ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -146
58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –2
వైఫల్యాలను దాటి విజయాలు సాధించాడు మార్కొని .భవనం మూడవ అంతస్తులో ఒక ‘’కీ ‘’పెట్టి కింద బేస్మెంట్ లో బెల్లును మోగించాడు .పైంతస్తులో ఒక యంత్రం పెట్టి మోర్స్ కోడ్ లోని మూడు చుక్కలద్వారా ఎస్ అనే అక్షరాన్ని కింద లాన్ లో వినపడేట్లు చేశాడు .ఎక్కువ శక్తిని తరంగాలలో నింపే ప్రయత్నం చేశాడు. వాటిని శక్తి పుంజాలుగా మార్చి ఎక్కువ వేగం కలిపించాడు .స్పార్క్ లకు మరింత శక్తి కలిగించాడు .దీని వలన రిసీవర్ స్పష్టంగా పదునుగా వార్తలను గ్రహించేది .21వ ఏట ఒక మైలు దూరం లో పల్లెటూరి లో ఉన్నతండ్రి ఫారం హౌస్ కు మెసేజ్ పంపగలిగాడు . మొదట వాడిన పరికరం శక్తిని బాగా పెంచి రెట్టింపు దూరం మెసేజ్ పంపాడు .
మార్కొని కున్న ప్రభావం కల స్నేహితులు అతని పరిశోధనా ఫలితాలను ఇటలీ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళారు .అదేమంత గొప్ప విషయం కాదని ,ఆకాలం లో పక్వానికి వచ్చిన పండులాంటి జ్ఞానం అనీ తేలిగ్గా కొట్టి పారేశారు అధికారులు .దీన్ని లక్ష్య పెట్టకుండా ,తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ,అంతకుముందే సర్ ఆలివర్ లాడ్జ్ చేసిన పరిశోధనా ఫలితాలను అర్ధం చేసుకొని ఇంగ్లాండ్ వెళ్ళాడు .
22ఏళ్ళ 6నెలల వయసున్న మార్కొని కళ్ళు తిరిగే ప్రదర్శనలు చేసి అందరి మెప్పు పొందాడు .మొదటి సారిగా వైర్లెస్ టేలిగ్రఫీ కు పేటెంట్ పొందాడు .బ్రిస్టల్ చానెల్ గుండా 10మైళ్ళ దూరం మేసేజ్ పంపగలిగాడు .అప్పుడు ఇటలీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మార్కొని ని స్వదేశానికి తిరిగి రమ్మని ఆహ్వానించింది .దాన్ని గౌరవించి వెళ్లి ఇటాలియన్ రేవీరా వద్ద ఉన్న స్పెజియాలో ఒక స్టేషన్ ఏర్పాటు చేసి సముద్రం లో 12మైళ్ళ దూరం లో ఉన్న యుద్ధ నౌకలతో వార్తా సంబంధాన్ని ఏర్పరచాడు .అప్పటికే ఆయన స్వంత వైర్లెస్ టేలిగ్రాఫ్ ,సిగ్నల్ కంపెనీలు ఏర్పరచుకొన్నాడు .మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి ఇంగ్లీష్ చానెల్ ద్వారా సమాచారం అందుకోవటం చేశాడు .
ఈప్పటిదాకా కళ్ళు మూసుకొన్న బడా బడా సైంటిస్ట్ లు ఇప్పుడే ఒక యువ సైంటిస్ట్ ఒక గొప్ప అభివృద్ధిని సైన్స్ లో సాధించాడని ప్రకటించారు .అయితే మార్కొని గొప్పతనమేమిటో ప్రజలకు 1898 వరకు అంటే మొదటి వైర్లెస్ పరికరాన్ని ఒక లైట్ షిప్ లో ఏర్పాటు చేసేదాకా తెలియదు .కొద్ది కాలానికి ఆ షిప్ ఒక స్టీమర్ తాకిడికి దెబ్బతింది .సహాయం కోసం మెసేజ్ లు లైట్ హౌస్ కు అందాయి .వెంటనే లైఫ్ బోట్ లను పంపి సమాచార వ్యవస్థ ను అత్యంత వేగంగా సమర్ధంగా పునరుద్ధ రించారు .ప్రసార దూరం క్రమక్రమ౦గా పెరిగి,74మైళ్ళ దూరం వరకు సమాచార౦పంపటం కుదిరింది .
