తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు
మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ 13-4-18 శుక్రవారం రాత్రి హైదరాబాద్ లొ మరణించటం ,14 శనివారం ఉదయానికి మా చిన్నమేనల్లుడు శాస్త్రి అమెరికా నుంచిరావటం ,వెంటనే దహన క్రియలు శాస్త్రోక్తంగా ప్రారంభించటం , 15 వతేదీ ఆదివారం అస్తి సంచయనం ,16సోమవారం నాలుగవ రోజు బీచుపల్లి కృష్ణానదిలో కొంత అస్తి నిమజ్జనం చేసి మిగిలిన దాన్ని కాశీ గంగానదిలో నిమజ్జనానికి ఉంచటం చేశారు ,అయిదవ రోజు మంగళవారం నుంచి నిత్య కర్మ ప్రారంభించి సోదరులిద్దరూ అత్యంత భక్తీ శ్రద్ధలతో నిర్వహిస్తూ ,ఏ రోజు కా రోజు ఇవ్వాల్సిన దానాలు యధాప్రకారం ఇచ్చారు . .
,10 వ రోజు 22-4-18 ఆదివారం దశాహం లొ తిలోదకాలు జ్ఞాతులతో ,ధర్మోదకాలు
బంధు మిత్రులతో ఇప్పించారుబ్రహ్మగారు ..మా బావ గారు వివేకానందం గారితో తిలోదకాలు ఇప్పించి అమెరికా నుంచి వచ్చిన మా బావగారి అన్నగారు ముకుందం గారబ్బాయి వేలూరి పవన్ ఒక్కడే జ్ఞాతి గా వచ్చాడుకానుక అతనితో నూ తిలోదకాలు యధాప్రకారం ఇప్పించారు .తర్వాత బంధువులైన నేనూ, మాతమ్ముడు ,మద్రాస్ నుంచి వచ్చిన మా పెద్దక్కయ్య కుమారుడు గాడేపల్లి శ్రీనివాస్ ,అశోక్ అల్లుడు విశ్వనాధ మురారీ ,ముకు౦ద౦ గారి పెద్దల్లుడు బందరులో అశోక్ స్నేహితులు సాయి, సింహం గార్లు ,మా చిన్నమేనల్లుడు శాస్త్రి భార్య విజయలక్ష్మి మేనమామ శాస్త్రి బావమరదులిద్దరు సత్యనారాయణ ,కామేష్ లతో ధర్మోదకాలు ఇప్పించారు .శనివారం రాత్రికే శాస్త్రి భార్య విజయలక్ష్మి కొడుకు కృష్ణ,కూతురు వీణ బావమరది కామేష్ లు అమెరికానుంచి వచ్చారు .తర్వాత పుట్టింటి వారు ఇవ్వాల్సిన 16 జతల చేటలు వగైరాలను మా సోదరులిద్దరం ఏర్పాటు చేయించి ముత్తైదువులకు చేటలదానం ఇంటిదగ్గర ఇప్పించారు.దీన్ని తోటికోడళ్ళుఅంటే మా అక్కయ్య కోడళ్ళు సంధ్య విజయలక్ష్మి,మా మరదలు సునీత మడితో శుద్ధిగా శ్రద్ధగా చేశారు .ఆతర్వాత కేటరింగ్ ద్వారా భోజనాలు కింద ఏర్పాటు చేశారు .మేము మేడమీద మా మేనల్లుళ్ళపాటు మడిభోజనం చేశాం.భోజనం సమయానికి బంధు మిత్త్ర గణం అంతా మా అక్కయ్య , బావగారి కుటుంబంపై ఉన్న అమిత గౌరవం ఆపేక్ష అభిమానాలకు హాజరై తమ ధర్మ౦ నెరవేర్చారు.