ధ్వని కోణం లో మను చరిత్ర –7’
చంద్రుని ఉదయ కాల ఆరోహణాన్నివర్ణించే పద్యం ‘’స్ఫుట సౌగంధిక రాగ రక్త రుచియై బూనె౦ జపాసన్నిధి ‘’పద్యం లో చంద్రునికి ప్రభాతకాల అరుణకాంతి స్వాభావికంకాదు సంక్రమించినదే ,అతని అసలు ధర్మం తెల్లదనమే అని చెప్పే ‘’ప్రకృతిసచ్చుండైన సన్మార్గిఎన్నటికింగూటమి వంక వచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే ‘’లోస్వభావం చేత నిష్కల్మషుడైన సత్ప్రవర్తనకలవాడు అనీ ,తెల్లనికా౦తితో నక్షత్రమార్గం లో ప్రయాణం చేసే చంద్రుడు అని అర్ధాలు కలవాడుఅని అర్ధాలున్నాయి .ఇది అర్ధాంతరన్యాసం .ప్రకృతివర్ణన తర్వాత ప్రవరుని గురించి ‘’సన్మార్గి ‘’అని రావటం తో అతడు వికారాదులకు లొంగని సచ్చీలుడుగా చెప్పబడ్డాడు .కనుక ఇది శబ్దశక్తిమూలధ్వని .’’తరుణి ననన్యకాంతన్’’ పద్యం లో కవి వరూధిని శీలాన్ని పొగిడి ,ప్రవరుడిని ‘’మహీసురాధముడు ‘’అని నిందించాడు .తప్పు సవరించుకోవటానికి ‘’నభోమణి ‘’అనే మాటతో పైమాట జడుడికి మాత్రమె వర్తిస్తు౦దికాని ,ప్రవరుడికి కాదు అని వ్యన్జించాడు .’’ఎక్కడియూరు కాల్నిలువకి౦ టికీ బోయెద’’పద్యం లో రత్నకందరాలు మొదలైన విహార స్థలాలువదిలి పూరిగుడిసె కుపోతానంటావేమిటి’’అనటం లో తనతో ఇక్కడి దివ్యభోగాలు అనుభవించమని వస్తుధ్వని ఉంది .’’ఎక్కడివాడో యక్ష తనయే౦దు ‘’పద్యం లో అతనిపై ఆమెఅభిలాష కనిపించి అర్ధ శక్తిమూల వస్తుధ్వని అయింది .మరోపద్యం లో వరూధిని తల్లీ అని సంబోధించటం లో దారితప్పిన కొడుకుని ఇల్లు చేర్చటం తల్లులధర్మం అని ధ్వనిస్తోంది .
రాక్షస రూపం లో ఇందీవరాక్షుని ధాటికి ఆగలేక పారిపోయే తన సైనికులను చూసి స్వరోచి ‘’చావు దలపోసి మానవు –డేవగ దుష్కీర్తి నోరయకే దినములు పొం-దైవెడలునట్లు నడవగ-దైవం బటమీదమేలు తాన ఘటించున్ ‘’అన్నపద్యం లో శత్రువులకు వెన్నిచ్చి పారిపోవటం కంటే ,స్వధర్మం అని భావించి ఎదురు నిల్చిధైర్యం తో పోరాడితే,దేవుడు ధర్మపక్షం వహించి విజయం చేకూరుస్తాడు అనే వస్తు ధ్వని ఉందన్నారు రాజన్న శాస్త్రిగారు ఇది ప్రస్తాన వైశిష్ట్య౦ తో ఏర్పడిన ధ్వని అంటారు.వరూధిని ప్రవరునితో’’ఎన్నిభవంబుల౦గలుగు ,నిక్షు శరాసన సాయక వ్యధా ఖిన్నతవాడి –‘’అనే పద్యం లో ‘’ఎన్ని భవంబులన్గలుగు ‘’మాటలోఅలాంటి తనలాంటి దాని పొందుదొరకటం దుర్లభం అనే ధ్వని ఉంది .ఇది వాచ్యార్ధ వైశిష్ట్య ధ్వని అంటారు శాస్త్రిగారు .’’ఎవ్వతె వీవు భీత హరిణేక్షణ ‘’పద్యం లో ప్రవరుడు చెప్పినది ఒకటి వరూధిని అర్ధం చేసుకొన్నది వేరొకటి .మొదటిది వక్త్రు వైశిష్ట్య ధ్వని .రెండవది బోద్ధవ్య వైశిష్ట్య ధ్వని .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-11-18-ఉయ్యూరు

