గౌతమీ మాహాత్మ్యం -30
42- నాగ తీర్ధం
బ్రహ్మ నాగ తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి వివరిస్తున్నాడు .ప్రతిష్టాపన పురం లో శూర సేనరాజు గుణవంతుడు సోమవంశం వాడు .చాలాకాలం వరకు సంతానం లేదు .పుత్రుడు కావాలని ఆశించాడు కాని ఒక సర్పం పుత్రుడుగా పుట్టింది .ఈ విషయం అత్యంత గోప్యంగా ఉంచాడు .రోజూ ఆపామును చూసి దంపతులు బాధపడేవారు .ఆ పాము మాట్లాడేది .తనకు ఉపనయనం చేయమని కోరింది .సరే అని చెవులు కుట్టించి ఉపనయనం చేసి వేద విద్య నేర్పించాడు .ఒకరోజు తనకు పెళ్లి చేయమని కోరాడు .పాముకు పిల్లనెవరిస్తారనే సందేహం బాధించింది .రాజులు ఏ రకంగానైన పెళ్లి చేసుకోవచ్చు కనుక కన్యను దొంగిలించి అయినా పెళ్లి చేయమని లేకపోతే గంగలో దూకి చస్తానని చెప్పింది ఆ సర్పపుత్రరత్నం . మంత్రులతో ఆలోచించి తనకొడుకు గొప్ప వీరుడని విద్యా వేత్త అని మాత్రమె చెప్పాడు కాని అసలు రహస్యం చెప్పలేదు .మంచి కన్యను చూడమని మాత్రం బలవంత పెట్టాడు .
ఒక ముసలి మంత్రి మాత్రం పూర్వ దేశం లో విజయుడు అనే రాజు ఉన్నాడని ,అతడికి ఎనిమిది మంది పుత్రులున్నారని ,భోగవతి అనేగుణశ్రే స్టురాలైన కూతురు ఉందని ,ఆమె తగినదని చెప్పాడు .ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయమని ఆ మంత్రికి ధనకనక వస్తు వాహనాలిచ్చి ఆపిల్ల తండ్రి వద్దకు పంపాడు .ఉబ్బిపోయిన విజయ రాజు కూతుర్నిస్తానని ఒప్పుకొన్నాడు .మళ్ళీ రాజు దగ్గరకు వెళ్లి చెప్పి ఈ సారి మిగిలిన మంత్రులతో వచ్చి విజయుని కట్నకానుకలతో మెప్పించి రాకుమారుడు అక్కడికి రావటానికి ఇష్టపడటం లేదని శస్త్రానికిచ్చి పెళ్లి చేయవచ్చునని శాస్త్రాలలో ఉందని నచ్చచెప్పి భోగవతీ కన్య వివాహాన్నిఅత్యంత వైభవంగా జరిపించారు .మామగారు అల్లుడికి తగిన రీతిలో కట్నకానుకలు భారీగా పంపుతూ కుమార్తెను అత్తవారింటికి పంపాడు .
సర్పం తనభార్య తన దగ్గరకు ఎందుకు రావటంలేదని తల్లి దండ్రులను నిత్యం అడిగేవాడు .భోగవతికి తనభర్త సర్పం అని తెలియ జేశారు .ఆమె అధైర్యపడకుండా ,దైవ నిర్ణయమని భావించి భర్త దర్శనం చేయించమని కోరింది .పట్టె మంచం పై పవళించినభర్త సర్పాన్నిచూసి చేతులు జోడించి తాను ధన్యురాలుకనుకనే దైవం అయిన పతి లభించాడని చెప్పి ,పక్కపై పాము పక్కన కూర్చుని అనునయిస్తూ సపర్యలు చేసింది .ఆ పాముకు అప్పుడు పూర్వ స్మృతి కలిగి తనను చూసి భయపడనందుకు భార్య ను మెచ్చుకొనగా పతియే దైవం అని పెద్దలమాట తనకు శిరోధార్యం అన్నది .
భార్య మంచితనాన్ని ,పతిభక్తికి మెచ్చి ఆతడు ఆమెస్పర్శ చేత తనకు పూర్వ జన్మజ్ఞానం కలిగిందని ,తాను పూర్వం శివుని చేత శాపి౦ప బడి శివుని చేతికి ఆభరణంగా ఉన్న శేషుని పుత్రుడైన పాముకు తాను భర్త అని ,పూర్వం భోగవతి తనభార్య అనీ , ఏకాంతం లో శివపార్వతులు ఉండగా శివుడు ఒకరోజు పార్వతి మాటలకు పగలబడి నవ్వాడనీ, అప్పుడు తాను కూడా నవ్వానని ,శివుడు కోపించి ‘’మానవ గర్భం లో జ్ఞానం కల పాముగా పుడతావని శపించాడని’’ చెప్పాడు తానూ పశ్చాత్తాపంతో శంకరుని ప్రార్ధించగా గౌతమీనదిలో స్నాని౦చి తన్ను పూజిస్తే జ్ఞానం కలిగి భోగవతి అనుగ్రహం తో శాప విముక్తి కలుగుతుందని శివుడు చెప్పాడని ఆమెకు తెలియ జేశాడు .
భర్తను వెంటబెట్టుకొని భోగవతి గౌతమీ నదిలో స్నానం చేయించి శివ పూజచేయించింది .ప్రసన్న శివుడు వారికి దివ్యరూపం ప్రసాదించాడు .భార్యతో కైలాసానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అతని తలిదండ్రులు అతన్ని వారించగా భార్యతో నాగరాజు ఆరాజ్యాన్ని పాలించి సంతానం పొంది ,గౌతమీ తీరం లో శివలింగ ప్రతిష్టచేసి నిత్యం అర్చించి చివరికి భార్యతో శివ పురి చేరాడు .అదే నాగతీర్ధం గా ప్రసిద్ధి చెందింది .
సశేషం
అఘం అంటే పాపం .దాన్ని పోగొట్టే మాసం మాఘమాసం కనుక మళ్ళీ గౌతమీ మాహాత్మ్యం ఈ రోజు నుంచి కొనసాగిస్తున్నాను
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-19-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్