హాజరైన వారిలో ముకుందం గారి కూతుళ్ళు అల్లుడు కొడుకు ,మాబావ గారి తమ్ముడు అబ్బి భార్య ,మా బావగారి అక్కయ్యల కుమార్తెలు ,కొడుకులు అశోక్ మామగారు అత్తగారు ,బావమరదులు వాళ్ళ భార్యలు ,శాస్త్రి అత్తగారు మారుతి గారు ,కొడుకులు పెద్దకొడుకు భార్య కొడుకు కూతురు ,వేదవల్లి కొడుకు రవి భార్య గాయిత్రి ,మద్రాస్ నుంచి వచ్చిన మా పెద్ద మేనకోడలు కళ ,స్నేహితులు చుట్టు ప్రక్కల వాళ్ళు అందరూ ఉన్నారు .పిచ్చాలక్కయ్య కొడుకు వారణాసి సుబ్రహ్మణ్య౦ కూడా వచ్చాడు .ఆదివారం కావటం తో అందరికీ రావటానికి వెసులు బాటు కలిగింది .సుబ్రహ్మణ్యానికి ,మా బావ మేనకోడలు నా సాహిత్య ఫాన్ సాహిత్య అభిమాని జనమంచి వారమ్మాయికీ మన పుస్తకాలు ఇచ్చాను సుబ్రహ్మణ్యం వాటిని చూసి అమాంతం నా పాదాలపై వాలిపోయాడు అంత ఆనందం పొందాడన్నమాట .వాడికి రేపల్లెలో డిసెంబర్ 24న ఆవిష్కరించిన పుస్తకాలు 1-గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ ,2- ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు అందజేసి రేపల్లెలో వాళ్ళమాతామహుడు, మా బాబాయి- రాయప్రోలు శివ రామ దీక్షితులుగారి ఇంటిప్రక్కనే గీర్వాణం స్పాన్సర్ యల్లాప్రగడ రామ మోహన రావు గారిల్లు అని వీళ్ళ కుటుంబం వాళ్ళు అందరూ ఆయనకు తెలుసునని ఆ వివరాలన్నీ పుస్తకాలలో ఉన్నాయని చెప్పాను .చాలా సంతోషించి ఆయన సెల్ నంబర్ తీసుకున్నాడు .’’తెలుగు విద్యార్ధి ‘’మాసపత్రిక సంపాదకులు ,మాజీ శాసనమండలి సభ్యులు స్వర్గీయ కొల్లూరి కోటేశ్వరరావుగారి అబ్బాయి రమణ ,కుమారుడు కూడా వచ్చారు .రమణకు పద్మ కొడుకు తేజకు మంచిస్నేహం .మాఅ క్కయ్య పోయిన రోజూ హాస్పిటల్ లోను మర్నాడు ఇంటి కి వచ్చి చూసి వెళ్ళారు .
23-4-18-సోమవారం షోడషం
11 వ రోజు షోడషం ఉదయం 8- 30 కే పైన మేడమీద ప్రారంభించారు .పుణ్యాహవాచనం చేయించి 12 మంది బ్రాహ్మణులతో రుద్రం అంటే నమకచామకాలు 20 నిమిషాలలో చెప్పించి ఒక్కొక్కరికి 1200 రూపాయలు ఇచ్చారు .అంటే నిమిషానికి ఒక్కొక్కరికి60 రూపాయలు అన్నమాట .తర్వాత వృషోత్సవం సందర్భం గా మైల బ్రాహ్మణులు భోక్తలు షోడష పిండాలు దానాలు – భోక్తలభోజనాలు ఈ కార్యక్రమం అయ్యేసరికి మధ్యాహ్నం 2- 30అయింది .అప్పుడు మేము భోజనాలు చేశాం .మధ్యాహ్నం 3-30కి నేను కాబ్ లొ బయల్దేరి మల్లాపూర్ వచ్చి ,బట్టలన్నీ వాషింగ్ మెషీన్ లొవేసి వేడి నీటి స్నానం చేసి ,రాత్రి కొద్దిగా భోజనం చేసి పడుకున్నాను .మా బావగారి చివరి చెల్లెలు ఉమా కుమారుడు రాజమండ్రి నుంచి వచ్చారు .
