ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -142
57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్
న్యు ఇంగ్లాండ్ అనే మాసాచూసేట్స్ ను అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించినవాడైన రాబర్ట్ ఫ్రాస్ట్ 26-3-1874న కాలిఫోర్నియా రాష్ట్రం లో సాన్ ఫ్రాన్సిస్కో లో జన్మించాడు .అందుకని ఆయన రచనల్లో ఆ మట్టి వాసనలు –నార్త్ ఆఫ్ బోస్టన్ ,మౌంటేన్ ఇంటర్వెల్ ,ఎఫాఆర్దర్ రేంజ్ ,న్యు హాంప్ షైర్,స్తీపుల్ బుష్ వంటి వాటిలో ప్రత్యక్షమౌతాయి .అమెరికా దూర పాశ్చాత్య భాగం లో జన్మించటం యాదృచ్చికం .తలిదండ్రులిద్దరూ తూర్పు ప్రాంత0 లో పుట్టిన పల్లెటూరి మేస్టార్లు .ఇక్కడే వారి పూర్వీకులు ఎనిమిది తరాలుగా నివశించారు .తల్లి స్కాట్ లాండ్ కు చెందిన సముద్ర యాన ఆర్క్నీ కుటుంబానికి చెందినవారు. తండ్రి వైపువారు ఇంగ్లాండ్ నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు .తండ్రి విలియం ప్రెస్కాట్ ఫ్రాస్ట్ సహజంగా దేనికీ కట్టుబడని వాడు .ఉపాధ్యాయ వ్రుత్తి వదిలేసి ,న్యు ఇంగ్లాండ్ రిపబ్లికన్ నుండి తిరుగు బాటు చేసి కాలిఫోర్నియా చేరి అక్కడ సాన్ ఫ్రాన్సిస్కో బులెటిన్అనే డెమోక్రాటిక్ పార్టీ పత్రికకు సంపాదకుడయ్యాడు .ఆయన మనసంతా సౌత్ మీదే ఉండేది .కొడుకు రాబర్ట్ పుట్టటానికి పదేళ్ళ ముందే సివిల్ వార్ పూర్తి అయినా కొడుకు కు రాబర్ట్ లీ ఫ్రాస్ట్ అని పేరు పెట్టుకొన్నాడు .రాజకీయాలలో ప్రవేశించిన ఆయనకు ఆరోగ్యం సహకరించలేదు .ముప్ఫై ఏళ్ళకే క్షయ వ్యాధితో చనిపోయాడు .భార్య కొడుకుని ,,కూతుర్ని తీసుకొని మాసా చూసేట్స్ లోని లారెన్స్ చేరి మామగారి దగ్గర ఉంది .అప్పటికి మనకవి వయసు పది మాత్రమే .
