గౌతమీ మాహాత్మ్యం -41
55-పుత్ర తీర్ధం
దితి పుత్రులు దనుజులు క్రమ౦గా నశిస్తూ ఉంటె అదితి పుత్రులు దేవతలు వృద్ధి పొందుతున్నారు .పుత్ర శోకం భరించలేక దితి తనభర్త దనువు ను చేరి గోడు వెళ్ళబోసి అదితి అంటే తనకున్న ద్వేషాన్ని ప్రకటించగా దనువు ఆమెను ఓదార్చి ఆమె భర్త కశ్యపునికి నివేది౦చ మన్నాడు .వెళ్లి కశ్యపప్రజాప్రతికి చెప్పగా ,సమస్త లోక విజేతను కొడుకుగా ఇమ్మని కోరింది .ఆయన 12ఏళ్ళు చేసే వ్రతాన్ని ఆచరించమని చెప్పగా భర్తనుద్దేశించి వ్రతం చక్కగా ఆచరించగా కశ్యపునివలన ఆమె గర్భం దాల్చగా ఆయన కొన్ని నియమాలు పాటించమని బోధించాడు –ఇరు సంధ్యలలో నిందనీయమైన పనులు చేయరాదు, నిద్రపోకూడదు ,వెంట్రుకలు విరబోసుకోరాదు భోజనం చేయరాదు ,నోటికి ఏదైనా అడ్డం పెట్టుకొని నవ్వాలి ,ఇంటి మధ్యప్రదేశం లో ఉండరాదు ,తుమ్మటం ఆవలించటం చేయరాదు .రోలు ,రోకలి ,చీపురు చేటలను ఎప్పుడూ దాటి వెళ్ళరాదు.ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు ,అసత్యమాడరాదు,ఇతరుల ఇంటికి పెత్తనాలు పనికి రాదు ,పరపురుషుని చూడకూడదు .మొదలైన నియమాలను పాటిస్తే త్రిలోకాలలో పెరుపొందే కొడుకు పుడతాడు ‘’అని చెప్పి దేవతల నివాసానికి వెళ్ళిపోయాడు .
దితి గర్భం బాగా వృద్ధి చెందింది .ఈ విషయం మయుడు గ్రహించి మిత్రుడైన ఇంద్రుని చేరాడు .నముచి హంతకుడైనఇంద్రునితో మయుని స్నేహం విచిత్రమైంది .ఒకప్పుడు నముచి దైత్య సేనాపతి .అప్పుడు ఇంద్రునితో భయంకర యుద్ధం జరిగింది .యుద్ధం లో ఇంద్రుని బలం తగ్గి వెళ్లిపోతుంటే నముచి అతడిని వెంబడించాడు .భయపడి సురపతి ఐరావతం వదిలేసి నురుగులో దాక్కున్నాడు .అదే నురుగుతో నముచిని సంహరించాడు ఇంద్రుడు .నముచి తమ్ముడే మయుడు .అన్న హంతక చావుకోసం విష్ణువుకై ఘోర తపస్సు చేసి వరాలతోపాటు దేవతలకు అతి భీషణమైన మాయ ను కూడా పొందాడు .త్రేతాగ్నులను బ్రాహ్మణులను పూజిస్తూ ఇంద్రునిపై విజయం కోసం ఎదురు చూస్తున్నాడు .వాయువు ద్వారా ఈ విషయం తెలుసుకొన్న ఇంద్రుడు బ్రాహ్మణ రూపంతో శత్రువైన మయుడి దగ్గరకు వచ్చాడు .బ్రాహ్మణుడే అని భావించి చాలా దానాలిచ్చాడు .సంతోషపదకుండా ఒక వరం ఇమ్మని అడిగాడు .ఏ వరం కావాలని మయుడు అడిగితే మయుడితో స్నేహం కావాలని కోరాడు దేవేంద్రుడు .తమ మధ్య వైరమే లేదుకదా స్నేహం కావాలని ఎందుకు కోరావని అడిగాడు మయుడు .అప్పుడు ఇంద్రుడు నిజరూపం చూపించి అసలు విషయం చెప్పగా ఇచ్చిన మాటప్రకారం వారిద్దరి మధ్య స్నేహమేర్పడింది .