24-4- 18 మంగళవారం –సపిండీకరణం
12 వ రోజు సపిండీకరణం కు నేనూ మా ఆవిడ ఉదయం మల్లాపూర్ నుంచి కాబ్ లొ బయల్దేరి బోయిన్ పల్లి సుమారు 9- కి చేరాం .అప్పటికే అక్కడ ఉదయం 7 గంటలకే కార్యక్రమం ప్రారంభించి నలుగురు మైల బ్రాహ్మణ భోక్తలతో కార్యక్రమం పూర్తీ చేయించారు.కపిల వర్ణపు గోవును 15 రోజుల దూడను తెప్పించి పూజాదికాలు నిర్వహించి ,ఆవు యజమాని గోపాలాచార్యులుగారికి అశోక్ ,శాస్త్రి సోదరులు శాస్త్రీయంగా గోదానం ఇచ్చారు .దాని పోషణ ఖర్చులకు కూడా భారీగానే ధన దానం చేశారు .
తర్వాత అందరూ మేడ మీదకు వచ్చి దశదాన,షోడష దానాలు యధాప్రకారం గా ఇచ్చారు ఇదంతా అయ్యేసరికి ఒంటిగంట దాటింది .కింద కేటరింగ్ భోజనాలు సిద్ధం చేయించి భోజనాలు చేసేవారికి ఇబ్బంది కలగకుండా చేశారు .ఢిల్లీ నుంచి వచ్చిన మాబావగారి పెద్దబావగారు స్వర్గీయ మైలవరపు కృష్ణశాస్త్రిగారి పెద్దమ్మాయి స్వర్గీయ డా లలిత భర్త గారు ,కృష్ణశాస్త్రి గారబ్బాయి మేమందరం సరదాగా పిలిచే అశోక్ స్నేహితుడు జిడ్డు పద్మ పెదమామగారబ్బాయి గారు , కృష్ణశాస్త్రిగారి ఇద్దరు కుమార్తెలు వచ్చారు .కృష్ణ శాస్త్రిగారి అల్లుడుగారికి మన పుస్తకాలు ఇస్తే పరమ సంతోషించారు .పవన్ కు గీర్వాణం ౩ ,ఆధునిక ప్రపంచ నిర్మాతలు అందజేశా .కామేష్ కు మారుతి గారికి కృష్ణ శాస్త్రిగారబ్బాయికి మరుతిగారికి అశోక్ మామగారికీ ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’ఇచ్చాను పరమానంద పడ్డారు .ఉయ్యూరులో నీలగిరి కాఫీ స్టోర్స్ ను గోసుకొండ రామ చంద్రుడితో పాటు జాయింట్ పార్టనర్ గా నడిపిన గురజాడ వాస్తవ్యులుచాల్లా సూర్యనారాయణ గారబ్బాయి ఇక్కడ వడ్డనకు వచ్చాడు అతడే నన్ను గుర్తు పట్టి పలకరించాడు .అతని తలిదండ్రులతో నేనూ మా అమ్మా కలిసి 1963 వేసవిలో శ్రీశైలం వెళ్లి సత్రం లొ నేలరోజులున్నాం .తర్వాత మహానంది చూశాం ..ఆ విషయాలు గుర్తు చేసుకున్నాం .శ్రీశైం నుండి ఉయ్యూరురాగానే నాకు కృష్ణాజిల్లా బోర్డ్ హై స్కూల్ లొ సైన్స్ మేస్టర్ ఉద్యోగం మోపిదేవి లొ వచ్చింది .ఇతని కూతురు టెన్త్ చదువుతోందని ,ఆ అమ్మాయికి షుగర్ అని రోజూ ఇన్సులిన్ చేసుకోవాల్సి వస్తోందని మాటల సందర్భం లొ చెప్పాడు ఆమె వైద్యం నిమిత్తం కొంత డబ్బు చేతిలోపెడితే ఆశ్చర్యపోయాడు .అలాగే భార్గవి మురారీల కొడుకులిద్దరూ నిన్న అస్సలు అల్లరి చేయకుండా పరమ క్రమ శిక్షణలో ఉన్నందుకు చెరొక వందా ఇచ్చి ఐస్ క్రీములు కొనుక్కో మన్నాను .
