గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
211-భుజంగ తాండవ స్తోత్రం రచించిన –రావణ బ్రహ్మ
లోక రావణుడని ,దశకంఠు డని,,రాక్షస నాయకుడని లంకా సామ్రాజ్యాధిపతిఅని శివుని భక్తితో మెప్పించి ఆత్మ లింగాన్ని పొందిన షట్కాల శివ పూజా దురంధుడని ,,సప్త సముద్రాలలో స్నానించిన ఆతరువాతే శివ పూజ చేసేవాడని సీతాపహరణం చేసి లోక నింద మూటగట్టుకొని శ్రీరామునికి యుద్ధం లో సరిజోదు అనిపించుకుని ఆయన చేతిలో మరణించి న రావణ బ్రహ్మ విశ్వశ్రవస బ్రహ్మ కైకసి ల కుమారుడు -దూరం లో ఉన్న శబ్దాన్నికూడా అతి స్పష్టంగా వినగలిగినవాడైన వైశ్రవణుడనే బిరుదున్నవాడురావణ బ్రహ్మ . శివుని మెప్పించటానికి ఘోర తపస్సు చేసి తన తొమ్మిది తలలను ‘’చంద్ర హాసం ‘’అనే ఖడ్గం తో కోసుకొని శివుని కర్పించి తన పద వ తలతో ప్రేగులనే వీణా తంత్రులుగా చేసి వాయించి అమోఘ వరాలుపొందాడు .ఆ వీణ నే ‘’రుద్ర వీణ’’ అంటారు ..అతడు అన్నగారైన కుబేరుని జయించి లంకా సామ్రాజ్యాన్ని వశపరుచుకొని అన్నను బయటికి నెట్టి అపూ ర్వ మైన ‘’పుష్పక విమానం ‘’లాక్కున్న ఘనుడు .లోక రావణుడు . నవగ్రహాలను అష్ట దిక్పాలకులను తన వశం చేసుకున్నవాడు . తమ్ముళ్లు కుంభకర్ణుడు విభీషణుడు చెల్లెలు శూర్పణఖ .భార్య మండోదరి .కుమారుడు దేవతలని గడగడ లాడించిన ఇంద్ర జిత్ అనే మేఘనాధుడు .రావణుడు ‘’సిద్ధ యోగం ‘’,రాజకీయ నీతి శాస్త్రం ‘’లలో అపార పాండిత్యం ఉన్నవాడని ‘’అ ర్క ప్రకాశిక ‘’గ్రంధం లో ఉన్నది రావణుడు1- ‘’రావణ సంహిత ‘’అనే జ్యోతిశాస్త్ర గ్రంధాన్ని ,2-అర్క ప్రకాశం .అనే ఆయుర్వేద గ్రంధం రాశాడు .
బ్రహ్మ వరం వలన పొందిన అమృత బాండాన్నికడుపులో దాచుకొన్న సమర్ధుడు .ఉత్తర ప్రదేశ్ లోని ‘’భిష్టకి ‘’గ్రామం లో రావణుడు జన్మించాడని ఆ గ్రామస్తుల నమ్మకం
బౌద్ధుల ‘’లంకావతార సూత్రం లో టిబెటన్ బుద్ధిజం లోని ;;ని0గ్యం ‘’లలో రావణుడు ప్రధాన పాత్ర దారి .శ్రీలంకలో దక్షిణ కైలాసం అని పిలువబడే రావణ దేవాలయం ట్రిన్కోమలికి తూర్పున ఉంది .తల్లి కైకసి అంత్య క్రియలు నిర్వర్తించటానికి రావణుడు 7 చోట్ల భూమిని కత్తి తో పొడిచాడు ఆ ఏడు ప్రదేశాలనుండి వేడి నీరు భూమిపైకి ఎగతన్నింది ఆ ప్రదేశాన్ని ‘’కన్నియ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ‘’అంటారు ఇది గొప్ప టూరిస్ట్ స్పాట్ .
గుజరాతులో ‘’ఖచోరబ్రాహ్మణులు ‘’తాము రావణ వంశానికి చెందినవారమని గొప్పగా చెప్పుకోవటమేకాక కొందరి ఇంటిపేరు ‘’రావణ’’గా ఉండటం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది .గౌతమ గోత్రానికి చెందిన రెండవ ఉపాధ్యాయ యశస్తరుడు తాము ‘’రావణి ‘’వంశనానికి చెందినవారమని చెప్పుకున్నాడు . బర్మా రామాయణం లో రావణునిపేరు ‘’యవ్వన లేక దాత గిరి ‘’.థాయ్ రామాయణం లో రావణుని యక్షునిగా అసురునిగా చెప్పబడి ,తోత్సపక్ ,అని రాపనాసూర్ అని చెప్పబడింది .జైనమతం లో రామ ,రావణు లిద్దరు జైన్లు .మంత్రగాడైన విద్యాధరునికొడుకు రావణుడని రావణుడు రామునిచే కాక లక్ష్మణునిచేత చంపబడ్డాడని ఉంది .
