వీక్లీ అమెరికా-10(5-6-17 నుండి 11-6-17 వరకు )
మనవడి ఉద్యోగ వారం
5-6-17 సోమవారం -దాదాపు 7 నెలల క్రితం నెట్ లో రాయటం మొదలు పెట్టిన ‘’వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి ‘’ని ఇవాళ 54 వ ఎపిసోడ్ తో పూర్తి చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను .. మైనేనిగారు ఆదరం తో పంపిన ‘’తానా ‘’ప్రత్యేక సంచిక అందింది చాలా’’ రిచ్ ‘’గా ఉందని పించింది . తీరికగా చదవాలి ..రాత్రి ‘’గొట్టం ‘’లో ‘’మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు ‘’సినిమా చూసాం .శర్వానంద్ ,నిత్యామీనన్ నటించారు .’’ బుర్రా ‘’కుర్రాడి బుర్ర బాగా పని చేసి మంచి డైలాగులు రాశాడు నీట్ గా ఆదర్శంగా ఉంది ..
మంగళవారం ‘’కారీ ‘’లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవడు హరి ఫోన్ చేసి సోమవారం వాళ్ళావిడకు సిజేరియన్ జరిగి రెండవ మగపిల్లాడు పుట్టాడని చెప్పాడు .మూడువారాల ముందే పిల్లాడు పుట్టాడు . .తల్లీ పిల్లాడు కులాసాగా ఉన్నారు ..’’ గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3’’లో 100 మంది కంటే ఎక్కువ మంది దొరకరేమో అనుకున్నాను .కానీ ఇవాళ్టి కి 148 మంది గురించి రాయగలిగాను అంటే కొంత ధైర్యమొచ్చింది .’’వుమెన్ సెయింట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ‘’సగం చదివాను .. ట్యూబ్ లో ‘’గుండె జారి గల్లంతైంది ‘’సినిమా ఫన్ బకెట్ చూసాం ..
బుధవారం -పది రోజులుగా ఫోన్ లో ఇంటర్వ్యూ లు చేస్తున్న మా మనవడు చి సంకల్ప్ కు చికాగో కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి సెలెక్ట్ చేసినట్లు చెప్పి ఒక అరగంటలోనే అపాయింట్మెంట్ ఆర్డర్ మెయిల్ చేశారు అందరం చాలా ఆనందించాం . .రాత్రి శ్రీకాంత్ నటించిన ‘’మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో ‘’యు ట్యూబ్ లో చూసాం సరదాగా ఉంది .
గురువారం గీర్వాణం -3 లో 169 వరకు రాశా .సాయంత్రం శ్రీమతి వీటూరి పద్మజ శ్రీమతి గోసుకోండ అరుణలు వచ్చారు పద్మజ వాళ్ళు పై శుక్రవారం మద్రాస్ వెళ్లి పోతున్నారట .మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి పూజాదికాలు కొంత డబ్బు ఇచ్చింది . ఇద్దరికి ‘’మా అన్నయ్య ‘’పుస్తకాలు ఇచ్చాము అందరం కలిసి ఫోటోలు తీసుకొన్నాం .. శుక్రవారం- సంకల్ప్ ఆదివారం ఉదయం చికాగో ప్రయాణానికి ఫ్లయిట్ టికెట్ , కావా ల్సిన సామాను కొని రెడీ అయ్యాడు . గీర్వాణం 188 వరకు రాశాను . శనివారం గీర్వాణం-3 లో 200 కవుల గురించి రాసి చాలా ఆనందించా . తవ్విన కొద్దీ దొరుకు తున్నారు .ఎప్పటికప్పుడు ఖాళీ అనుకొంటుంటే ఇంకా ఊరుతూ నన్నూ ఊరిస్తున్నారు నా అదృష్టం . నాలుగు ఆమ్నాయ పీఠాల జగద్గురువులలో గీర్వాణ రచనలు చేసిన వారందరి గురించీ రాసి ,వేద కాల స్త్రీలు ,మహర్షుల గురించి ,వారి రచనల గురించి రాశాను .కొంత వరకు ఆత్మ సంతృప్తి కలిగింది ..ఆస్ట్రో ఫిజిక్స్ కొన్ని చాఫ్టర్లు చదివాను చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది దీనిపై కొన్ని ఆరికల్స్ రాయాలనిపిస్తోంది .. 52 ఏళ్ళక్రిందటి శిష్యురాలు శ్రీమతి కరుణానిధికి ఫోన్ చేశాను .తాము ఉయ్యూరులో ఉన్నామని తన తల్లిగారు చనిపోయి 9 రోజులయింది చెప్పింది ..సానుభూతి తెలియ జేశాను ..
11-6-17 ఆదివారం -ఉదయం 9 గంటలకు కారులో సంకల్ప్ ను నేనూ, విజ్జి, పీయూష్ ఎయిర్ పోర్ట్ కు తీసుకు వెళ్లి చికాగో ఫ్లయిట్ ఎక్కించి వచ్చాము . మధ్యాహ్నం 2 గంటలకు చికాగో చేరినట్లు తెలియ జేశాడు గీర్వాణం -3 లో 204 వరకు రాశా ..
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-17-కాంప్-షార్లెట్-అమెరికా