అప్పుడు మళ్ళీ పున్యాహవచనం ,విఘ్నేశ్వర పూజ చేయించి ఇద్దరు భోక్తలతో మా మేనకోడలు పద్మ ను సువాసినీ ముత్తైదువగా కూర్చోబెట్టి మాసికం పెట్టించారు .ఇది పూర్తీ అయ్యేసరికి 2-30అయింది .మేమిద్దరం మా బావ మేనల్లుల్లతో మడి భోజనం చేశాం .
సాయంత్రం 4 గంటలకు ఆశీర్వచనం .మా మేనల్లుల్లకు వాళ్ళ బావమరదులు నూతన వస్త్రాలు ఇచ్చారు .అవికట్టుకుని ఆశీస్సుకు కూర్చున్నారు .మా సోదరులం మా బావగారికి ,మా ఇద్దరు మేనల్లుళ్ళకు పంచల చాపులు పెట్టాము .ఇద్దరు వేదం పండితులు ఘన జట చదివి వేదాశీస్సు పలికారు .తర్వాత బ్రహ్మగారు సుబ్రహ్మణ్య శర్మగారు ఈ దినవారాలు ఎందుకు చేయాలి ఏయే ఫలితాలు వస్తాయి అనే విషయాలు వివరించారు. తర్వాత నన్ను మాట్లాడమంటే ‘మా మేనల్లుళ్ళకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు .తలిదండ్రులను 24 గంటలూ ఏడురోజులూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు . ఆన్నదమ్ముల అనుబంధం అంటే నాలాంటి వాడికి కూడా వాళ్ళు ఆదర్శమే .మా బావ గారిది సున్నితమనస్సు .చిన్న పిల్లాడి తత్త్వం .కనుక ఆయనను గాజు పూసలాగా సంరక్షించుకోవాలి .మా మేనకోడలు పద్మ ఈ 12 రోజుల కార్యక్రమాన్నీ ఎంతో హుందాగా దక్షతతో ,అన్నలమనసు లెరిగి చక్కగా నిర్వహించేట్లు చేసింది .కడుపులో దుఃఖ బడబాగ్నులు రగులుతున్నా ,ఏడుపుల సుడిగుండాలు విజ్రు౦భి స్తున్నా ఎక్కడా పైకి కనబడ నీయకుండా గుండెలోపలి పోరాల్లోనే దాచుకుని , ఏడుపులు పెడబొబ్బలు శోకాలు లేకుండా సోదరులిద్దరు చెల్లెలు ప్రవర్తించిన తీరు చిరస్మరణీయం .అలాగే బ్రహ్మగారు శర్మగారు సమయపాలన ,విధివిధానం శాస్త్రోక్తం గా పాటించి ,యజమానుల మనసెరిగి అన్నీ సక్రమగా అందరికీ సంతృప్తి కలిగేట్లు చేసిన విధానం ప్రశంసనీయం .ఇంత మంది బ్రాహ్మణీకాన్ని సమకూర్చి అందరికీ అన్ని రకాల దానాలు వారి వారి అర్హతలను బట్టి సంతృప్తి గా ఇప్పించి అందరికీ పరమ సంతృప్తి కలిగిచారు . అందుకు వారు బహుధా అభినదనీయులు . మా అక్కా బావల కొడుకులే కాక కోడళ్ళు ఇద్దరూ తమ బాధ్యతను ఘనంగా నిర్వహించారు .వాళ్ళ పిల్లలు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు అందరు చేసిన సేవ కృషి మెచ్చదగింది .
