ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -148
59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్
79వ పుట్టిన రోజున తాను రాసిన ఆరు భాగాల’’రెండవ ప్రపంచ యుద్ధం ‘’ జ్ఞాపకాలలో చివరిభాగాన్ని ప్రచురించి విడుదల చేసినవాడు ఇంగ్లాండ్ ప్రధాని సర్ విన్ స్టన్ లెనార్డ్ స్పెన్సర్ చర్చిల్ .అప్పటికే 30కి పైగా ఇతర పుస్తకాలు రాసిన రాజకీయ దురంధరుడు ,పెయింటర్ ,రచయితచర్చిల్.ఇవి ఏదో ఆషామాషీగా ,సంక్షిప్తంగా రాసినవి కావు .తన పూర్వీకుడు మార్ల్ బరో పై ఆయన జీవితం కాలం అనే పేరుతొ నాలుగు బృహద్గ్రందాలు రాశాడు .తండ్రి లార్డ్ రాండాల్ఫ్ చర్చిల్ పై రెండు ,,తన యుద్ధ ప్రసంగాలను ఏర్చి కూర్చి ఆరుభాగాలుగా రాశాడు .ఫిక్షన్ ను ఏమీ వదిలిపెట్టలేదు .’’సవ్రోలా ,ఎ టేల్ ఆఫ్ రివల్యూషన్ ఇన్ లారేనియా ‘’అనే కాల్పనిక సాహిత్యమూ రాశాడు .సైనికుడు జర్నలిస్ట్ ,చరిత్రకారుడు,రాజకీయ నాయకుడు ,మహా వక్త ,రాజకీయ దురంధరుడు అయిన చర్చిల్ కు గ్రంధ కర్తృత్వం జీవితం లో ఒక భాగమైపోయింది .అయిదుగురు చక్రవర్తుల వద్ద పని చేసిన అనుభవం ఆయనది .ఆయనను ఎంతగా ఆరాధించారో అంతగా తిట్టారు .హౌస్ ఆఫ్ కామన్స్ లో అతనంటే చిరాకు ఏహ్య భావం ఉండేవి .అయితేనేం జనం చేత పిచ్చ పిచ్చగా మోజు పడి ఆరాధింప బడిన నాయకుడాయన .ఆ శతాబ్దపు అత్యంత ‘’బహురూప మూర్తి ‘’(ప్రోటియన్ ఫిగర్ )అని పించుకోన్నవాడు .
30-11-1874 న లండన్ లోని బ్లెన్ హీం పాలస్ లో లార్డ్ రాండాల్ఫ్ చర్చిల్ కు మూడవ కొడుకుగా పుట్టాడు .వీరిది మార్ల్ బరో వంశం .ఈ వంశాని కే రాణి అన్నే వుడ్ స్టాక్ క్రౌన్ ప్రాపర్టి ని,వారిలో బ్లెన్ హీం లో అత్యంత సుందర విలాస భవనం నిర్మించిన ఆర్కిటెక్ట్ జాన్ వాన్ బ్రా కు అప్పగించింది .తల్లి జెన్నీ జెరోం అమెరికా దేశీయురాలు ,న్యూయార్క్ వాసి ..అత్యంత సంపన్నురాలు ,బహు దొడ్డ అందగత్తె .నెలలు రాకముందే పుట్టటం ,పుట్టిన దగ్గర్నుంచి మన ‘’జగన్ ‘’లాగాపదవి కోసం తొందర పడటం చూసి స్నేహితులు చర్చిల్ ను ‘’య౦గ్ మాన్ ఇన్ హర్రి ‘’అనేవాళ్ళు .అంటే దుందుడుకు కుర్రాడు అని అనచ్చు .తర్వాత ‘’దూకుడు గాడు ‘’అన్నారు .చిన్నప్పటి నుంచి కయ్యానికి కాలు దువ్వేరకం .అధికారాన్ని ధిక్కరించేవాడు .నర్సుల్ని విసిగించేవాడు .ట్యూటర్లను ఆట పట్టించేవాడు .