యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9

యాజ్ఞవల్క్యుడు ఆదిత్యుని నుండి పొందిన యజుస్సులను ఇతరులకోసం సంస్థాపించి ,బ్రహ్మం గురించి చింతనలో పడ్డాడు .అప్పుడు విశ్వా వసువు అనే గ౦ధర్వరాజు  ఆయన వద్దకు వచ్చి ‘’వేదాంత శాస్త్రం లో బ్రాహ్మణోక్తమైనది,సత్యమైనది ఉత్తమమైనది ఏదో తెలియజేయండి ‘’అని అడిగాడు .ఇదేకాక వేదాలను గురించి 24ప్రశ్నలు ,అన్వీక్షకి గురించి మరొక ప్రశ్న ఆడిగాడు  .దానికి కాసేపు మనసులో సరస్వతీ దేవిని ధ్యానించి యాజ్ఞవల్క్యుడు చెప్పటం ప్రారంభించాడు .

‘’ముముక్షువులకు భయం కలిగించేది ,జననమరణాలు కలిగిస్తూ అవ్యక్తమైనదే విశ్వం .దానికి సత్వ రజస్ తమోగుణాలు  మహత్తు మొదలైన గుణాలు కలిగిస్తుంది .అవిశ్వం అంటే నిర్గుణ పురుషుడు  .అశ్వ అంటే స్త్రీ .అశ్వం పురుషుడు .అంటే ప్రకృతి పురుషులన్నమాట .ప్రకృతి అవ్యక్తం .పురుషుడు నిర్గుణుడు .మిత్రుడు పురుషుడు .వరుణుడు ప్రకృతి .జ్ఞానం ప్రకృతి .జ్ఞేయం పురుషుడు.పురుషుడు జీవుడైఅజ్ఞుడు అవుతాడు నిర్గుణుడై’’ జ్ఞుడు ‘’అవుతాడు .క  అంటే పురుషుడు .తప అంటే  ప్రకృతి.అవేద్యం ప్రకృతి. వేద్యం పురుషుడు .చలం ప్రకృతి .అది వికారం పొంది సృష్టి స్థితి లయాలకు కారణమౌతోంది .అచలం పురుషుడు .అతడు  వికారాలకు లోనుకాడు .సర్గ ,ప్రళయాలకు తోడ్పడతాడు .కొందరి దృష్టిలో వేద్యం ప్రకృతి అవిద్య పురుషుడు .ప్రకృతి ,పురుషులు ఇద్దరూ అజ్ఞులు ,ద్రువులు ,అక్షయులు ,అజులు ,  నిత్యులు అని ఆధ్యాత్మ గతిలో  నిశ్చయం ఉన్న వారు అంటారు .సృష్టి విషయం లో అక్షయం అనేదాన్ని బట్టి అజం అయిన ప్రకృతి అవ్యయం అంటారు .పురుషుడు అక్షయుడు .కారణం క్షయం లేకపోవటమే .ప్రకృతిలోని గుణాలే క్షయమౌతాయి కాని ప్రకృతి క్షయించదు కనుక అక్షయమన్నారు విద్వాంసులు .ప్రకృతి వికారం పొంది సృష్టికి కారణమౌతోంది ,మరుగు పడుతూ ఉంటు౦ది .ప్రకృతి అలాకాక పోవటం చేత అదీ అక్షయమే అనబడుతుంది ‘

  ‘’అన్వీక్షకి వలన ,గురు సుశ్రూషవలన  వేదాలను పొంది ,విధులు అనుస్టిస్తూ వేదాధ్యయనం చేయాలి .వేదాలను సాంగోపాంగంగా చదివి సకల జీవరాశికి పుట్టే చోటు,,ప్రళయం లో లయించే చోటు ,వేదాలన్నీ ఒక్కటై వేద్యమైన పరమాత్మను తెలుసుకోన్నవారి ,వేదం ప్రతిపాది౦చ బూనినవాని ఎరుగక పొతే వారి వేద పఠనం నిరర్ధకం .అలాంటి వారు వేదాల బరువు మోసే  వాళ్ళుగానే మిగిలిపోతారు .వెన్నకావల్సినవాడు గాడిదపాలను మధిస్తే వచ్చేది కంపుమాత్రమే కానీ మీగడా వెన్న రావు .వేదాలన్నీ చదివి ప్రకృతి ,పురుషుడు అంటే తెలియని వాడు మూఢమతి అనిపించుకొంటాడు .ప్రకృతి పురుషులను గూర్చి ఊరికే చింతిస్తూ ఉంటె పుట్టటం గిట్టటం మళ్ళీ పుట్టటం చావటమే జరుగుతుంది .కనుక అక్షయం అయిన యోగధర్మం అవలంబించాలి .జీవాత్మ ,దానికి పరమాత్మతో సంబంధం పై ఆలోచించేవాడు నిర్గుణ పరమాత్మ దర్శనం పొందుతాడు .ష డ్వింశకుడు ,పంచ వి౦శకుడు వేరు అని భావించే వారు మూఢులు .జనన మరణాలకు భయపడి ,జీవాత్మ పరమాత్మలకు భేదం లేదని సాంఖ్యులు ,యోగులు భావిస్తారు ‘’అని సవిస్తరంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు .

