కొంగర కలాన్ -కొంగర మల్లయ్య గుట్ట
కేసి ఆర్ జరిపిన కొంగర కలాన్ సభ పేపరు, ఛానెల్ వార్తలు ,”కుండబద్దలు ”కొట్టే కాటా సుబ్బారావు విశ్లేషణ చూశాక నా కెందుకో కొంగరమల్లయ్య గుట్ట జ్ఞాపకం వచ్చింది . ఇంతకీ ఇదెక్కడుంది అంటారా ? జగ్గయ్యపేట కు వెళ్లే దారిలోచిల్లకల్లు దగ్గర ఎడమవైపు ఉన్న ఎత్తైన కొందనే కొంగర మల్లయ్య గుట్టఅంటారు .పూర్వం అంటే సుమారు అరవై ,డెబ్బై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతమంతా విపరీతమైన చెట్లు ,చిన్నగుట్టలు ,పొదలతో భయంకరంగా ఉండేదట మా అమ్మావాళ్లు చెప్పారు .అప్పుడు ఎక్కడికి వెళ్లినా రెండెడ్ల బండీ ప్రయాణమే . అసలే మట్టి ఇరుకు రోడ్డు . బ0 డీలో ప్రయాణమంటే ఉయ్యాలలూగటమే . దీనికి తోడు దొంగల ,బంది పోట్ల భయం తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగించేవారట . అటువంటప్పుడు మనకు ప్రాణ సంకటం అయితే దొంగలకుజనం ప్రాణాలతో చెలగాటమేకదా .ఈ గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు కొంగర మల్లన్న అనే గజ దొంగ .
మల్లన్న గుట్టపైకి ఎక్కి నివాసం ఉండేవాడు .వాడికి వందలాది అనుచరగణం వీర విధేయంగా ఉండేవారట .వాడి ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ . ఈ దారిలోకాలినడకన వెళ్లే ప్రయాణి కులను ,బండ్లలో వెళ్లేవారిని ఆపి వారిదగ్గరున్న సర్వం దోచేసేవారు . ఇవన్నీ కధలు గాధలుగా ప్రచారం అయ్యేవి. మల్లన్న అనుచరుల ఆగడాలు రోజు రోజుకీ మితి మీరు పోయాయి బిక్క చచ్చి ప్రయాణంచేసేవారానాడు .
మల్లన్న ఒక గొప్ప టెక్నీక్ ఉపయోగించేవాడట దోపిడీకి .గుట్టపైనుంచి గట్టిగా అరుస్తూ ”నేను కొంగర మల్లయ్య ను .మీ దగ్గరున్నదంతా మా వాళ్లకు ఇచ్చి ప్రాణాలు దక్కించుకొ0డి .నేను దిగివచ్చానా మీ ప్రాణాలు కూడా ఉండవు మీ ఆడాళ్ళమానాలూ దోచేస్తా . అంతదాకా తెచ్చుకోకండి .డబ్బు, విలువైన ఆభరణాలు పొతే మళ్ళీ మీరు సంపాదించుకోవచ్చు ప్రాణ ,మానాలు పొతే మళ్ళీ రావుకదా .కనక నా హెచ్చరికను గమనించి మీ దగ్గరున్న సమస్తం మా వాళ్లకు ఇచ్చేసి హాయిగా ముందుకు సాగి పొండి ‘ అని మీసాలు మెలేస్తూ భయపెట్టేవాడు . దొంగ అంటేనే కాళ్ళు వణుకుతాయి మరి గజ దొంగ బంది పోటూ అంటే గజగజ వణకటమే కదా . పాపం చేసేది లేక, దిక్కు తోచక, రక్షణ లేక వాడి పాలబడి సర్వస్వము అంటే మాన ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే ఉన్నది వాడి మొహాన పడేసి ప్రాణాలు దక్కించుకోవటం మంచిది అని భావించి ,ఉన్నది అంతా ఊడ్చేసి నిలువు దోపిడీ ఇచ్చేసి గండం నుంచి బయట పడే వాళ్ళట . వాడి ఆగడాలు రోజు రోజుకూ మితిమీరి పోతున్నాయి .వాడు కొండ దిగకుండా ఇదంతా మేనేజ్ చేసేవాడు .వాడిని ఎవ్వరూ చూసిన పాపాన పోలేదు .ఎలాఉంటాడో తెలీదు వాడి అరుపులు కేకలు హెచ్చరికలే దోపిడీలకు పెట్టుబడి . వాడి మందీ మార్బలం సరేసరి ,ఇలా చాలాకాలం గడిచిపోయింది . పైన వాడొక్కడు మాత్రమే ఉంటాడని కొందరు సాహసవంతులైన యువకులు గ్రహించారు .వాడి గుట్టు రట్టు చేయాలని సంకల్పించుకొన్నారు .