ఇంతటితో ఈ చావు గోల వదిలేసి రావణ ప్రోక్త’’భుజంగ తాండవ స్తోత్రం ‘’చేస్తూ ఆ తాండవ శివుణ్ణి మెప్పిద్దాం . ఇది పంచ చామరం వృత్తం లో ఉన్న 15శ్లోకాల స్తోత్రం . .పంక్తికి 16 అక్షరాలున్న నాలుగు పంక్తులు ఒక శ్లోకం అయన పరమ శివ భక్తికి ప్రత్యక్ష నిదర్శనం .ఆ తాండవ శివుడిని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేసి చూపించిన కవితా వైభవం రావణునిలో ఉంది భావం తెలియకపోయినా భాష మనల్నే తాండవం చేయిస్తుంది .భావం తెలిస్తే అలౌకికానందమే ,అఖండ సచ్చిదానందమే . అహో రావణ బ్రహ్మా అని పిస్తుంది .
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 |
జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||
అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||
కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||
పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||
212-న్యాయ మంజరి రచయిత -జయంత భట్ట (క్రీశ. 900 )
తొమ్మిదవ శతాబ్దికి చెందిన న్యాయ సిద్ధాంత కారుడు జయంత భట్ట’’న్యాయ మంజరి ‘’ తోపాటు ‘’ఆగమాడంబర ‘’అనే నాటకం సంస్కృతం లో రాశాడు882-902 కాలం లో పాలించిన రాజు శంకరవర్మ తన సమకాలికుడని పేర్కొన్నాడు ఇతని కొడుకు అభినందన కవి తన ‘’కాదంబరి కదా సారం ‘’లో జయంతి భట్ట తాత 8 వ శతాబ్దపు కర్కోటక రాజు లలితా దిత్య ముక్త పీడుని ఆస్థానం లో మంత్రి అని చెప్పాడు .కనుక జయంతి భట్టు 9 వ శతాబ్దపు ఉత్తరార్ధం లో ఉన్నాడని భావిస్తారు
కధాసారం ప్రకారం వీరిది గౌడ దేశానికి చెందిన బ్రాహ్మణ కుటుంబమని భారద్వాజ గోత్రమని ,పూర్వీకుడు శక్తి అని కాశ్మీర్ రాజ్య సరిహద్దులో దర్వాభిసార లో స్థిరపడ్డారని తెలుస్తోంది . జయంతుని తాత కు రాజు ఉత్తర రాజౌలి లో ఉన్న ‘’గౌర ములక ‘’గ్రామాన్ని దత్తం చేశాడు జయంతుని తండ్రి చంద్ర
చిన్నతనం లోనే జయంతుడు బాలమేధావిగా గుర్తింపబడి యవ్వనం లోనే పాణిని అష్టాధ్యాయి ని అధ్యయనం చేసి గొప్ప వ్యాకరణ పారీణు డై ‘’నవ వృత్తికారుడు ‘’అనే బిరుదు పొందడాని తెలుస్తోంది .న్యాయ శాస్త్రం పై మూడు వ్యాఖ్యానాలు రాశాడు కానీ న్యాయ మంజరి ఒక్కటే మిగిలింది .మిగతా రెండు ‘’న్యాయ కలిక,’’న్యాయ పల్లవ’’ .ఈ రెండు ‘’శాద్వద రత్నాకరం ‘’లో పేర్కొనబడ్డాయి కానీ అలభ్యాలు .న్యాయ మంజరి ని తాను రాజు చేత అరణ్యం లో నిర్బంధించబడినప్పుడు రాశానని జయంతుడు చె ప్పుకొన్నాడు .న్యాయ మంజరి సర్వ స్వతంత్ర గ్రంధమే అనిపిస్తుందికాని అదొక వ్యాఖ్యాన గ్రంధం అనిపించదు ఆంతటి న్యాయ శాస్త్ర విద్వత్తు జయంత భట్టుది దీనిని రాయటానికి ముఖ్య కారణం వేద వాగ్మయ సాధికారత ను సంరక్షించటం కోసమే నని చెప్పాడు. పూర్వ న్యాయ శాస్త్ర కారులు న్యాయాన్ని’’ అన్వీక్షికమ్’’ అంటే శాస్త్రీయ విజ్ఞానం అన్నారని తెలిపాడు .
జయంతుడు రాసిన ‘’ఆగమాడంబరం ‘’నాటకంలో నాలుగు అంకాలున్నాయి .ఇది పాక్షిక వేదాంత సంబంధ నాటకం . ఇందులోని నాయకుడు వేద విరుద్ధులను వాదం లో ఓడించి వేద ప్రామాణ్యతను కాపాడటమే ముఖ్య కాదాంశం .దీని ఆంగ్లానువాదాన్ని ‘’క్లే సాంస్క్రిట్ లైబ్రరీ ‘’ప్రచురించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా