సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు-2
24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -2
6-శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు –గుంటూరు -9573423303
సాహితీ బంధం
మనుషులను కలిపి –మనసులను ముడి వేసి –మురిపింఛి మెరిపించు దివ్యౌషధము –సాహిత్యము .
ఎల్లలను చెరిపేసి –ఎల్లవారికి సుమ సౌరభము పంచి –శాంతి సౌఖ్యములనిచ్చు కల్పవల్లి –సాహిత్యము .
కొత్తజ్ఞానము నిచ్చి -,పాత యాతన తీర్చి-సంస్కారము నేర్పి –సత్కార్యములు చేయు –సజ్జనుల మైత్రి కుదుర్చు సాధనము –సాహిత్యము .
కమ్మని కల-కమనీయ కళ –సమ్మోహ పరుచు పరిమళం –సాహితీ మిత్రుల సమ్మేళనములకు వేదిక – సాహిత్యము .
మన౦దరిని కలుపు మాధ్యమము –సంస్కృతి కాపాడు సదనము –నవయవ్వన వదనము –రేపటి లోకి నడుపు ఇంధనము –సత్పురుషుల ధనము –సాహిత్యము .
సువిశాలమది –ఆనందాల నిధి –సజ్జనుల సన్నిధి –తరతరాలకు వారధి –ఆదర్శాలకు సారధి –సాహిత్యము .
సంస్కరణల గని –వెలలేని మణి-పచ్చని మాగాణి –తెలుగుతల్లి కాలి పారాణి –తెలుగు వారి ఆభరణం –సాహిత్యం .
సాహిత్యాభిమానులను ఒక్కటి చేసిన –సాహితీ బంధం .
జ్ఞానామృత ఫలముల నిచ్చు వృక్షమై –క్రమ శిక్షణ నిచ్చు –రక్షణ కవచమై –కొంగ్రొత్త ఆశలకు ఆలవాలమై –అనుభూతులకు ఆలంబనై –కొత్త పొత్తముల కూర్పుకు రూపై –మా ‘’నవ ‘’శక్తైమానవ శక్తై –జగమంతా ఆనందము నింపు చుండగ-సాహితీ బంధువులకు-మనసారా జేజేలు పలుకుదాం –మన బంధాన్ని మరింత బలపరుచు కుందాం .
7- శ్రీ కంచి భొట్ల ఫణి రామ లింగేశ్వర శర్మ –చెరుకూరు –ప్రకాశం జిల్లా
1-ఏ జన్మమందు చేసిన –పూజలో జపమో –ఈ జనని పాదములకడ –సుజనుల సాంగత్య మంది –శుభములు వడసెన్ .
2-అమ్మ పిలుపు తోటి –అమృతమైన భాష అమ్మ భాష –మాట మాట లోన మధురస భావాల –తేనె లొలుకు తీపి తెలుగు భాష .
3-నన్నయాది కవుల నందించెనా తల్లి – కృష్ణరాయ చేత కీర్తి నొందె-పొరుగు భాషలన్ని పొలుపున చేరగా –తలుపు తీసి వలచె తెలుగు భాష .
8-మధురకవి -శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ-విజయవాడ -9299303035
1-బంధము లుండగా వలయు పాపము పుణ్యము పొంద గోరినన్ –బంధమె జీవజాతికిని బాసట యౌనుగజీవితంబునన్
బంధమె భోగ మోక్షముల బంధువుగా తలపోయ వచ్చుగా –అందము చిందు జీవనము నాశలు తీరగ నెల్ల కాలముల్ .
2-కొన్ని బంధాలు పుణ్యంబు గూర్చు గాదె –కొన్ని బంధాలు పాపాలు కూర్చుగాదె
కొన్ని దుఃఖమ్ము దుర్గతుల్ కూర్చుగాక –తె౦పవలెనట్టి బంధాలు తెగువ తోడ .
3-కాని
సరస సారస్వత సంబంధ బంధమే-సుధలను చిందించు శోభ గూర్చు
మధుర మధురములౌ మధురోహలను నింపు –మాన్యుని చేయు సామాన్యున్యునైన
వ్యధలను తొలగించి వాంచలు తీర్చును –లలిత పదములతో లాలిపాడు
నరులను వరులుగా నవ్య రీతుల జూపు –మనసు దోచు మధుర మధురసమ్మె
కాన సాహితీ బంధమె కనకమగుచు –మరువ లేనిది మనభాష మరులు గొల్పు
ఎల్లవారికిది ఇచ్చు నీప్సితములు –బుధుల చేయును మహర్షుల బుద్ధి నిచ్చి .
4-నన్నయ్య మొదలుగ నవకవులను గూడి –విజ్ఞానమిచ్చును వేదమట్లు
అమ్మ పాలను వోలె నాదరంబున చూచి –అలరించు సతతము ను అమ్మ వోలె
సాహితీ బంధమై సారెకు యెద నిల్పు –అజ్ఞాత బంధువై అమృతమగును
సాహితీ గగనాన చల్లని జాబిలై –వెన్నెలల్ కురిపించి వెలుగు చుండ
రక్తగతమైన బంధమై భాషగా రాణ కెక్కె-తెలుగు సాహిత్యమెనరుల తీరు మార్చు
జీవమున్నంత వరకును చేవ నిచ్చు –విడువరానట్టి ది యగు విడువ లేము .
5-నన్నయ్య తిక్కన్న నాటిన వృక్షాల –ఫలరసము గ్రోలు భాగ్యమంది
బద్దెన వేమన్న బుద్ధులు నేర్పింప –బుధులుగా మారెడి బుద్ధి నంది
రామణీయమైనట్టి రామభక్తిని పొంది –త్యాగయ్య గీతాల రాగమంది
గురజాడ శ్రీశ్రీ లగురుజాడలను పొంది –గౌరవమైనట్టి గమనమంది
మేటి కవులు ను నడయాడ సాటిలేని –వెలుగులను పొంది కీర్తికి ప్రీతి నంది
తెలుగు దేశాన పుట్టుటన్ కలిగె నంచు –సతత మానంద మార్గాన సాగు మనము .
6-భారత భారతీ బహు భాగ్యముల గూర్చె-భావి తరాలకు బంధమయ్యె
భాగవతము చూపెభక్తీ రసాస్వాద-మానంద సంద్రాన మగ్నమగుచు
శ్రీనాధు డిచ్చిన సీసాల సుధలను –గ్రోలి దివిజ సుఖము కొంత పొంది
నీతి పానీయములు నిర్మల మనసులో –మనకు పంచెను నాడు మాన్యతలను
నాటి వారలతో పాటు నేతికవులు –ఇచ్చె మనకెన్నో సుధలను యింపు మీర
రక్త గత బంధమై రాణ కెక్కె-తె౦పరాని దీ బంధమ్ము యిల తెలుగు తోడ .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-1-18 –ఉయ్యూరు