తల్లి మళ్ళీ ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ ,ఖాళీ సమయాలలో ఇంకా యేవో వ్యాపకాలలో ఉంటూ పిల్లల పోషణ చేసింది .కాలి ఫోర్నియాలో చదువు ఏమీ సాగలేదు రాబర్ట్ కు .ఎలాగో అలా కాలేజి నుంచి బయట పడ్డాడు . తన చదువు గురించి చెబుతూ ఫ్రాస్ట్ ‘’ఒకటిన్నర ఏడాది యే గ్రేడూ లేని కాలిఫోర్నియా చదువు ,నాలుగేళ్ల లారెన్స్ హై స్కూల్ చదువు మాత్రమీ నేను చదువుకొన్న చదువు .’’అన్నాడు 12వ ఏట కొద్ది పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు ,ఒక’’ షూ షాప్’’పీస్ వర్కర్ గా పని చేశాడు .16ఏళ్ళ వయసులో బాబిన్ వాగన్ ను లాగేపని లారెన్స్ టెక్స్టైల్ మిల్ లో చేశాడు .18ఏట కార్బన్ పెన్సిల్ లాంపులు స్పిన్నింగ్ యంత్రాలకు అమర్చటం డైనమో బాగు చేయటం వంటి చిన్న చిన్న పనులు చేశాడు .17వయసులో డార్ట్ మౌత్ చేరి మూడు నెలలకే మానేశాడు .చాలా రెస్ట్ లెస్ గా ఉంటూ పుస్తకాలు చదవని శిక్షణ లోటు అనుభవించాడు .తల్లి చేసే చోట ఒక టరం టీచింగ్ చేసి మళ్ళీ వ్యవసాయం లో చెయ్యి కాల్చుకొన్నాడు .షేక్స్ పియర్ కవిని జనాలకు పరిచయం చేసే ప్రయత్నం చేసి అట్టర్ ఫ్లాప్ అనిపించుకొన్నాడు .19వ ఏట జర్నలిజం లో వేలేట్టాడు .లారెన్స్ సెంటినెల్ పేపర్ కు రిపోర్ట ర్ చేరి ‘’అమెరికన్ ‘’పేపర్ కు బదిలీ అయ్యాడు .కాలమిస్ట్ గా పని చేసస్తూ ఎడిటోరియల్ పేజీ రాశాడు .పద్ధతీ పాడూ లేకుండా పేరాలు రాసేవాడు .కొన్నిసార్లు మత సంబంధ వ్యాసాలూ గిలికేవాడు .చివరికి ఇదే కవిత్వం రాయటానికి దారి చూపింది .
21వ ఏట తన హైస్కూల్ స్వీట్ హార్ట్ సౌందర్య రాశి ఎలినార్ వైట్ ను పెళ్లి చేసుకొన్నాడు .చదువు పూర్తీ చేయాలనుకొని హార్వర్డ్ లో చేరాడు .విలియం జేమ్స్ దగ్గర చదవాలని ఉండేది .కాని ఫిలాసఫీ కి తగిన ప్రాధమిక విషయాలు తెలియవని చేర్చుకోలేదు .రెండేళ్ళు కర్రిక్యులం తో కుస్తీ పట్టాడు .కాని దాన్ని ఓడించటం అసాధ్యమనుకొని’’ పీటీ దెబ్బ తిని’’చదువుమానేశాడు .
మరో అయిదేళ్ళు పొలం సాగు ,న్యు హాంప్ షైర్ర్ లోని డేర్రిలో ఉన్న పింకేర్టన్ అకాడెమి లో పార్ట్ టైం టీచింగ్ తో కాలం గడిపాడు . 27వయసులో న్యు హాంప్ షైర్ స్టేట్లోని ప్లిమత్ లో ఉన్న నార్మల్ స్కూల్ లో సైకాలజీ బోధించాడు .జే ఏం సిన్జే ,జార్జ్ బెర్నార్డ్ షాల నాటకాలు ఇతర విషయాలు చదువుతూ జ్ఞాన సముపార్జన చేశాడు .టీచింగ్ మాత్రమే తన కెరీర్ కు తగింది అనుకొన్నాడు .మధ్య మధ్యలో కవిత్వం రాస్తూనే ఉన్నాడు .