గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు
వాసుదేవ ,శ్రీదేవి ల పుత్రుడైన ధనుంజయుడు జైనకవి .అప్పటికే సాహిత్యం లో ద్వార్దికావ్యాలు విజ్రుమ్భించాయి .ఒకే పద్యం లో రెండు వేర్వేరు కదార్ధాలు వచ్చే దాన్ని ద్విసందాన కావ్యం అన్నారు .దండి కవి సంస్కృతం లో దీనికి నాన్దిపలికితే భోజుడు శృంగార ప్రకాశ లో దాన్ని పేర్కొన్నాడు .సుబందు దీన్ని వచనం లో చేశాడు .సుబందు వాసవ దత్తలో ద్వ్యర్దికావ్య నిర్మాణాన్ని శిఖరారోహణం చేయించాడు .ధనుంజయుడు అదే బాటలో నడిచి రామాయణ ,మహా భారత కధలను ద్విసందాన కావ్యంగా సుమధుర ,సాంద్ర ప్రవాహ కవిత్వం లో రాశాడు .తన శక్తి ఎరిగిన వాడు కనుక ధనుంజయుడు తనను వాల్మీకి వ్యాసులతో పోల్చుకొని వారితర్వాత మూడో వాడిని తానే నని చెప్పుకొన్నాడు. దండిని దృష్టిలో పెట్టుకొనే ఈ మాట అన్నాడు .తన కావ్య్యం మూడు వజ్రాలలో ఒకటి అన్నాడు .ఆకలంకుని న్యాయ సారం ,పూజ్య పాదుని వ్యాకరణం మిగిలిన రెండు వజ్రాలుట .ధనుంజయుడు ఆనంద వర్ధన ,రాత్నాకరులను బాగా మెచ్చు కొన్నాడు .సోమదేవ,జల్హనులు ధనుంజయ కవిత్వాన్ని మెచ్చారు ఇతనిగురించి వర్ధమానుడూ చెప్పాడు .కనుక ధనున్జయునికాలం తొమ్మిది పది హతాబ్దుల మధ్యగా నిర్ణయించారు .
160-మూషిక వంశ చరిత్ర రాసిన –అతుల కవి
పదిహేను కాండాలలో అతులకవి మూషిక వంశ రాజ చరిత్రను రాశాడు .అంతకు మించి అతుల గురించి మనకు ఏమీ తెలియ లేదు .దక్షిణ తిరువాన్కూరు పాలకులైన మూషిక వంశ రాజుల సుదీర్ఘ చరిత్ర ఇది .పరశురాముడు రాజ క్షత్రియ రాజ వంశ నిర్మూలన చేస్తుండగా ఒక క్షత్రియ వంశ రాజు చనిపోగా అతని భార్య పారిపోయి ఒక పర్వత గుహ లో దాక్కున్నది .ఒక రోజు ఏనుగంత ఉన్న ఎలుక ఆ గుహలో దూరి ఆమెను బలాత్కారం చేయబోతే ఆమె కంటి చూపుకే అది కాలి బూడిద అయ్యింది .ఎలుక ఆత్మా పర్వత రాజు రూపంగా ప్రత్యక్షమైంది. తన రూపం మారిపోవటం గ్రహించిన ఎలుక కౌశిక ముని శాపం వల్ల తనకు ఆ ఎలుక రూపం వచ్చిందని చెప్పాడు .రాణి ఆ గుహలోనే ఉండిపోయి ఒక మగ పిల్లాడిని కన్నది .రాణి తో పాటు ఇక్కడే ఉన్న రాజ పురోహితుడు ఆ పిల్లవాడికి విద్య నేర్పాడు .పరశురామ యజ్ఞానికి బలి పశువుగా ఈ బాలుడు వెళ్లి ఆయన్ను మెప్పించి చావు తప్పించుకొని ఆయన అనుగ్రహం తో ‘’మూషిక రామ ఘట ‘’పేరుతో మూషిక రాజ్యానికి రాజు అయ్యాడు . ఒక కుండ నీటితో పవిత్రీకరింప బడ్డాడుకనుక రామ ఘట (కుండ)అనే పేరొచ్చింది .ఇతను మగధ రాజు మాధవ వర్మనుయుద్ధం లో చంపి కూతురు భద్రసేనను పెళ్ళాడాడు .మగధ కు మాధవ వర్మ కుమారుడిని రాజును చేశాడు .
రామ ఘటకు ఇద్ద్దరు కొడుకులు .పెద్దవాడు వటు ను హైహయ రాజ్యం ఇచ్చి రాజును చేశాడు .చిన్నకొడుకు నందన ను చోళ రాజుగా అభిషిక్తుని చేశాడు. అరణ్యాలకు వెళ్లి వాన ప్రస్తాశ్రమం లో చివరి రోజులు గడిపాడు .మనకవి గారు ఇక్కడి నుండి ఆ తర్వాతా రాజులందర్నీ వరుసగా పేర్కొని చివరిరాజు నీల కంఠవల్లభా అతని కొడుకు దాకా వారి చరిత్ర అంతా పూస గుచ్చి వర్ణించాడు . .. శ్రీకంఠరాజు ఆస్థానం లో ఉండి ఈ మూషిక వంశ చరిత్ర రాశాడుఅతులకవి . .పద్నాలుగవ కాండం లో రాజా వల్లభ కేరళపై దండయాత్రకు వస్తున్నచోలరాజును నిలువ రించటానికి కేరళ రాజుతో కలిసి చోళ రాజుల దండయాత్రను ఎదుర్కొన్నాడు .ఈ చోళ రాజు 1014-1046వాడైనమొదటి రాజేంద్ర చోళుడు అయి ఉండ వచ్చు .పన్నెండు ,పద్నాలుగు అధ్యాయాల్లో శ్రీ మూల వాసం లో ఉన్న బుద్ధ దేవాలయాన్ని వర్ణించాడు .ఈ ఆలయం సముద్రం చొచ్చుకు రావటం వలన శిధిలమై పతన దశకు చేరుకొన్నదని ఆవేదన వ్యక్తం చేశాడు .868లో రాజ పోషణం లో ఈ బుద్ధ దేవాలయం పరమ వైభవంగా ఉండేది .కనుక అతుల మూషిక వంశ చరిత్ర పదకొండవ శతాబ్దం లో రాసి ఉంటాడని భావిస్తారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-15-ఉయ్యూరు