ధ్వని కోణం లో మను చరిత్ర –6
ఈ ప్రబంధం లో పెద్దనకవి ప్రకృతివర్ణనలు తాను చేయకుండా పాత్రలతో చేయించి కావ్యానికి అందాలు చేకూర్చాడు .వరూదినీతో చెలికత్తె చంద్రాస్తమయాన్నివర్ణిస్తూ –అతనిడికి వరూధిని ముఖాన్నిపోలుస్తూ–‘’దరస్మిత విలాసపు చంద్రిక డొంకి వాడుటం-దేట దొరంగి విన్ననగు నీ మొగమో ?యన మాసి చంద్రుడో పాటలగంధి,వ్రాలె నదె భాను రుచిం దనకందుమీరగన్ ‘’అనటం లో ‘’నిన్ను ఏడిపించిన పాపం ఊరికే పోలేదు .అతడి పతనం ప్రారంభమైందని ప్రతీపాల౦కార౦ తో ధ్వనించింది .ఈ వర్ణన కవే చేసి ఉంటె ఆధ్వనికి అవకాశం ఉండేది కాదు అంటారు రాజన్న శాస్త్రిగారు .
తనదారి కడ్డమున్న వరూధినీతో తనూరికి వెళ్ళే ఉపాయం చెప్పమని –ఎవ్వతె వీవు భీత హరి ణేక్షణ ‘’అనే ప్రసిద్ధ పద్యం లో ప్రవరుని అభిప్రాయం ఒకటి ఆమె అభిప్రాయం వేరోకటిగా కనిపిస్తుంది .’’ఎవ్వతే వీవు భీత హరి ణేక్షణ’’అనటం లో ప్రవరుడు స్త్రీ సహజమైన లజ్జ వదిలి సంభ్రమం తో తన దారికి అడ్డమై ,ఏదో ఆపదలో చిక్కు కొన్నావు నీబిత్తర చూపులు విలక్షణం ఆమె భీతకాదు భీత హరిణేక్షణ అనిపించింది .’’ఒంటి జరించె దోట లేకివ్వనభూమి ‘’అనటం లో మానవ మాత్రుడికి చొరరాని భయంకర ప్రదేశం అని ధ్వనిస్తోంది .ఆమె సామాన్య మానవ కా౦త కాదని , ఆపరిసరాలన్నీ బాగా తెలిసిన అమ్మాయే అని ,తనప్రశ్నకు జవాబు చెప్పగలిగినవారెవరూ లేకపోవటం తో ఆమె చెప్పాలని ప్రవరుని భావం..’’భూసురుడ నే బ్రవరాఖ్యుడ’’అనటం లో ఆమె బిత్తర చూపు స్వాభావికమేనని పించక ఏదో భావం కనిపిస్తోందని తన ప్రవర చెప్పుకున్నాడు పిచ్చి బాపడు .’’త్రోవ త్రప్పితిన్ గ్రొవ్వున నిన్నగా రాగ్ర మునకున్ జనుదెంచి ‘’అనటం లో కిందా మీదా తెలీకుండా ఆబగా వచ్చి ఆపదలో చిక్కు కొన్నాను అనే అర్ధం ధ్వనిస్తోంది .’’పురంబు జేర —శుభంబు నీకగున్ ‘’అనటం లో ‘’ఇంకెవ్విధి గాంతు’’మాటలో ఊరు చేరేఉపాయం తెలియని వాడినని ,’’తెల్పగదవే ‘’ పదం ఆపద గట్టేక్కించ టానికి ఆమే దిక్కు అనీ ,’’శుభంబు నీకగున్ ‘’మాటలలో తన పరాదీనత సాకుగా తనదగ్గరకోరదగింది ఏమీ లేదనీ ,తానిచ్చే బ్రాహ్మణ ఆశీర్వడమే ప్రతిఫలంగా భావించమని ధ్వని ఉన్నది .
ఈమాటలే వరూదికి వేరే విధంగా అనిపించాయి.అతని అభీష్టానికి ఒంటరి ప్రదేశం అనువైనదాని ,సురకా౦త కు సుపర్వుడు తగినవాడే అని ,రూపలావణ్యాలలో తాను ఎవరికీ తీసిపోని దాని ననీ , ,బ్రాహ్మణ్యం స్వైర విహారానికి అంతరాయం కాదు అంటున్నాడని ,వొళ్ళు అంతా క్రొవ్వి కోవ్వి ఉన్న అతడు ఆమె లావణ్యాన్ని దోచుకోకుండా ఎలా వెడతాను అనుకొంటున్నాడనీ ,ఆసుఖం మరగి ఇక అతను తన ఊరు కు వెళ్ళలేనని అంటున్నాడని ,అతనిది అంతా మన్నింపు, వేడికోలు ,అతని కోర్కె తీరిస్తే, అతడి ప్రాణాన్ని కాపాడినట్లే అంటున్నాడని ఆమె భావించింది .ఇది అకాముడైన ప్రవరుని అభిప్రాయంకాదు .సకామి అయిన వరూధిని భావనమాత్రమే .కనుక దీన్ని ‘’బోద్ధవ్య వైశిష్ట్యం తో ఏర్పడిన ధ్వని అన్నారు శాస్త్రి గారు .
తనకథ అంతా ఏకరువుపెట్టినా ప్రవరుని నమ్మని వరూధిని ‘’ఇంతలు కన్ను లుండ దెరువెవ్వరి వేడెడుభూసురేంద్ర ‘’అనే మరో శిల్పంలాంటి పద్యం లో ‘’ఇంతలు కన్నులు ‘’మాట ఇంతటి కన్నులున్న నావంటి సౌందర్య రాశి ఇంకెవరూ లేరనీ ,అతనికి తగిన దానినితానే అనీ ,అతడు సురేంద్రుడని,అతడు తన్ను అర్ధించటం ఆమె భాగ్యమే అనీ ,తానున్నది ఏకాంతమైన విహార స్థలమే అనీ తారుణ్య లావణ్యాదులలో అతన్ని స్వర్గ సుఖాలలో తేల్చగలననీ ,’’నెపంబిడి పలకరించు లాగింతయు కాక ‘’అన్నదానిలో అతడు తనపై మక్కువ పడటం తనకు తెలియనిదికాదని ,వచ్చినదారి తెలియదనటం గడుసుతనమనీ ,సంకోచం లేకుండా అడగటం లో లాఘవం ఏదీ లేదనీ ,’’మాటలేటికిన్ ‘’ అన్నమాటలో మాటలతో వృధా కాలక్షేపం ఎందుకు ముగ్గులోకి దిగుదాం అనే అభిప్రాయం ఉందని ఆమె చెప్పక చెప్పింది .ఈ నిగూఢతను ‘’నర్మ గర్భంబున పలికిన ‘అన్నకవి వాక్కు గుణీభూతవ్యంగ్యమే కాని ధ్వని కాదనీ అయినా రామణీయకత్వానికి లోటేమీ రాలేదని అంటారు శాస్త్రీజీ .ఇలా వ్యంగ్య మర్యాదతో కొత్త విషయాలు చెబుతూ మను చరిత్ర ప్రబంధ కావ్యాన్ని ధ్వనికావ్యంగా పెద్దన మహాకవి తీర్చి దిద్దాడు అంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-18-ఉయ్యూరు
—