పదిహేనేళ్ళ వయసులో ప్రెస్కాట్ రాసిన ‘’కాంక్వెస్ట్ ఆఫ్ మెక్సికో ‘’చదివి మురిసి పోయి దాన్ని బాలడ్ గా రాయటం ప్రారంభించాడు ఇది లారెన్స్ హై స్కూల్ మేగజైన్ లో ప్రింట్ అయింది .19వ ఏట మొట్ట మొదటి ప్రొఫెషనల్ కవిత ‘’ఇండిపెండెంట్ మేగజైన్ ‘’లో ప్రచురితమై 15డాలర్ల పారితోషికం లభించింది .పెద్దగా హుషారు ఇవ్వక పోయినా కవిత్వం కూడు పెడుతుంది అని గ్రహించాడు ,నిరాశ నిస్పృహలు తొలగి ఆశా రేఖ కనిపించింది దీనికి బలం ఇస్తూ ,మరో 14ఏళ్ళు ఆ పత్రిక ఫ్రాస్ట్ కవిత్వాలను ప్రచురిస్తూ ప్రోత్సహిస్తూ ఆదాయాన్ని సమకూర్చింది .మిగతా మేగజైన్లు ఫ్రాస్ట్ కవితలను వేసుకోవటానికి ముందుకు రాకపోయినా ఇండి పెండెంట్ పత్రిక మరో ఆరు కవితలను ప్రచురించింది. .ఫ్రాస్ట్ కవిత్వం పాతమూస కవిత్వానికి భిన్నంగా ,పల్లెటూరి భావాలకు బలమిస్తూ వారికి సన్నిహితంగా రాయటమే దీనికి కారణం .ఫ్రాస్ట్ రాసిన ‘’మై బట్టర్ ఫ్లై’’రాసిన 20ఏళ్ళకు అతని మొదటి కవితా సంపుటి అమెరికాలోని న్యు ఇంగ్లాండ్ లో కాదు అసలైన బ్రిటన్ లోని ఇంగ్లాండ్ నుండి వెలువడింది .ఇది చాలా అరుదైన గౌరవం అదృష్టం .దీనికి అనేక కారణాలున్నాయి .రైతుగా బైతుఅని పించుకొని ,,కొన్నపోలాలన్నీ అమ్మేసుకొని ,రాళ్ళు రప్పల నేలను సాగు చేయటం తనవలన అయ్యే పనికాదని గ్రహించి పూర్తిగా కమతానికి దూరమయ్యాడు .ఇప్పుడు మధన ప్రారంభమై తాను ఏదైనా కవిత్వం కాని కాకర పీచు కాని రాయటానికి ఆలోచన ఉన్నవాడినేనా రాయగలనా అని వితర్కి0 చు కొన్నాడు .తాత్కాలికంగా ఫ్రాస్ట్ దంపతులు బకింగ్ హాం షైర్లో ఉండి,అక్కడ ఇరుగుపొరుగు వారిద్దరూ వ్యవసాయం చేస్తూ కవులైన సంగతి గ్రహించాడు .మిగిలిన రచయితలు రూపర్ట్ బ్రూక్ ,ఎడ్వర్డ్ ధామస్ లతో పరిచాయం పెంచుకొన్నాడు .ధామస్ పై ఫ్రాస్ట్ ప్రభావం అధికమై తన కవితా సంకలనాన్ని ఫ్రాస్ట్ కు అంకితమిచ్చాడు
ఒక రోజు తాను రాసిన కవితలను అచ్చుకాని వాటిని తిరగేస్తూ ఉండగా తాను ఇరవై ఏళ్ళుగా రాసిన కవిత్వం అంతా రాశీ భూతమై కనిపించి జలదరించింది. ఎప్పుడూ డబ్ల్యు ఇ.హెన్లీ కవిత్వాన్ని ఆదరిస్తూ మెచ్చుకొనే ఫ్రాస్ట్ కు తన కవిత్వ’’ కవిలె కట్ట ‘’ను హెన్లీ పబ్లిషర్ కు పంపాలనే ఆలోచన వచ్చింది .ఫ్రాస్ట్ ఎవరో ఆ పబ్లిషర్ కు తెలియక పోయినా ముద్రించటానికి వెంటనే అంగీకరించి ముందుకొచ్చాడు .కవి లాంగ్ ఫెలో కవితలో ఒక ఫ్రేజ్ ‘’మై లాస్ట్ యూత్ ‘’ను స్పూర్తిగా తీసుకొని ‘’ఎ బాయ్స్ విల్ ‘’పేరిట ప్రచురించాడు .అప్పటికి ఫ్రాస్స్ట్ వయసు 38.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-16-ఉయ్యూరు ‘’

