గౌతమీ మాహాత్మ్యం -32
44-బ్రహ్మ తీర్ధం
భక్తిని ముక్తినీ ఇచ్చే బ్రహ్మ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .రాక్షసులు రసాతలం లో దాక్కున్నప్పుడు మాతృకలు కూడా వెళ్ళగా దేవతలు మాత్రం అక్కడే ఉండిపోయారు .గాడిద ఆకారం కల బ్రహ్మగారి అయిదవ ముఖం అసురులను పారిపోవద్దనీ, తాను క్షణం లో దేవతలనందర్నీ చంపుతానని అన్నది .సురలు ఒణుకుతూ విష్ణువుకు విన్నవించగా ,ఆయన ‘’నా చక్రం తో బ్రహ్మ గార్ధభ ముఖాన్ని తెంచి వేయగలను కాని ఖండి౦పబడిన ఆ శిరస్సు సకల ప్రపంచాన్నీ నాశనం చేస్తుంది .మీకు ఒక విరుగుడు చెబుతా .జాగ్రత్తగా విన౦డి. శంకరుని శరణు వేడండి’’అని ఉపాయం చెప్పాడు .
.బ్రహ్మాది దేవతలు శివునిస్తుతి౦చగా స౦తసి౦చి ఏమికావాలని అడిగితె,దేవతలు విషయం వివరించగా ఆయన బ్రహ్మ యొక్క భయంకర గాడిద తలను చేతి గోళ్ళతో తు౦చి వేయగలనని , ,కాని దాన్ని ఎక్కడ పడెయ్యాలో ఆలోచించమని అన్నాడు .భూదేవి తాను ఆ శిరస్సు భ౦చ లేనని ,అది తనపై పడితే తాను పాతాళానికి కు౦గి పోతానని చెప్పింది .సముద్రాన్ని అడిగితె ఆ తల పడిన తక్షణమేతాను ఎండి పోతానన్నది .గత్యంతరం లేక దేవతలు ‘’ముక్కు కారుతోంది అంటే నువ్వే తుడువు ‘’అన్న చందంగా ఆశిరస్సును శివుడే ధరించాలని కోరారు . ‘’కానుపు చేయటానికి వచ్చినమ్మ ఏది బయటపడినా తానె తీయాల్సి వస్తుంది ‘’అన్నట్లుగా తనకు తప్పదని శివుడు బ్రహ్మ గాడిత తలను గోటితో త్రుంచి ,తానె దాన్ని ధరించి లోకోపకారం చేశాడు .గరళం మింగినాయనకు ఇదో లెక్కా ?.ఇక బ్రహ్మ గాడిద తల భయం లేదని శివునికి ప్రార్ధనలతో కృతజ్ఞతలు చెప్పి దేవతలు గౌతమీ తీరం చేరి నదినీ శివుని భక్తితో అర్చించారు .అప్పటినుంచి అది బ్రహ్మ తీర్ధంగా ప్రసిద్ధమైంది .దీనికే సూర్య తీర్ధం అనే పేరుకూడా ఉంది .మహా దేవుని చే ఖండి౦ప బడిన బ్రహ్మ గార్ధభ శిరస్సును అవిముక్త క్షేత్రం లో స్థాపించటంవలన దేవతలకు హితం చేకూరింది అనినారడునికి బ్రహ్మ చెప్పాడు .బ్రహ్మ తీర్ధం లో గౌతమీ తీరం లో ఆ శిరస్సును దర్శించి ,అవిముక్త క్షేత్రం లో ఉంచబడిన బ్రహ్మ కపాలం ను సందర్శిస్తే బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-19-ఉయ్యూరు.

