ధ్వని కోణం లో మను చరిత్ర -8
‘’అక్కట వాడు నా తలగుల మారిది సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచిపోయె దరి చేరగరాని ,వియోగ సాగరం –బెక్కటనీదు దాన ?నీ కొర నోములు నోచినట్టి ,నే –నెక్కడ ?వాని కౌగిలది యెక్కడ?హా విధి ఏమి సేయుదున్ ?
విరహం తట్టుకోలేక వరూధిని అనేమాటలలో అననురూప వస్తు ఘటనా నిబంధ రూపమైన విషమాలంకారం ఉన్నది .ప్రవరుని అతి లోక సౌందర్య కౌగిలింత బహు పుణ్యం అని ,అతని సౌభాగ్యాతిశయం ,పొందు సౌఖ్యం దక్కని తాను అదృష్ట హీను రాలను అంటుంది .ఇందులో అలంకార కృత వస్తు ధ్వని ఉందన్నారు డా రాజన్న శాస్త్రి .
‘’శ్రేణుల్ గట్టి నభో౦తరాళమున బారెం బక్షులుష్ణా౦శు పా-షాణ వ్రజము కోష్ణమయ్యెమృగ తృష్ణావారధు లింకెన్ జపా –శోణం బయ్యె బతంగ బింబము ,దిశా స్తోమంబు ,శోభా దరి –ద్రాణం బయ్యె,సరోజ షండములు ,నిద్రాణంబు లయ్యెంగడున్ ‘’
పద్యం లో పెద్దన ప్రకృతిని కళ్ళకు కట్టించాడు .సాయంత్రం అయింది అనే విషయం ధ్వనించింది .స్వతస్సిద్దార్ధ శక్తి మూలధ్వని .
‘’వరుణా ద్వీపవతీ తటా౦చలమునన్ ‘’అనే మొదటిపద్యం లో అరుణాస్పద పుర వర్ణన లో కవి ప్రౌఢోక్తివలన ఏర్పడిన వస్తుధ్వని ఉంది ,’’ఇను డస్తాద్రి కి బోవ గొల్లగొని ,నే డేతేర’’పద్యం లో వరూదినికి చెలులు శీతలోప చారాలు చేస్తూ చెప్పిన మాటలలో తూర్పు తెలతెల వారుతోంద నే ధ్వని ఉన్నది .ప్రియుని సాన్నిధ్యం తప్పక లభిస్తుంది అనే ఊరడింపు ఉంది .’’ఇనుడు ‘’’’కొల్లగొని ‘’అనే మాటలలో రాజు అవసాన దశలో ఉంటె, దొంగలు దోచిన సొమ్మును చోట్లు మారుస్తూ దాస్తున్న విషయం అర్దా౦తరన్యాసంతో ధ్వనించింది .సూర్యుడు అస్తమించేటప్పుడు తనకా౦తులను అగ్ని లో దాస్తాడు అనే శ్రుతి వచనం ‘’అగ్నిం వా వాదిత్యః సాయం ప్రవిశతి ‘’ని కవి చక్కగా ఇక్కడ వాడుకొన్నాడు .ఇది వక్త్రు ప్రోఢోక్తిచే ఏర్పడిన వస్తు ధ్వని ..’’ఎందే డెందము గందళించు రహిచే ‘’పద్యం లో ప్రవరుడు చెప్పిన బ్రహ్మానందం కోసం వెదకటం వ్యర్ధమని వరూధిని చెప్పింది .ఇది వివక్షితాన్య పర వాచ్య ధ్వని అన్నారు శాస్త్రిగారు .ఇప్పటిదాకా చెప్పిన ధ్వనులన్నీ వాచ్యార్ధం తో ఏర్పడినవే .ఇక ఇప్పుడు అవి వక్షిత వాచ్య ధ్వని ఎక్కడెక్కడ ఉందొ చూద్దాం –
‘’ఆహా ధన్యుడనైతి ‘’పద్యం లో కళా వతిని ఇమ్మని అడగటానికి వచ్చిన దేవాపి అనే గంధర్వుని చూసి ,ఈసడిస్తూ పారర్షి తాను ధన్యుడనయ్యానని ,తన ఆచార విద్యా తపాలు ఫలించాయని దెప్పటం లో తన దౌర్భాగ్యం మాటలతో చెప్పలేనిది అనే వ్యంగ్యార్ధం ధ్వనిస్తోంది .ఇది అవివక్షిత వాచ్య ధ్వని అయిందన్నారు కోరిడే వారు .
‘’హుంకారం బొనరించి వే తలగు డోహో నేను స్వారోచినే ‘’లో తన చుట్టూ మూగిన ఆడలేళ్ళను చూసి మగలేడి స్వారోచిపై ఏహ్యభావం కలిగి౦ది ‘’నేను స్వారోచినే ‘’అనటం లో కాను అనే అర్ధమూ దాక్కొని ఉంది .బహు స్త్రీ లోలుడు అనే ది లక్ష్యార్ధం. స్వరోచినే అనటానికి బదులు స్వారోచినే అనటం లో స్వరోచి పదం ధర్మ విశిష్టతను వ్యక్తం చేసి అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని అయి౦ద౦టారు డా శాస్త్రీజీ .’’ఈ పాండిత్యము నీకు దక్క మరి యె౦దే ‘’అనే ప్రవరుడన్న పద్యం లో ‘’ఆన౦దో బ్రహ్మ ‘’అనే ఉపనిషత్ వాక్యం కు పెడర్ధం వరూధిని చెప్పిందని ,దాని అర్ధం అదికాదని ‘’మీ సంప్రదాయార్ధముల్ ‘’లో ధ్వనించి . ఆమె కోరే బ్రహ్మానందం ఆశి౦చే వాడిని కాను అనే వ్యంగ్యార్ధం వస్తుధ్వనిగా కనిపిస్తుంది .’’కొలకోల గూయు బై నొరగు,గుత్తుక గుత్తుక జుట్టు బారు ఛి –ల్వలక్రియ ,గానరాని గతులన్ మయి మై బెనచుచున్ ‘’పద్యం లో చెలికత్తెలు వరూధినిని వినోదింప జేయటానికి పలికిన పలుకులు సంయోగ వియోగాలు దైవా దీనాలు .కనుక వగవటం మంచిదికాదని ప్రవరుడుకూడా దీర్ఘ విరహం భరించ లేక తిరిగి వస్తాడు అని ఊరడింపు ఉన్నది .దీన్ని ‘’విధి చాతురి పద ద్యోత్య మైన వస్తు ధ్వని అంటారు రాజన్నగారు .’’యెంత తపంబు సేసి జనియించిన వారొకొ’’పద్యమూ దీనికి మరో ఉదాహరణ.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-19-ఉయ్యూరు

