ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -145
58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని
25-4-1874న గుగ్లీనో మార్కొని ఇటలీదేశం లోని బోలానా లో పుట్టినప్పుడు ,వాళ్ళ పక్కింటి ఆయన ఈ పిల్లాడిని చూసి అతని చెవులు చేటల్లాగా ఉన్నాయని అన్నాడట .వాళ్ళమ్మ వెంటనే ‘’అయితే మనం ఎవరం వినలేని శబ్దాలను మా వాడు వింటాడన్న మాట ‘’అని బదులిచ్చిందట .ఐరిష్ జాతికి చెందిన తల్లి ఆ చెవులకు సంగీత మాధుర్యాన్ని అందించేది .తండ్రి సంపన్నుడైన బిజినెస్ మాన్ కనుక కొడుకును అందరూ చదివే చదువు కాకుండా గొప్ప చదువు చదివి౦చా లనుకొన్నాడు .ఫ్లారెన్స్ అండ్ లెగ్ హారన్ వంటి ప్రసిద్ధ విద్యా కేంద్రాలలో చేరక ముందు మార్కొని ఇంటికొచ్చి మేస్టార్లు విద్య నేర్పేవారు .తండ్రి లైబ్రరీలో ఉన్న పుస్తకాలను బాగా చదివే వాడు .ముఖ్యంగా భౌతిక శాస్త్రాన్ని ఆసక్తిగా చదివాడు .అందులో ఎలేక్త్రిసిటి పై విపరీతమైన అభిమానమేర్పడింది .తండ్రి కట్టించిన అటకపై కూర్చుని ప్రయోగ శాలగా కరెంట్ వైర్లు బాటరీలతో ఏదో ప్రయోగాలు చేసేవాడు .12ఏళ్ళ వయసులో .గాలి లోని పదార్ధాల గురించి బాగా అర్ధం చేసుకొన్నాడు .13వ ఏట గాలినుంచీ నైట్రేట్ ను తయారు చేసే ప్రయత్నం చేశాడు .
మార్కొనికి 14 ఏళ్ళు వచ్చినప్పుడు హీన్రిచ్ రుడాల్ఫ్ హెర్ట్జ్ వాయు తరంగాలపై తానూ చేసిన ప్రయోగ ఫలితాలను ప్రచురించాడు .గాలిలో తరంగాలున్నాయి అనేది కొత్త విషయం కాదు 1864లో జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ కాంతి లోని విద్యుదయస్కాంత తరంగాలను ,విద్యుత్ తరంగాలను ప్రయోగాత్మకం గా ప్రదర్శించే ప్రయత్నం చేశాడు ,వాటి పొడవు వేలాసిటి లను చెప్పాడు .కాని ఆయన సిద్ధాంతం ప్రయోగాత్మకంగా రుజువు కాలేదు .అందుకే చాలాకాలం అది సిద్దా౦త౦గానే హెర్ట్జ్ ప్రయోగం చేసి రుజువు చేసేదాకా ఉండి పోయింది .గదిలో ఏలెక్ట్రికల్ వేవ్స్ ను హెర్ట్జ్ పంపగలుగుతున్నాడని ,ఎలెక్ట్రిక్ ఆసిలేటర్ ద్వారా దానికి 20అడుగుల దూరం లో ప్రేరిత విద్యుత్ (ఇన్ డ్యూసింగ్ కరెంట్ )ను సృష్టించాడని చదివి ఆశ్చర్య పోయాడు మార్కొని .వైర్ లెస్ లో అద్భుతమైన శక్తి దాగి ఉందని గ్రహించాడు .గాలిని మాధ్యమంగా తీసుకొని వార్తలు మ్యూజిక్ ,ప్రసంగం మొదలైనవానిని పంప వచ్చని ,భద్ర పరచ వచ్చునని ఊహ చేశాడు .ఒక స్పందనను వైర్లు లేకుండా కొన్ని అడుగుల దూరం పంపగా లేనిది ,మైళ్ళ దూరం పంపలేమా అని ఆలోచించాడు .ఇది సాధ్యమైతే ప్రపంచ వ్యాప్తం గా పంపించవచ్చు అని ఆయన మస్తిష్కం లో మెరుపులాంటి ఆలోచన వచ్చింది .దీనినే మార్కొని ఇంట్యూషన్ అంటే అంతర్ ద్రుష్టి అన్నాడు .’’ఈ తరంగాలు కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తమై కొత్త సమాచార వ్యవస్థ ఏర్పడుతుంది ‘’అని చెప్పాడు .