ఈ స్నేహంతోనే ఇంద్రుడికి మాయా విద్య నేర్పాడు మయుడు .దీనికి ప్రత్యుపకారంగా ఏం కావాలో కోరుకోమన్నాడు ఇంద్రుడు .అప్పుడు మయుడు’’ అగస్త్యాశ్రమానికి వెళ్ళు .అక్కడ దితి గర్భిణిగా ఉన్నది .ఆమెకు సేవ చేస్తూ అక్కడ ఉండు .సమయం చూసి ఆమె గర్భం లో ప్రవేశించి పిండాన్ని వజ్రాయుధం తో చేదించు .ఇక నీకు శత్రువులు ఉండరు ‘’అని చెప్పాడు .దితిని చేరి సేవ చేస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు .దితి కి ఈ వంచన విషయం తెలియదు .
ఒక రోజు సంధ్యాకాలం లో దితి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతుండగా అదే అదను అనుకోని ,ఆమె గర్భం లో ప్రవేశించి గర్భస్త శిశువును సంహరించే ప్రయత్నం చేశాడు. ఆ శిశువు ఇంద్రునితో ‘’సోదరా !నన్ను చంపుతావా ?ఇది మహాపాపం కాదా .నేను శత్రువును అనిభావిస్తే మాతల్లి గర్భం లో నుంచి నేను బయట పడే మార్గం చెప్పి నేను బయటకు రాగానే యుద్ధం చేసి చంపి పౌరుషవంతుడవని చాటుకో’’అని పరిపరి విధాల చెప్పాడు .దయా దాక్షిణ్యాలు లేకుండా గర్భస్త పిండాన్ని ఇంద్రుడు వజ్రాయుధం తో ఖండించాడు .ఖండి౦చిన 7ముక్కలను ను మళ్ళీ మళ్ళీ ఖండించగా 49పిండాలేర్పడ్డాయి .అవిశరీరభాగాలేర్పడి రోదించటం ప్రారంభించగా ఇంద్రుడు ‘’మా రుత ‘’అంటే రోదించ వద్దు అన్నాడు .వారందరూ తేజో బలవంతులైన’’ మరుత్తు’’లయ్యారు.జరిగిన దాన్ని అగస్త్యమహర్షికి విన్నవించారు .ఆయనకు విపరీతమైన కోపమొచ్చి ‘’ఇంద్రా !ఎప్పుడూ నీ శత్రువులు నీ పృష్ట భాగాన్నే చూస్తారు ‘’అని శపించాడు .దితి కూడా ఇంద్రుని స్త్రీవలన అవమానం పొంది రాజ్య భ్రస్టత కలుగుతుందని శపించింది .
కశ్యపప్రజాపతి అక్కడికి వచ్చి దితి గర్భం లో ఉన్న ఇంద్రుని చేస్ట అతనికి తగిలిన శాపాలూ తెలిసి బయటికి రావటానికి భయాపడుతుంటే ధైర్యం చెప్పి రమ్మన్నాడు .తలదించుకొని నిలబడ్డాడు .కశ్యపుడు లోకపాలకులతో పాటు బ్రహ్మ లోకం వెళ్లి ఆయనను ప్రార్దిచారు .ఆయన ఇంద్రునితో సహా కశ్యపుని గంగా నదీ తీరం చేరి స్నానం చేసి శివుని ఆరాధించ మనగా అలాగే చేశాడు .మహేశ్వరుడు ప్రత్యక్షమై ‘’మరుత్తులు మహా సౌభాగ్యం కలవారై ,యజ్ఞభాగులై ,ఇంద్రునితో కలిసి నిత్య సంతోషంగా ఉంటారు .ఇంద్రునికంటే ముందే యజ్ఞ హవిర్భాగం దక్కుతుంది .మరుత్తులతో కలిసిఉన్న ఇంద్రుని జయించటం అసాధ్యం .ఇకపై సోదర వంశ నాశనానికి ప్రయత్నించే వారు వంశనాశనం పొందుతారు .మరుత్తులు అమరుఅలయ్యారు ‘’అనీ ,.దితి తో ‘’నువ్వుకోరినట్లే ధీర శూర పుత్రులు నీకు జన్మించారు నీ కోరిక తీరింది ‘’ అన్నాడు .దితి కృతజ్ఞతలు చెప్పింది .శివుడు ఈ తీర్ధం లో చేసినస్నానాదులు గొప్పఫలితాలనిస్తాయని ,పుత్ర తీర్ధంగా ప్రసిద్ధి పొందుతుందని చెప్పాడని నారదునికి బ్రహ్మ వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-19-ఉయ్యూరు .

