గౌతమీ మాహాత్మ్యం -37
51-ధాన్య తీర్ధం
ఓషధులు సోమరాజు చంద్రుని పతిగా పొంది లోకాలకు, గంగకు ఇష్టమైన మాటలు పలుకుతూ ఇలా చెప్పాయి –‘’వేదవేత్తలకు తెలిసిన పురాగాథ ఒకటి ఉంది .మాతృసమానమైన ,సస్య సంపన్న మైన భూమాతను గంగా తీరం లో దానమిస్తే సకల కోరికలు నెరవేరుతాయి .భూమి, గోవు ,ఓషధులను దానం చేస్తే సకలకార్య సిద్ధి కలుగుతుంది .ఆ దానం అక్షయమవుతుంది .ఓషధులకు సోముడు పతి అనితెలిసి దానం చేసిన బ్రహ్మవేత్త బ్రహ్మలోకం లో గౌరవం పొందుతాడు .గంగలో మా ఓషధులను దానం చేస్తే సంసార సాగరం తరిస్తాడు .మేము బ్రహ్మ స్వరూపులం ,ప్రాణ రూపిణులం.మమ్మల్ని జితవ్రతుడు దానం చేస్తే తరిస్తాడు .మేము జగత్తు అంతా వ్యాపించి ఉన్నాం .హవ్య ,కవ్య రూపమైన అమృతం ,సర్వ శ్రేష్ట భోజన పదార్ధం దానం చేస్తే వారిని మేము తరి౦ప జేస్తాం .ఈ వైదిక గాథ విన్నవాడు కూడా తరింప బడుతాడు .’’ఈ ధాన్య తీర్ధ స్నాన జప దానాలు సర్వ స౦పదలనిస్తాయని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .
51-విదర్భా సంగమ రేవతీ సంగమాది తీర్ధం
భారద్వాజమహర్షి సోదరి రేవతి కురూపి .ఈమెను చూస్తూ కలతమనస్సుతో మాహర్షి గంగాతీరం లో విచార గ్రస్తుడై ఉన్నాడు .ఆపిల్లను ఎవరు పెళ్లి చేసుకొంటారనే దుగ్ధ ఆయన్ను బాధించింది .ఒక రోజు ఒక ముని ఆయన సందర్శనం కోసం వచ్చాడు .ఆయన అందమైన వాడు .వయసు 16.శాంత దా౦తాలలో మేటి .పేరు ‘’కఠుడు’’.ఆ ముని కుమారుని భరద్వాజమహర్షి ఆహ్వానించి ,పూజించి ,ఆతిధ్యమిచ్చాడు .
వచ్చినవాడిని అతని రాకకు కారణం అడిగాడు మహర్షి .విద్య నేర్వటానికి వచ్చిన విద్యార్ధిని అని పరిచయం చేసుకొన్నాడు .కులీనుడు,సత్యవాది అయిన తనకు విద్య నేర్పమని ప్రార్ధించాడు .భరద్వాజుడు అతడిని శిష్యునిగా స్వీకరించి సకల విద్యలు నేర్పాడు .శిష్యుని విద్యాభ్యాసం పూర్తవగానే గురువు ను ‘’ఇచ్ఛేయం దక్షిణా౦ దాత౦ గురో తవ మనః ప్రియాం –వదస్వ దుర్లభం వాపి గురో తుభ్యం నమోస్తుతే-విద్యా ప్రాప్యాపి యే మోహాత్స్వగురోః పారితోషికం –న ప్రయచ్ఛంతి నిరయం తేయంత్యాచంద్ర తారకం ‘’అన్నాడు అంటే –మనస్సుకు ప్రియమైన దక్షిణ ఇవ్వాలను కొంటున్నాను .దుర్లభమైనదైనా సంకోచం వద్దు .విద్య నేర్పిన గురువుకు తగిన పారితోషికం ఇవ్వని వాడు ఆచంద్ర తారార్కంగా నరకం పొందుతాడు’’ .
భరద్వాజుడు తన సోదరి రేవతిని వివాహమాడి సుఖంగా అన్యోన్యంగా దాంపత్యం చేయటమే తను కోరే గురు దక్షిణ అన్నాడు. శిష్యుడు గురువు తండ్రి వంటివాడు కదా అలాంటప్పుడు ఈ సంబంధం ఏవిధంగా ధర్మం అవుతుంది అని అడిగాడు .దానికి మహర్షి –
‘’మద్వాక్యం కురు సత్యం త్వం మమాజ్ఞా తవ దక్షిణా –సర్వం స్మృత్వా కఠాద్యత్వం రేవతీం భర తన్మనాః’’-నామాట నిజం చేయి నా ఆజ్ఞాపాలన మే నీ గురు దక్షిణ .అన్నీ స్మరించుకో .రేవతిపై ప్రేమ చూపి భార్యగా గ్రహించు .అన్నాడు .గుర్వాజ్ఞ శిరసావహించి కఠుడు రేవతిని పెళ్ళాడి ,పరమేశ్వరుని పూజించి అభిషేకించాడు .వెంటనే రేవతి సర్వాంగ సుందరిగా మారిపోయింది.అభిషేక జలం ప్రవహించి గంగానదిలో కలిసింది .రేవతికి పుణ్య రూపం కోసం భర్త అనేక రకాల పవిత్ర దర్భలతో అభిషేకించాడు .అది విడర్భా నది అయింది .రేవతీ –గంగా సంగమం, విదర్భా –గౌతమీ సంగమం లలో స్నానిస్తే భుక్తి ,ముక్తి పొందుతారని బ్రహ్మ నారదునికి తెలిపాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-19-ఉయ్యూరు