16వయసులో మార్కొనికి తన జీవిత లక్ష్యమేమిటో తెలిసింది .బొలోనా యూని వర్సిటిలో ఎలెక్ట్రో మాగ్నేటిజం పై పరిశోధనలు చేస్తున్న ఫిజిక్స్ ప్రొఫెసర్ అగస్టోరిఘి వద్ద చేరి చదివాడు. అక్కడి మిగిలిన శాత్ర వేత్తలు హీర్త్జియన్ తరంగాల పని తీరుపై పరిశోధిస్తున్నారు .అంతమాత్రంగా మార్కొని దానికేమీ భంగ పడలేదు .ఒక’’ ప్రేరణ వేస్టనం’’అంటే ఇండక్షన్ కాయిల్ ,కొన్ని పరికరాలు మోర్స్ కీ ,ట్రాన్స్ మీటర్ ,మల్టిపుల్ డిస్చార్జర్ (స్పార్క్ గాప్ )తోప్రయోగాలు సాగించాడు .పారిషియన్ ఫిజిసిస్ట్ అడౌర్డ్ బ్రాన్లీ నుంచి అరువుగా మరొక పరికరం తీసుకొన్నాడు. బ్రాన్లీ లోహముక్కలు నింపిన గ్లాస్ ట్యూబ్ ను ఉపయోగిస్తూ హేతు బద్ధంగా ప్రయోగం చేస్తుంటే మెకానికల్ షాక్ తో పడిపోయాడు .మార్కొని ఇందులోని సిద్ధాంతాన్ని గ్రహించి నిర్మాణాన్ని వృద్ధి చేశాడు .పలుచటి దేర్మామీటర్ గ్లాస్ ట్యూబ్ లో నికెల్ పొడి వేసి ,దానిలోకి కరెంట్ పంపాడు .అది అతని ఆలోచనలను సరియైనవే నని రుజువు చేస్తూ ఒక కండక్టర్ గ పని చేసింది .దానిపై నెమ్మదిగా తట్టితే లోపలి రేణువులు దూరమై అంచనా తప్పింది .తరువాత ఇనుము ,కాపర్ జింక్ ,బ్రాస్ లతో ప్రయోగాలు చేశాడు .ఇవేవీ ఊహించిన ఫలితాలివ్వ లేదు .చివరికి నికెల్ సిల్వర్ మిశ్రమ౦బాగా సెన్సిటివ్ గా ఉంటు౦ది కనుక దాన్ని వాడాలని నిర్ణయానికొచ్చాడు .స్పందనలను పెంచుతూ ,పరికరాన్ని మరింత శుద్ధి చేస్తూ ప్రయోగాలు చేశాడు .ఇప్పటివరకు హీర్తీజియన్ ఆసిలేటర్కు ఉన్న రెండు కడ్డీలను తీసేసి స్పార్క్ డిస్చార్జర్ ఒక టెర్మినల్ ను ఎత్తుగా స్థంభం మీదున్న మెటల్ కండక్టర్ కు కలిపాడు .రెండవ టెర్మినల్ ను భూమిలో పాతిపెట్టిన మెటల్ ప్లేట్ కు కలిపాడు .దీనితో వైర్ లెస్ లాబ్ నుండి గాలిలోకి దూసుకు పోయింది అని మార్కొని జీవిత చరిత్ర రాసిన ఆరిన్ డన్లాప్ అంటాడు .దీనితో సృస్టిం పబడిన స్పార్క్ చేయలేని పని ,ప్రయాణం చేయలేని దూరం అనేవి లేకుండా పోయాయి. సమాచార వ్యవస్థలో ఇదొక గొప్ప విప్లవం .దీని సాధకుడు మార్కొని .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-16-ఉయ్యూరు