ఆధునిక ప్రపంచం లో మార్కొని సాధించింది అత్యద్భుత శాస్త్రీయ విజయమే అయినా ఆయన తాను ఇంకా ప్రాధమిక దశ లోనే ఉన్నానని చెప్పేవాడు .ప్రసారం చానెల్ దాటిందీ అంటే అట్లాంటిక్ సముద్రాన్నీ దాటించ వచ్చు అనే నమ్మకం కుదిరింది .పాత పుస్తకాల జ్ఞానం వంట బట్టించుకొన్న ప్రొఫెసర్లు ఇది అసాధ్యమని ,విద్యుత్ అయస్కాంత తరంగాలు సరళ రేఖా మార్గం లో ప్రయాణి౦చటమే దీనికి కారణం అన్నారు .ఈ వితండ వాదులకు జవాబు ఇవ్వటానికి ఇష్టపడని మార్కొని హెర్టీజియన్ తరంగాలు నదులు, ప్రవాహాలు లాగానే భూమి వక్రతను అనుసరిస్తాయని రుజువు చేశాడు .
ఇప్పటికే ప్రసిద్దుడనిపించుకొన్న మార్కొని చాలా సీరియస్ గా ముభావంగానే ఉండేవాడు .ఏమీ చదువుకొని అజ్ఞానులకు వైర్లెస్ టేలిగ్రఫీ అర్ధం ఎలా వివరిస్తావు అని అడిగితే మార్కొని ‘’గాలిలో శబ్దం తరంగాలుగా వ్యాపిస్తుందని తెలియని వారు లేరు .ఉదాహరణకు ఒక ఫిరంగిని పేలిస్తే దానివలన కలిగే ఒత్తిడి దగ్గరున్న గాలి ని కంపింప జేస్తుంది .ఈ కంపనాలు వెళ్ళినంత దూరం శబ్దం వినపడుతూనే ఉంటుంది .నేను ఏర్పాటు చేసిన నిలువుగా ఉన్న వైరు విద్యుదాయస్కాంత తరంగాలను గాలిలోకి పంపిస్తుంది .అందువలన ఒక రకమైన కంపనాలను వాతావరణం లో కలుగుతాయి .ఈ కంపనాలు అన్ని దిశలలోనూ రిసీవర్ ను చేరే దాక వ్యాపిస్తాయి .కనుక ఒక మెసేజ్ ను గాలిద్వారా యెంత దూరమైనా పంపవచ్చు అయితే మనం కల్పించిన కంపనాలు నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలి అప్పుడే సాధ్యం ‘’అని చక్కగా వివరించాడు .
1899 ఫాల్ సీజన్ లో మార్కొని అమెరికాకు బయల్దేరి వెళ్ళాడు న్యు యార్క్ హెరాల్డ్ యజమాని జేమ్స్ గార్డన్ బెన్నెట్ అమెరికా కప్ యాచ్ పోటీలను వైర్లెస్ ద్వారా రిపోర్ట్ చేయమని కోరాడు .న్యు యార్క్ సందర్శన సంభ్రమాన్ని కల్గించింది .అక్కడిఆకాశ హర్మ్యాలు వైర్లెస్ సిగ్నల్ లకు అడ్డు పడతాయేమోనని సరదాగా అన్నాడు .అక్కడున్న ఒక రిపోర్టర్ ‘’no bigger than a French man and no older than a quarter century .He is a mere boy ,with a boy ’s happy enthusiasm and a man’s view of his life work .His manner is a little nervous and his eyes a bit dreamy .He acts with the modesty of a man who merely shrugs his shoulders when accused of discovering a new continent ‘’.అన్నాడు మార్కొని ని గమనించి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రాసాద్ -19-5-16-ఉయ్యూరు

