యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10

      గ౦ధర్వ రాజు విశ్వావసువు యాజ్ఞవల్క్యుడు చెప్పినదానికి సంతృప్తిపడి,ఆయన మనసు ఎప్పుడూ బుద్ధి తో కూడి ఉండాలని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి దేవలోకానికి వెళ్ళాడు .దేవలోకం లోనూ ,భూలోక ,అధోలోక వాసులకూ విశ్వావసువు యాజ్ఞవల్క్య దర్శనాన్ని బోధించినట్లు మహా భారతం లో ఉంది.

  మిధిలా నగర రాజు జనకుడు  దేశాంతరం నుంచి వచ్చిన ఆరుణి కొడుకు శ్వేత కేతుడు ,సత్యయజ్ఞుడికొడుకు సోమ శుష్ముడు ,యాజ్ఞవల్క్యులను తన ఆస్థానానికి పిలిపించి అగ్ని హోత్ర విషయాన్ని చర్చించాడు .ముందుగా వారిని తాము అగ్ని హోత్రం ఎలాచేస్తారో చెప్పమని అడిగాడు జనకుడు .శ్వేతకేతువు తాను  అగ్న్యాదిత్యులలోనే హోమం చేస్తానని చెప్పాడు .అదెలాగా అని అడిగాడు రాజు .అతడు ‘’ఆదిత్యుడే తేజము .సాయం వేళ ఆదిత్యునికే అగ్నిలో హోమం చేస్తాను .అగ్నికూడా తేజస్సు కనుక ఆ అగ్నికోసం ఉదయం సూర్య ఘర్మం అంటే తేజస్సులో హోమం చేస్తాను .అంటే హవిస్సుచేత అగ్నిని తృప్తి చెందిస్తాను ‘’అన్నాడు .ఇలా చేస్తే ఏమిటి ఫలమని ప్రశ్నించాడు జనకుడు .శ్వేతకేతువు ‘’ఎప్పుడూ లక్ష్మి కీర్తితో కలిసిఉ౦డటమేకాక అగ్ని, ఆదిత్యుల సాయుజ్యం సమానమవుతుంది .అంటే ఐహిక ఆముష్మిక ఫలం కలవాడు అవుతాడు ‘’అని చెప్పాడు .

   సోమ శుష్ముడు ‘’తేజాన్నే తేజం లో హోమం చేస్తాను ‘’అనగా అదేట్లాని ప్రశ్నిస్తే ‘’ఆదిత్యుడే తేజం. అందుకే సాయంకాలం అగ్నిలో హవిస్సులు వేసి తృప్తికలిగిస్తా .అగ్ని తేజస్సు కనుక ప్రాతః కాలం లో అగ్ని తృప్తికిసూర్యుని యందు హోమం చేస్తాను ‘’అనగా దీనివల్లకలిగే ఫలితమేమిటి అని అడగ్గా ‘’శ్రీమంతుడు కీర్తిమంతుడు అయి వారి సాయుజ్యాన్నిఅలోకత్వాన్నీ పొందుతాడు ‘’అన్నాడు .

