యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6
66-ధర్మ రాజు సామాన్య మానవులు ఊహించలేని లోతులకు వెడుతు సమాదానాలిస్తున్నాడు .యక్షుడి ప్రశ్నలూ అలాగే ఉన్నాయి .
‘’తపస్సు లక్షణం ఏమిటి ?’’యక్ష ప్రశ్న
‘’స్వధర్మాచారణమే ‘’యుధిష్టిర సమాధానం .
67-‘’దమం అంటే’’ ?
‘’ మనసుని అదుపు చేసి ఇంద్రియ నిగ్రహం సాధించటం ‘’
68-‘’శిఖర ప్రాయమైన క్షమఏది ?’’
‘’ద్వంద్వాలను సహించ గలగటం ‘’
69-‘’ఏది సిగ్గు ?’’
‘’చెడు పనుల పట్ల విముఖత ‘’
70-‘’జ్ఞానం ఏది “?
‘’పరతత్వ జ్ఞానం ‘’
71-‘’శమం అంటే ?’’
‘’ చిత్త ప్రశాంతి ‘’
72-‘’శిఖర ప్రాయమైన దయ ఏది “”?
‘’అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవటం ‘’
73-‘’ఏది రుజుత్వం””?
‘’ సమ చిత్తత ‘’
74-‘’మనిషికి అసాధ్యుడైన శత్రువు ఎవరు “?
‘’క్రోధమే ‘’
75-‘’అంతులేని వ్యాధి “”?
‘’ఇతరుల సొమ్ము తనదికావాలనే లోభం ‘’
76-‘’ఎవరు సాధువు ‘’?
‘’సర్వ ప్రాణ హితం కోరేవాడు ‘’
77-‘’అసాధువు “?
‘’’’దయ లేని వాడు ‘’
78-‘’మోహం అంటే ?’’
‘’ధర్మ మూఢత్వమే మోహం ‘’.
ధర్మ మూఢత్వం అంటే-ఏది ధర్మమో ,దేన్నీ ఆచరి౦ చాలో ,ఏది చేయకూడదో తెలియక ఎటు పడితే అటు కొట్టుకు పోవటం .జ్ఞాన దీపం వెలగని చోట మూఢత్వంఅనే చీకటి చిక్కగా వ్యాపించి ఉంటుంది. .భావావేశం కూడా మోహానికి చెందినదే .అహం మోహాన్ని పెంచి ,తమో గుణానికి దారి తీసి వినాశ కారణత్వం అవుతుంది .శకుని మోహ పురుషుడైతే ,ద్రుత రాష్ట్రుడి మనసు అటూ ఇటూ ఊగి చివరికి మోహం లోనే నిలుస్తుంది .ధర్మ పాలన దక్షత లేని వాడు గుడ్డిరాజు .రుజుత్వానికి మూర్తీభవించిన ఉదాహరణ విదుర మహాశయుడు .అంతులేని వ్యాధితో బాధ పడేవాడు దుర్యోధనుడు .ధర్మ రాజు సాధువు అని శ్రీ జి వి .సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు .మళ్ళీ ప్రశ్నా పరంపర కొనసాగింది .
79-‘’మానం అంటే ఏమిటి ధర్మ రాజా “?
‘’ఆత్మాభిమానమే మహాత్మా “’
80-‘’ఏది అలసత్వం “”?
‘’ధర్మాన్ని పాటించక పోవటాన్ని మించి అలసత్వం లోకం లో లేదు ‘’
81-‘’ఏది శోకం “”?
‘’అజ్ఞానమే శోకం ‘’
వీటిపై శ్రీ జి వి ఎస్ గారి వివరణ చూద్దాం –ధర్మాన్ని ఆచరించటానికి దక్షత కావాలి .దృఢ మైన దీక్ష లేక పోవటం అలసత్వం .అలసత్వం ఆలస్యానికి కారణమవుతుంది .బ్రాహ్మణ ఆచారాన్ని పాటించటం అంటేనే తపస్సు .ధర్మ శాస్త్రం ప్రతి ఒక్కరికీ వాళ్ళ కార్య క్షేత్రాన్ని నిర్దేశించింది .ఆ క్షేత్రం లో ఏమరుపాటు ,నిర్లక్ష్యం లేకుండాజీవించటమే స్వధర్మాచరణం .సమాజం లో అలసులు ఎక్కువైతే పతనం చెందుతుంది .అజ్ఞానం అంటే శాస్త్ర పాండిత్యం లేక పోవటం ఒక్కటే కాదు ,సత్యాసత్య పరిజ్ఞానం లేక పోవటం .తత్వ దర్శనమైతే శోకం నశించి ,సమచిత్తత కలుగుతుంది .
82-‘’ఋషుల దృష్టిలో ఏది స్థైర్యం “”?
‘’’స్వధర్మం లో నిశ్చలంగా నిలబడటం ‘’
83-‘’దేన్ని ధర్యం అంటారు “?
‘’ఇంద్రియ నిగ్రహాన్ని ‘’
84-‘’ఉత్తమ స్నానమేది “”?
‘’మనసు నిర్మలంగా ఉంచుకోవటమే ‘’
85-‘’ఉత్తమ దానం “”?
‘’భూత సంరక్షణ ‘’
ధర్మ రాజు ఇంద్రియ నిగ్రహాన్నే ధైర్యం అని జవాబు చెప్పాడు .యుద్ధ వీరుల ధైర్యం కంటే ఇదే శ్రేష్టమైనది అని భావం –‘’బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంస మపి కర్షతి’’-అంటే ఇంద్రియ సమూహ బలం అసాధారణ మైనది .విద్వా౦సు డినైనా అది లాగి పారేస్తుందని అర్ధం .కనుక ఇంద్రియ నిగ్రహమే ధైర్యం .త్రిషవణ స్నానాలు ,తీర్ధ స్నానాలకంటే మనసును నిర్మలంగా ఉంచుకోవటమే ఉత్తమోత్తమ స్నానం .ఇదే అంతరంగాన్ని పరిశుద్ధి చేస్తుంది మామూలు స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే చేయవచ్చు కాని మనో మాలినాన్ని కడిగి పార వేయ లేదు మనసు పరిశుద్ధం కాకపొతే మనిషి ఉత్తమ గతి సాధించలేడు .సర్వ భూత రక్షణ మే ధర్మ దానం –దీనినే బుద్ధ భగవానుడూ చెప్పాడు .యక్ష ప్రశ్నలు, ధర్ముడి సమాధానాలు ధర్మ సూక్ష్మాలు .ధర్మ మర్మాలను తెలియ జేసేవి .తల స్పర్శ కాదు లోతుగా అధ్యయనం చేయాల్సినవి అంటారు శ్రీ జీ వి ఎస్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-16-ఉయ్యూరు