  అప్పుడు విశ్వావసువు ‘’జీవాత్మ అక్షయం ,పరమాత్మకంటే వేరుకాదు అన్నారుమీరు .దీన్ని స్పష్ట పరచండి .నేను జైగీష వ్యాధుడు,మా తండ్రి కాశ్యపులవలన ఈ విషయం విన్నాను .రుద్రాదులు చెప్పిందీ విన్నాను .వారంతా నిత్యమైన వేద్యాన్ని మాత్రమె చెబుతారు .నువ్వు మతిమంతుడవు .శాస్త్రాలలో దిట్టవు. సకల శ్రుతులకు నిధివి .నిన్ను దేవలోకం పితృలోకం శ్లాఘిస్తున్నాయి .బ్రహ్మలోక మహర్షులు ,జ్యోతులకు పతి అయిన ఆదిత్యుడు  నీకు ఈ జ్ఞానం బోధించారని అంటారు .నువ్వు సాంఖ్యం ,యోగ శాస్త్రాల  లోనూ ప్రవీణుడవే.చరాచరాలు తెలిసిన నువ్వే ఈ జ్ఞానాన్ని విస్పష్టంగా చెప్పగలవు .కనుక చెప్పవలసింది ‘’అని అడిగాడు ,

  యాజ్న్య వల్క్యుడు ‘’నీకు అన్నీ తెలుసు .కానీ తెలియనివాడివిగా ఉన్నావు .నేను విన్నది విన్నట్లు గా చెబుతాను .పంచ వి౦శకుడు అంటే జీవాత్మ అప్రబుద్ధ అయిన ప్రకృతిని తెలుసుకొంటాడు .కాని ప్రకృతి జీవుని తెలుసుకోలేదు .జీవుడు ప్రకృతిలో ప్రతిబి౦బిస్తాడు కనుక సాంఖ్యులు, యోగులు వేదం నిదర్శనంగా దీన్ని ప్రధానం అంటారు .జీవుడు  చతుర్వి౦శాన్ని అంటే ప్రకృతిని చూడ దలచి ,పంచ వి౦శను అంటే ఆత్మను చూస్తున్నాడు .చూడాలనే ఉద్దేశ్యం లేకుండా షడ్వింశకుని చూస్తున్నాడు .జీవుడు తనకంటే అధికుడు లేడని పొరబాటు పడుతున్నాడు .నిజంగా వాడు చూస్తున్నా కూడా షడ్వింశకుడిని చూడడు.జ్ఞానులైన మానవులు ప్రకృతిని జీవుని గా భావించ కూడదు .నీటిలోని చేప నీటికంటే భిన్నమైనట్లే ,ఆత్మ దానికంటే భిన్నుడు .పరమాత్మతో తనకున్న ఐక్యం తెలియక ,ప్రకృతి సంసర్గం తో సహవాసం ,స్నేహం ,అభిమానాలతో సంసారం లో మునిగిపోతాడు .మమకారం వదిలేస్తే మునగకుండా పైకి తేల్తాడు .తాను  ఉండే ప్రకృతి వేరు,  తాను  వేరు అనే జ్ఞానం కలిగితే పరమాత్మ దర్శనం పొందుతాడు .ఇక పునర్జన్మ ఉండదు .

‘’  రాజా !జీవాత్మ వేరు పరమాత్మ వేరు .పరముడు జీవుడిలో అంతర్యామిగా ఉండటం వలన జీవాత్మ ,పరమాత్మ ఒకటే అని సాధువులు భావిస్తారు .అందుకే యోగులు సాంఖ్యులు చావు పుట్టుకలకు భయపడి శుచులై ,పరమాత్మ పరాయణులై జీవుని చ్యుతి లేనివానిగా భావిస్తారు .జీవుడు కేవలుడై ,పరమాత్మను చూసినప్పుడే సర్వ వేత్త , విద్వాంసుడు అయి పునర్జన్మ పొందడు .ద్రస్ట కు ,దృశ్యానికి దృష్టికి దృశ్యానికి భేదం ఎంచనివాడే కేవలుడు ,అకేవలుడు అయి పంచ వి౦శకుడు అవుతున్నాడు .ఇవన్నీ నేను విన్నవీ , కన్నవీ . నీకు అన్నీ  చెప్పాను ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.