వీటన్నిటికి మించి ఏ సంబంధం లేకపోయినా ,కేవలం కారు డ్రైవర్ గానే ఉన్న వర్మ అతని తల్లి చెల్లెలు మా అక్కాబావ ల కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడారు .ఏపనికీ విసుగు లేదు . అన్ని పనులూ చేసి ఆ కుటుంబం విశ్వసానికే కొత్త అర్ధం పరమార్ధంగా నిలిచారు .వాళ్ళను మాటలతో పొగిడి సంతృప్తి చెందిచ లేము .అనితరసాధ్యం ఆ సేవలు .ఏదో మానవాతీత శక్తి వాళ్ళలో ఆవహించి వారితో ఇన్ని సపర్యలు చేయించింది .అలాగే మా అక్కయ్యకు సేవ చేసిన నర్సులు వంట వండి పెట్టిన ఆవిడా ఋణం తీర్చుకోవటం సాధ్యంకాదు .’’అన్నాను .నేను ఆపేయ్యగానే లోపల దాచుకున్న దుఖం అంతా ఆనకట్ట బద్దలైనప్పుడు వచ్చే ఉద్రుతిగా మా వాళ్ళందరి కళ్ళలోనుంచి శోకదార కారింది . తర్వాత పద్మ పెదమామగారబ్బాయి రిటైర్డ్ స్టేట్ బాంక్ ఆఫీసర్ మాట్లాడి తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు .అంతా అయ్యేసరికి 5-30 అయింది .శాస్త్రి మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సేవలకు సరసభారతి కార్యక్రమాలకు ఉపయోగించమని నాకు ఒక చెక్ రాసి ఇచ్చాడు.నేనుదానిని చూడకుండా నా హాండ్ బాగ్ లొ పెట్టుకున్నాను .ఉయ్యూరు వెళ్ళాక చూస్తాను .
ఇలా ఇద్దరు కొడుకులు తమల్ని కనీ పెంచి పెద్ద చేసినందుకు ,పవన్ తనను తన అక్కగార్లను తన తండ్రిగారు చనిపోయాక మా బావా అక్కయ్యా కడుపులో పెట్టుకుని వాళ్లకు ఏ లోటూ రాకుండా కాపాడి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా తమ చేతులమీదుగా జరిపించినందుకు ,శాస్త్రి ,అమెరికా తీసుకు వెళ్లి చదివించి ,ఉద్యోగానికి సాయం చేసినందుకు ,అమెరికాలోమా అక్కయ్యా బావలు శాస్త్రి దగ్గరున్నప్పుడు అక్కడికి కామేష్ వచ్చి ఉంటే అతని బాధ్యతనూ వీళ్ళు నిర్వహించినందుకు బావ గారేకాక తానూ ‘’అత్తయ్యగారూ అత్తయ్యగారూ ‘’అంటూ వెంట వెంట తిరిగి తన ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచిన మా అక్కయ్యకు కడసారి కృతజ్ఞతలు చెప్పటానికి వచ్చి నందుకు ,అశోక్ స్నేహితులు మర్చిపోకుండా వాడి స్నేహానికున్న విలువను గుర్తు చేసుకోవటానికి వచ్చినందుకూ ,సోదరుల బావమరదులు కుటుంబాలతో వచ్చి తమ అభిమానాన్ని చాటి నందుకు ,మద్రాస్ నుంచి మా మేనకోడలు మేనల్లుడు పిన్ని పై ఉన్న ఆదరాన్ని వ్యక్తం చేయటానికి వచ్చినందుకూ ,మాబావ హితులు సన్నిహితులూ ,స్నేహితులు ,మా అక్కయ్య ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళూ వచ్చి ఆమె చూపిన ఆత్మీయతకు ప్రతిగా తాము రావటం ధర్మమని భావించి వచ్చినందుకూ మా అక్కయ్య ఆత్మ పరమ సంతోషం పొంది ఉంటుందని భావిస్తున్నాను .
మా అక్కయ్య చివరి రోజుల్లో చూడటానికి అవకాశం కుదరని నేను దహనం రోజున, తొమ్మిదవ రోజు నుంచి 12 వ రోజూ వరకు ఇక్కడే మేనల్లుళ్ళ దగ్గర ఉండటం నాకు కొంత ఊరటగా ఉంది . మా విధి ధర్మం . పవన్ నేనూ రెండు రాత్రులు ఒకే మంచం మీద పడుకున్నాం షార్లెట్ బంధాన్ని మళ్ళీ ఆరు నెలలకు దృఢం చేసుకున్నాం . ఇలా అందరూ తమ తమ రుణాలను ఈ విధంగా తీర్చుకుని మా అక్కయ్య మనసుకు శాంతి కలిగించారు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-4-18 కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—
విధానం, ప్రాధాన్యత, ఔచిత్యము, ,కామా, లు తడబడ్డాయి తప్ప, వ్రాసిన విధానం హర్షనీయం.