చర్చిల్ జీవిత చారిత్ర రాసిన లేవిస్ టేలర్ ‘’కొంతవరకు కంచర గాడిద తల ,మండే నిప్పు పొగరు ,పొట్టి ,యెర్ర జుట్టు ,ముఖంపై చిన్న చిన్న మచ్చలు ,కొద్దిగా కుక్కపిల్ల ముక్కు ,లాంతరురు స్తంభం లా యే భావం కనిపించని మూతి ,నీలి కాంతి వంతమైన కళ్ళు ,వాటిలో కొట్టోచ్చేట్లు కనిపించే అసహనం ‘’అని చర్చిల్ రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణన చేశాడు ‘’.మొరటడు’’గా చిన్నప్పుడేకాడు పెద్దప్పుడూ,జీవితాంతం ప్రవర్తించాడు .80ఏళ్ళవయసులో బట్టతల ఉన్న ,అతని ముఖం మర్యాద తో గుండ్రంగా పింక్ కలర్ గా ఉండేది .ఒకావిడ తనకు పుట్టిన కొడుకు ఆయనలాగే ఉన్నాడని చర్చిల్ తోఅంటే ‘’నిజమే పుట్టిన శిశువు లందరూ నాలానే కనిపిస్తారు ‘’అన్నాడు .
రెండేళ్ళ వయసు రాకముందే తాత ఐర్లాండ్ కు వైస్ రాయ్ అయ్యాడు .కనుక కొంతకాలం చర్చిల్ బాల్యం ఐర్లాండ్ లో గడిచింది .అక్కడి క్రమ శిక్షణ ఉల్లంఘించి తను స్వయం గా ఏర్పాటు చేసు కొన్న ,బొమ్మల సైన్యంతో ఆదుకొనేవాడు .వాటితో ఆడకుండా ఉండగలిగే వాడు కాదు .దీన్ని గమనించిన అతని తండ్రి ఒక వెయ్యి మంది బొమ్మ సైనిక బృందాన్ని ఏర్పాటు చేశాడు .తనకొడుకు తప్పనిసరిగా మిలిటరీ కమాండర్ అవుతాడని భావించాడు .స్కూల్ చదువు పెద్ద బోర్ గా పెద్ద హింసగా భావించాడు .7వ ఏట దగ్గరలో ఉన్న ఆస్కాట్ కు పంపారు .ఇది ఈటన్ లో చేరటానికి శిక్షణ ఇస్తుంది .ఇక్కడ లాటిన్ ను ద్వేషించటం ఒక్కటే నేర్చుకొన్నాడు .కోపం వచ్చి మేస్టార్లు’’ బడితె పూజ ‘’చేసే వాళ్ళు . కాని దాన్ని మాన్పించలేక పోయారు .ఒక సారి హెడ్ మాస్టర్ నెత్తిన పెట్టుకొనే స్ట్రా కాప్ ను కాలితో తన్నుతూ ముక్కలు ముక్కలుగా చేసి పారేశాడు .ఇంకేముంది స్కూల్ పిల్లలకు ఆదర్శమూర్తి అయిపోయాడు .కొడుకులో మార్పుఏదైనా వస్తుందనే ఆశతో ,ఆరోగ్యమూ ఈ రెండేళ్లలో దెబ్బతిన్నదనే ఆలోచనతో చేర్పించారు ,ఇక్కడ మరింత స్వేచ్చ దొరికింది .ఈతకొట్టటానికి ,గుర్రపు స్వారీకి ,తనకు కావలసిన పుస్తకాలు చదువుకోవటానికి అనుమతి లభించింది .ఇక్కడే ‘’కింగ్ సాల్మన్స్ మైన్స్ ‘’,’’ట్రెజర్ ఐలాండ్ ‘’నవలలు ఇష్టంగా చదివాడు .కాని దీనికంటే ఏదో ఒక చిలిపి పని చేయటం ఇష్టంగా ఉండేది .ఎర్ర తోలు కదా’’ ఎర్ర తేలు’’బుద్ధులు వంట బట్టాయి .వీరామూర్ అనే టీచర్ ‘’ఇకపై నా మోకాళ్లను నువ్వు తొక్కితే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను ‘’అంది ఈ కొంటె కుర్రాడితో .’’క్లాసు పిల్లల్లో అత్యంత అల్లరిగాడు .