   యాజ్ఞవల్క్యుడు ‘’నేను ఆహవనీయాగ్నిని గార్హత్యాగ్ని నుంచి తీస్తాను .అ౦గోపాంగ సహిత అగ్నినే ఉద్దరిస్తా .అప్పుడు ఆదిత్యుడు అస్తమించటం చూసి దేవతలంతా అతని వెంట పోతారు .మళ్ళీ వారంతా నేను ఉద్ధరించిన అగ్నిని చూసి తిరిగి వస్తారు .అప్పుడు సృవాది పాత్రలు కడిగి వేదిపైఉంచుతాను ‘.అగ్ని హోత్రి అయిన ధేనువు పాలు పితికి  దేవతలను చూసే నేను ,నా వంక చూసే దేవతలను హవిస్సు తో తృప్తి చెందిస్తాను ‘’ ’అని చెప్పాడు .దీనికి జనకుడు సంతోషించి అతడు అగ్ని హోత్ర స్వరూపాన్ని బాగా నే అవగాహన  చేసుకొన్నాడని మెచ్చాడు .అతనికి వంద ఆవులనిస్తాను అని చెప్పి ,’’అగ్ని హోత్ర ఆహూతుల ఉత్క్రమణ కాని ,ప్రతి స్టకాని ,తృప్తినీ ,పునరావృత్తి ,ప్రతిపక్ష లోకం కాని నీకు తెలియదు ‘’అంటూ రధం ఎక్కి వెళ్ళిపోయాడు జనకమహారాజు .రాజు తమల్ని అతిక్రమించి  అవమానపరచాడని   భావించి శ్వేతకేతువు ,సోమశుష్ముడు రాజును  తమతో బ్రహ్మవాదానికి రమ్మని సవాలు చేద్దా౦ అందులో రాజు తమముందు ఓడిపోతాడు అన్నారు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’మనం బ్రాహ్మణుల౦  .అతడు రాజు .మనమే జయిస్తే జాతి తక్కువవాడిని జయించిన వాళ్ళం అవుతాం. అతడే జయిస్తే బాపలను రాజు జయించాడని లోకమంతామనల్నే  గేలి చేస్తుంది.కనుక ఆమాట తలపెట్టవద్దు ‘’అని సలహా ఇచ్చాడు .తర్వాత యాజ్ఞవల్క్యుడు రధమెక్కి జనకుడి దగ్గరకు వెళ్ళాడు .

 ఎందుకు వచ్చావంటే అగ్ని హోత్రం గురించి తెలుసుకోవటానికే వచ్చానన్నాడు యాజ్ఞవల్క్యుడు .జనకుడు చెప్పటం ప్రారంభించాడు ‘’మహర్షీ !ఉదయం చేసే అగ్ని హోతాహూతులు అంతరిక్షానికి పోయి ఆహవనీయం చేస్తాయి .వాయువును సమిధలుగా మరీచులను ఆహూతులుగా చేసి అంతరిక్షాన్ని తృప్తి చెందించి స్వర్గానికి పోతాయి .అక్కడే ఆహవనీయంగా ఆదిత్యుని సమిధగా చంద్రుని శుద్ధ ఆహూతిగా చేసి దివాన్ని తృప్తి చెందిస్తాయి .దివి నుండి భువికి  వచ్చి భూమినే ఆహవనీయాగ్నిగా ,అగ్నిని సమిధగా ఓషధులను శుద్ధ ఆహూతులుగా చేసి భూమిని తృప్తి చెందిస్తాయి .భూమినుండి పురుషుని చేరి ,అతని నోటిని ఆహవనీయంగా నాలుకను సమిధగా ,అతడు తిన్న ఆహారాన్ని శుద్ధ ఆహూతిగా చేస్తాయి .ఈ విధంగా ముఖం మొదలైనవి ఆహవనీయ ఆదిత్య రూపం అని తెలిసిన పురుషునికి అగ్నిహోత్రం హుతమౌతుంది .అక్కడినుంచి స్త్రీలో ప్రవేశించి ,ఆమె ఉపస్థను ఆహవనీయంగా,దారకాలను సమిధలుగా ,శుక్రాన్ని ఆహతిగా చేసి స్త్రీని తృప్తి చెందిస్తాయి .కారణం ప్రజాపతి వీటి చేతనే ప్రజలను భరిస్తాడుకనుక .ఇది తెలిసిన విద్వాంసుడు మిధునాన్ని పొందుతాడు అంటే ప్రియను కలుస్తాడు .అతడి అగ్నిహోత్రం హుతం అవుతుంది .అప్పుడు స్త్రీలో పుత్రుడు పుడతాడు  .ఈ పుట్టినవాడే మళ్ళీ పుట్టే లోకం .అగ్ని హోత్రం అంటే ఇదీ .ఇంతకంటే ఏమీ లేదు ‘’అని చెప్పగా యాజ్ఞవల్క్యుడు మిక్కిలి సంతోషించి జనకుని అభినందించి వరం అడగమని రాజునే కోరాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.