విశ్వంభర నారాయణీయం
తెలుగు’’ గజళ్లకు’’ జలదరింపు తెచ్చి
‘’నాగార్జున సాగర్ ‘’ను తేనెల వాకల తెలుగుతో నింపి
‘’కర్పూర వసంత రాయల ఘనతకు
‘’మేలిమి కప్పుర తెలుగు పలుకుల నీరాజనమెత్తి
‘’నవ్వని పువ్వు ‘’లోని వసివాడని అందాలు మెచ్చి
‘’వెన్నెల వాడ ‘’లో వసంత విహారం చేసి .
తెలుగు జాతీయ ‘’జలపాతం ‘’సృష్టించి
‘’దివ్వెల మువ్వల ‘’దివ్యనాదాన్ని పంచి
ఆధునిక ‘’రుతు చక్రానికి ‘’గిరగిరలు నేర్పి
‘’మధ్య తరగతి మందహాసం ‘’పై
మంచి ముత్యాల జల్లు కురిపించి
‘’మంటలు లోని మానవుడు ‘’కు
సాంత్వనంతో ఉపశమనం కలిగించి
‘’విశ్వంభర ‘’కు వెన్నెల వాకలు కూర్చి
‘’ప్రపంచ పదుల ‘’తో విశ్వాన్ని చుట్టి
కళాస్రష్ట ‘’రామప్ప’’కు
‘’సంగీత రూపక ‘’గోపురం కట్టి
‘’సినారె నాటిక ‘’లతో నూత్నఆవిష్కారం చేసి
ఆధునికాంధ్ర సాహిత్య సాంప్రదాయం ‘’కు
జోహార్లుపలికి ,’’ప్రయోగాల ‘’కు
నిండుమనసుతో
ప్రశంసల తెల్ల గొడుగు పట్టి ,
తెలంగాణా’’ మట్టి నుంచి’’
ప్రపంచ సాహిత్య’’ఆకాశానికి’’ఎదిగి
‘’యాత్రా సాహిత్యా’’నికి ,మాత్రా సాహిత్య
గౌరవం కల్పించి మెరిపించి మురిపించి
చలన చిత్రసీమకు ‘’గులే బకావళి ‘’తో
పాటల గులాబీ పూలు పూయించి
త్రిసహస్ర గీతాల హరి విల్లు అమర్చి
‘’ఏక వీర ‘’కు ప్రశంసల వీరతాళ్లను
మాటల ,పాటల పసందు తో వేసి
‘’జ్ఞాన పీఠం ‘’ పై కూర్చున్నా
నిత్య కవిత్వ సరస్వతీ సమార్చన చేస్తూ
ప్రసంగానికి మాధుర్య సుగంధాలు పూయిస్తూ
నాగేశ్వర రావు నారాయణ రెడ్డిలేని సభ
భాగ్యనగరం లో ఉండదనిపించి
నిండు జీవితం గడిపి దివికేగిన
పుంభావ తెలుగు సరస్వతి
సింగి రెడ్డి నారాయణ రెడ్డి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