కాని వీడే ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచం లోనే అతి చిన్న అల్లరి పిల్లాడు అనిపించుకొంటాడు అని నాకు అనిపిస్తోంది ‘’అన్నది .అమర్యాదకు ,మూర్ఖత్వానికి చిరునామా అయ్యాడు .అందులోనే ఆనందం పొండాడు .ఒకసారి విద్యార్ధులను టీచర్ మీలో ఎవరికి ఎన్ని లోపాలున్నాయో చెప్పండి ?’’అని అడిగితె మన తుంటరి ‘తొమ్మిది ‘’అని గర్వంగా చెప్పాడు .’’తొమ్మిదా ?’’అని టీచర్ ఆశ్చర్యంగా అంటే మన ప్రబుద్ధుడు కాలర్ ఎగరేసి అంతే అన్నాడు .ఆ క్లాస్ వయసు పిల్లగాళ్ళకు అన్ని లోపాలు క్షమించరానివే .గ్రహించిన సూక్ష్మగ్రాహి కొంటేకోనంగి’’నేను చెప్పింది ‘’నీన్ ‘’అది జర్మన్ మాట .అని సర్దుకొన్నాడు .
మూడేళ్ళు బ్రైటన్ చదువు తర్వాత ఆరోగ్య కేంద్రమైన హారో లో చేరాడు .ఇక్కడ పరిస్తితి మరీ దారుణం చేశాడు .ఎంట్రన్స్ పరీక్షకు లాటిన్ లో ఒక ప్రశ్నా పత్రం ఇస్తే అక్షరం ముక్క రాయకుండా ఖాళీగాఅక్కడక్కడ పిచ్చి గీతాలు గీసి చివర సంతకం ఒకటి ‘’పొడిచి ‘’ మళ్ళీ తిరిగిచ్చేశాడు .స్కూల్లో అతి చిన్నతరగతిలో అతి తక్కువ మార్కులు .దీనితో మరీ రెచ్చి పోయాడు .తెలివి తక్కువ తనం నుంచి అత్యధిక విద్యా వ్యాసంగం కలవాడయ్యాడు .తనకు నచ్చని ఇష్టం లేని తనదికాని దాన్ని దేనినీ పట్టించుకొనే వాడు కాదు .ఈ విషయం పై చర్చిల్ స్వయంగా ‘’where my reason ,imagination or Interest was not engaged ,I could not or would not learn ‘’అని కుండ పగలకొట్టి చెప్పాడు.’’మై ఎర్లి లైఫ్ ‘’అనే తన పుస్తకం లో చర్చిల్ .స్కూల్ మాస్టర్లు తనపై రుద్దే క్లాసికల్ చదువును అడ్డుకొన్నాడు.సీజర్, ఓవిడ్,వర్జిల్ లను చదివి చదివి చెమటలు కార్చాడు .ఇంగ్లీష్ కాంపోజిషన్ అంటే కొంచెం ఇష్టం .గొప్పగొప్ప ఇంగ్లీష్ స్టైలిస్ట్ ల నాడి పట్టుకొన్నాడు .ఈ సందర్భంగా ‘’I got into my bones the essential structure of the ordinary British sentence which is a noble thing .’’అంటూ ‘’స్కూల్ లో లాటిన్ కవిత్వం లో , గ్రీక్ఎపిగ్రామ్స్ రాయటం లో లో ప్రైజులు కొట్టేసి ఆకాశం లో విహరించిన నా స్నేహితులు,ఇప్పడు బుద్ధి తెచ్చుకొని నేలమీద నడుస్తూ బతుకు తెరువు చూసుకొంటున్నారు .కనుక లాటిన్ గ్రీక్ నేర్చుకోనన్న నాకు పశ్చాత్తాపం లేదు, అవి రాకపోయినందువలన నా జీవితానికి కలిగిన ప్రమాదం ఏదీ జరగ లేదు’’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-16-ఉయ్యూరు

