పేవారు .అవసరమైతే ఇండియా పై,సోవియట్ పై  ఉపన్యాసాలు చేసేవారు .వచ్చిన అతిధులకు తెలుగు జానపద గీతాలను రికార్డ్ ప్లేయర్ పై వినిపించి ఆనందం కలిగించేవారు .ఇండియా నుంచి వచ్చే రష్యా యాత్రికులూ క్యూ కట్టే వారు .అందరికి చిరునవ్వు తో ప్రశాంత వదనం తో భార్య కాత్యా ఆతిధ్యమిచ్చేది .ఆమె వారందరికీ ‘’రష్యన్ సీత ‘’ అయి పోయింది .ఆమె వికసిత నీలి కనులతో  ,అందమైన నల్లని కురుల మధ్యలో తెల్లని  పాయలలతో ,చెరగని చిరు నగవుతో ,గాంభీర్య వదనం తో అపర అన్నపూర్ణా దేవి అనిపించేది .కాత్యా కాదు ఆత్మీయులకు ‘’కాత్యాయనీ దేవి ‘’అనిపించేది .వాళ్లకు ఆంధ్రా రామయ్య- రష్యన్ ఆంధ్రుడుగా ,సోవియెట్ ఆంధ్రునిగా, మాస్కో ఆంధ్రునిగా  దర్శనమిచ్చేవారు. ఆ అనుభూతి పొంది వారు ధన్యులమయ్యాం అనుకొనేవారు .సోవియట్ ప్రజలు ఆయన్ను ‘’కాన్ స్టాన్టిన్, సెర్జియో విచ్ ‘’అనే రష్యన్ పేరుతొ సంబోధించేవారు .కాని ఉత్తర ప్రత్యుత్తరాలలో ‘’రామయ్య’’ అనే సీతారామయ్య గారు రాసేవారు .అందుకని రామయ్య పేరే అందరికి బాగా పరిచయమై  ప్రాబల్యమైంది .

రామయ్యగారి మహోన్నత మూర్తిమత్వం

రామయ్య గారి మర్యాదపూర్వక సౌజన్యానికి అందరూ ముగ్దులయ్యేవారు .ఎక్కడా ఎప్పుడూ ఆయనలో’’ ఈగో ‘’అనేది కనిపించేదికాదు .ఈగో ను ‘’గో ‘’అని తరిమేసిన పెద్దమనిషి రామయ్య .యెంత పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులోచ్చినా ,ప్రసిద్ధ శాస్త్ర వేత్తలు వచ్చినా వారితో అనువుగా, చనువుగా, అణకువగా సంచరించేవారు .ఆధిక్యం ఏ కోశానా కనపరచేవారుకాదు .రామయ్య గారు డబ్బు మనిషి కాదు. సంపదల వెంట పరుగులు తీయ లేదు .ఆయన ఉన్న అపార్ట్ మెంట్ లో కనీస సౌకర్యాలు మాత్రమే ఏర్పాటు చేసుకొన్నారు ఇండియా నుంచి వచ్చిన వారు అందజేసిన బహుమతులు ,ప్రతిమలు ,అల్లికలు , కేలెండర్ లు విలువైన తెలుగు గ్రందాలతో  ఫ్లాట్ నిండిపోయి ఉండేది  .వారికి  తెలుగు  మహాకావ్యాలలోని తనకిష్టమైన    పద్యాలను  మరీమరీ చదివి వినిపించేవారు . తనకు అభిమానులైన మహాకవి తిక్కన ,మధురకవి బమ్మెర పోతన ల రస గుళికల వంటి వందలాది పద్యాలు రామయ్యగారికి కంఠతా ‘వచ్చు .కృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద ప్రబంధం అంటే ఆయనకు పరమ ప్రీతీ .అందులోని ప్రతిపద్యం, తాత్పర్యం లోతైన విషయాలు ఆయనకు కరతలామలకాలే .సంప్రదాయ సాహిత్యం అంటే ఎంతటి’’ మోజు’’ ఉండేదో రామయ్య గారికి, విప్లవ భావాలతో శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్తాన గేయాలన్నా అంతటి ‘’క్రేజు ‘’ఉండేది .అందులో గీతాలను గుక్క తిప్పుకోకుండా అప్పగించినట్లు ఉదాహరిస్తూ చెప్పి ఆశ్చర్య పరచేవారు .కవిత్వం పై అంతటి సమ ద్రుష్టి ఆయనది .కొడవటిగంటి కుటుంబరావు రాసిన వాస్తవ నవలలు ఆసక్తిగా చదివారు .

