ధ్వని కోణం లో మను చరిత్ర -5’
ఉత్తమ ధ్వనికావ్యం మను చరిత్ర అని ము౦దే చెప్పుకొన్నాం .ఈ ప్రబంధం లో పదాలలో ,పద్యాలలో ,పాత్ర స్వరూప స్వభావ చిత్రణలో ,సంభాషణలలో ,ప్రకృతి వర్ణనలలో ,ఏదో ఒక రసమో, భావమో ,అలంకారమో ,వస్తువో వ్యంగ్య వైభవంగా దర్శనమిస్తుంది అంటారు శ్రీ రాజన్న శాస్త్రి గారు .మొదటి ఆశ్వాసం లో ప్రవరుని వర్ణిస్తూ ‘’మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి ‘’అనే ఒక్కమాటే చెప్పాడు కవి పెద్దన .అవయవ వర్ణన చేయలేదు .కాని వరూధిని ముఖతహా రెండు సార్లు ఇతని సౌందర్య వర్ణన చేయించాడు .’’ప్రవరుని వదనం లావణ్య వారాశి .విశాలమనోజ్నమైన ముఖ శోభను ఇనుమడిస్తున్నాయి .భుజాలు ఉన్నతాలు .ఉదర వైశాల్యం ఆశ్లేష ఇచ్ఛ ను కలిగిస్తుంది .పదాలు చిగురాకు సౌకుమార్యాలు .శరీర కాంతి తో కనులలో అమృతం కురుస్తున్నట్లు ఉన్నాడని వరూధిని వర్ణన .’’నేరెటేటియనల్ తెచ్చి ,నీరజాప్తు –సానబెట్టిన రాపొడి చల్లి ,మెదపి-వదను సుధ నిడిచేసెనో పద్మభవుడు -వీని గాకున్నగలదెఈ మేనికాంతి !’’అదీ ప్రవరుని లావణ్యకాంతి.దీనికే పడిపోయింది వరూధిని .ఇక్కడ ప్రవరుడు ఆలంబన విభావం .అతని లోకోత్తర సౌందర్యం ఉద్దీపనవిభావం .ఈ వర్ణన అనుభావం .వితర్కించటం వ్యభి చారీభావం .వీటివలన వరూదినిలో రతి అభి వ్యక్తమై శృంగార రస ధ్వని ఔతోంది అని చక్కని ఆలంకార భాషలో విశ్లేషించి చెప్పారు శాస్త్రిగారు .ప్రవరుని అవయవ లావణ్యం లోకోత్తరం అని ఆమె ‘’కాకున్నకలదె ఈమేనికాంతి ‘’అనటం లో నిశ్చయమై వితర్కంవ్యభిచారీ భావం శృంగార రస పరిపోషకమై ధ్వనిస్తోంది ‘’ప్రాదాన్యేనవ్యవ దేశా భవంతి ‘’అనే న్యాయం వలన దీన్ని రసధ్వని అనటం కన్నా ,భావ ధ్వని అనటం సమంజసం అన్నారు శాస్త్రీజీ .
రెండవ సారి ప్రవరుని వరూధిని వర్ణించిన సందర్భం –ఆతడు తిరస్కరించగా పరితపించే టప్పుడు .
‘’కమ్మని కుందనంబు కసుగందని మేనెల దేటిదాటులన్ –బమ్మెర వోవ దోలు దెగబారెడువెంట్రుక లిందు బి౦బముం
గిమ్మన నీదు మోము గిరి క్రేపులు ,మూపులు కౌను గానరా –దమ్మక చెల్ల!వాని వికచా౦బ కముల్ శతపత్ర జైత్రముల్ ‘’.
ఇక్కడ చింతా విశేషం విభావం .’’అమ్మక చెల్ల’’అనటం లో భ్రువువు వగైరా అనుభావాలు .దీనివలన ‘’స్మృతి ‘’అనే వ్యభిచారభావం విప్రలంభ శృంగారం ప్రధానంగా ధ్వనిస్తోందన్నారు శాస్త్రి గారు .కవి ఈ రకమైన వర్ణను ముందే చేసిఉంటే ఈ భావధ్వని ఉండేదికాదు .చెలికత్తెలు వరూదినితో పలికినమాటలలో ‘’చంద్రుడు నిన్నుఇలా చేసిన పాపం ఊరికే పోదు .అది అతని పతనానికి కారణమయింది చూశావా ‘’అనే ఊరడింపు ధ్వనిస్తోంది .ఈ వర్ణన కవే చేసిఉంటే ఈ ధ్వని ఉండేదికాదు .
చంద్రుడు అస్తమిస్తుంటే సూర్యుడు ఉదయించటం వర్ణించిన పద్యం లో విరహం పోయి ,ప్రియ సమాగమం జరుగుతుంది అనే ఊరడింపు ధ్వనిస్తోంది .ప్రతీయమాన ఛాయకవి వాక్కుకు అందం కూర్చింది –‘’కాలపు హొంత కాడు చరమాగమ స్కంధముం జేర్చు ,నిబ్బరపున్ సంగడ మో యనన్, శశి డిగెం బ్రాగ్భూమి భ్రుత్కైత వేతర బాహాగ్రపు సంగడంబనగమార్తాండుండు దోచెన్ దివిన్ ‘’ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-18-ఉయ్యూరు
—