యువకబృందం బందరు జగ్గయ్యపేట దారి గుండా కాకుండా కొండ అవతలి వైపు నుంచి కొన్ని రోజులు కస్టపడి ఎక్కి కొంగర మల్లన్న ఉండే స్థావరం చేరుకున్నారు .వాడు కుర్చీలో లుంగీతో ,తెగబారెడు మీసాలతో భయంకరంగా కని పించాడు .చేతులున్నాయి కానీ వాడికి కాళ్ళు లేవు అని గ్రహించారు . అంతే ఒక్కుమ్మడిగా వాడిపై దాడి చేసి చంపి పారేశారు . వాడు జనంతో ”నేను దిగితే మనిషిని కాను ”అని ఎందుకు భయపెట్టే వాడో గుట్టు తేల్చారు. దిగటానికి అసలు వాడికి కాళ్ళు ఉంటేగా . దొంగరాముడు సినిమాలో రేలంగి మీసం మెలేసి ”నేను వీరభద్రయ్యను ”అనటం యెవడైనా అతడికి బుద్ధి చెబితే ”కాదు కాదు వొట్టి భద్రయ్యనే”మీసం దించేసి అనటం మనకు తెలిసిందే . మల్లయ్య చచ్చాక జనం పీడా విరగడైంది . హాయిగా ఊపిరి పీల్చుకొని ప్రాణభయం లేకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు .కానీ ఆ గుట్టకు ”కొంగరమల్లయ్య గుట్ట ”అనే పేరు మాత్రం సార్ధకమై పోయింది .అప్పటినుంచీ లోకం లో ఎవరైనా బెదిరిస్తే ”నువ్వో కొంగరమల్లయ్యవు నీకు భయపడేదేంటి “‘అనే సామెత వాడుకలోకి వచ్చింది .
” కత బానే సెప్పావ్ సామీ ” దీనికీ కొంగర కలాన్ కు సాపత్యమేంటి అంటారా ?అక్కడ కేసి ఆర్ సభకూడా వస్తారనుకొన్న పాతిక లక్షలజనం రాకుండా వేల వాహనాలు పెట్టి మనిషికి రెండు వేలిచ్చి తోలుకొచ్చినా పాకెట్లు , సీసాలు సరఫరా చేసినా మూడు నాలుగు లక్షలకు మించి జనం రాకపోవటం కొంగరమల్లన్న ప్రగల్భాలులాగానే ఉన్నాయని నేను చెప్పలేను బాబూ . తనకు వారసుడు కొడుకు తారక్ అతడే గులాబీకి తారకమంత్రం అని ప్రకటిద్దామనుకొంటే అంటా ఉల్టా పల్టా అయిందని నేను చెబితే బాగుండడదు గురూ . ఏవేవో పాలసీ మేటర్లు జనాలకు తాయిలాలుగా అందిద్దామని అనుకొన్న అధినాయకుడి గుండెల్లో జన్నాన్ని చూసి గుండెల్లో రాళ్ళుపడి ,మాటలు తడబడి గొంతు తడారిపోయి కక్కా లేక మింగా లేక పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్లు విలవిల్లాడాడని నే సెప్పలేనుసారూ . రెండు నెలలనుంచి తానూ మీడియా ఊదరకొట్టిన ముందస్తు ప్రకటన చేద్దామని వచ్చి ఖంగుతిని చెప్పలేకపోయాడని చెపితే అస్సలు బాగుండదయ్యా . కొడుకు మీద ప్రేమ, వ్యామోహం ”గుడ్డి రాజు” వంశానికి యెంత క్షోభ తెచ్చిందో తెలియందేమిటి చెప్పాల్సిన అవసరమేంటి అయ్యవారూ .. ఇప్పుడు తప్పు తెలిసి మేనల్లుడికి బాధ్యత అంతా నెత్తికెత్తటం వివేకమోకాదో మీరే తెలుసుకోండి సాములూ . అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ తో భాయ్ భాయ్ అని సీట్లు కొల్లగొట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయం కప్పుకొని మళ్ళీ దండుకొందామన్న అత్యాశ గులాబీ నాయకుడిదని నే సెప్పాలాసారూ. ఓటర్లు ఫూల్స్ అవుతారో అధినాయకుడిని ఫూల్ ని చేస్తారో వేచి చూదాం బాబుల్లారా .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-18 -ఉయ్యూరు
—
Andhra Pradesh
India
Cell :
9989066375
8520805566
Land Line : 08676-232797