యువజన విద్యార్ధి బృందానికి ఆతిధ్యం

కాట్రగడ్డ గంగయ్య అనే ఆయన ముగ్గురు యువకులతో ఆంద్ర దేశం నుండి మాస్కో నగరానికి 1957 లో’’ ‘’ ఆరవ ప్రపంచ యువ జన విద్యార్ధి ఉత్సవాలకు ‘’ వచ్చి రామయ్యగారిని దర్శించి అమితానందాన్ని పొందారు .వాళ్ళు హోటల్’’ ఆస్టాన్ కినో ‘’లో ఉండి రామయ్యగారికి ఫోన్ చేశారు .ఫోన్ నంబర్ ను ‘’అతడు –ఆమె ‘’నవలా రచయిత  రష్యాలో అనువాదకుడిగా పని చేసిన ఉప్పల లక్ష్మణ రావు గారి నుండి తీసుకొన్నామని రామయ్య గారికి చెప్పారు .ఫోన్ అందుకొన్న రామయ్య గారు అచ్చమైన తెలుగులో ‘’నమస్కారం గంగయ్య గారూ !మా ఊరికి ఎప్పుడోచ్చారు?’’అని కుశల ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకొన్న మనసున్న మనిషి. వారు రామయ్య గారిని తామున్న  చోటుకు రావద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ,అప్పటికి తనకున్న ఎంగేజ్ మెంట్ లనన్నిటిని రద్దు చేసుకొని ,తన కూతురు లీలావతి ని  వెంట తీసుకొని ఒక గంట లోపే హోటల్ కు చేరారు .వాళ్లకు కూతురిని పరిచయం చేస్తూ ‘’ఈమె లీలావతి మా పెద్దమ్మాయి .వ్యవసాయ శాస్త్రం చదువుతోంది .’’అని కమ్మని తెలుగులో చెప్పారు .తెల్లబోయారు గంగయ్య .ఒకరికొకరు బాగా పరిచయమై వివరాలన్నీ మాట్లాడుకొన్నారు .వారిమధ్య సంభాషణ తెలుగులోనే దాదాపు జరిగింది .ఆంద్ర నుండి వచ్చిన వారికి మాట్లాడేటప్పుడు  సరైన తెలుగు మాట  స్పురించక పొతే రామయ్య గారే వెంటనే సరైన మాట చెప్పి ఆశ్చర్య పరచేవారు .గంగయ్య బృందం పదిహేను రోజులు ఉంది మాస్కో లో తరచూ వీరితో సమావేశామయేవారు .రామయ్యగారి ఫ్లాట్ కు వచ్చి ఆతిధ్యం తీసుకొన్నారు . కాత్యా వారందరికీ ఆంధ్రా వంటకాలు చేసి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టింది .రామయ్య గారి స్టడీ రూమ్ లో తెలుగు దినపత్రికలైన ఆంద్ర పత్రిక ,కృష్ణా పత్రిక ,విశాలాంధ్ర కట్టలు కట్టలుగా ఉండేవి .ఇందులోకొన్ని 1930 కాలం నుండి కూడా ఉన్నాయి. వీటిని ఇంత భద్రం గా బంగారంగా దాచుకొన్నారు ఆంధ్రాభిమాని రామయ్య .అవన్నీ అప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా ఉండేవి .ప్రతి సంచికా దాని ప్రత్యేకత కలిగి ఉండేది .అదొక అక్షర నిధి .అందుకే రామయ్య అంత జాగ్రత్తగా పదిల పరచుకొన్నారు .గ్రామఫోన్ లో  తెలుగు పాటలు వారికి వినిపించారు .వీరినీ వీరితో బాటు వచ్చిన యువజన విద్యార్ధి బృందాన్ని తాన ఇన్ ష్టి ట్యూట్ కు ఆహ్వానించి అక్కడ జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కలిగించారు . రామయ్య గారి యెడల ఆయన సహచరులు చూపిన గౌరవ మర్యాదలకు,ప్రేమానురాగాలకు  అతిధులు ఆశ్చర్య పోయారు .అక్కడి’’ టోస్ట్’’ ను స్వీకరించి న తర్వాత అతిధులను రామయ్యగారు మాట్లాడమన్నారు ‘’మీరు తెలుగులో మాట్లాడండి .నేను రష్యన్ లోకి తర్జుమా చేసి వారికి తెలియ జేస్తాను ‘’అని చెప్పి అలానే చేశారు .గంగయ్య గారి బృందం రామయ్య గారితో ‘’అయ్యా రామయ్య గారూ ! దయ చేసి ఒక సారి మనదేశం ఇండియా ను సందర్శించ వలసినదిగా  వినయ పూర్వకం గా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాం ‘’అని ప్రార్ధనా పూర్వకం గా వేడుకొన్నారు .’’ .కాలం కలిసి వచ్చినప్పుడు  తప్పకుండా వస్తాను ‘అని క్లుప్తంగా సమాధానం చెప్పారు రామయ్య . దటీజ్ సీతా రామయ్య .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.