యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11
సరే అని ‘’బ్రహ్మం ‘’విషయం పై చర్చిద్దామన్నాడు జనకుడు .అప్పుడు జనకుడు బ్రహ్మ అంటే వసిస్టుడయ్యాడు .మరో సారి జనక యాజ్ఞావల్క్యులు అగ్నిహోత్రం గురించి చర్చించారు..అగ్ని హోత్ర ద్రవ్యం గురించి తెలుసా అని రాజు అడిగాడు .తెలుసు అనగా చెప్పమంటే పాలు అన్నాడు .అవిలేకపోతే దేనితో హోమం చేస్తావని అడిగితె వ్రీహి తో అనగా ,అదీ లేకపోతె అంటే ఓషదులతో అనగా అవీ లేకపోతె అంటే నీళ్ళతో అంటే అవీ లేకపోతె ఏం చేస్తావు అని అడిగితె యాజ్ఞవల్క్యుడు ‘’సత్యాన్ని శ్రద్ధలో హోమం చేస్తాను ‘’అన్నాడు .
ప్రకృతి మొదలైనవాటి గురించి చెప్పమని రాజు అడిగితె మహర్షి ‘’అవ్యక్తం మహస్సు ,అహంకారం ,పృథ్వి ,నీరు ,తేజము వాయువు ఆకాశం అనే ఎనిమిది ప్రకృతులు అంటారని చెవి చర్మం ,జిహ్వ ,ముక్కు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ,వాక్కు హస్తాలు పాదాలు పాయువు మేఢ్ర౦ లను వికృతుల౦టారని ,వీటిలో శబ్దము మొదలైన పంచ భూతాల వలన పుట్టినవి విశేషాలు అంటారని జ్ఞానేంద్రియాలు అవిశేషాలనీ ,మనసు పదహారవదిగాఆధ్యాత్మ చింతనాపరులు భావిస్తారని ,ఈ మొత్తం 24లను తత్వాలు అంటారని శ్రుతులు చెప్పాయన్నాడు .
జనకుడు నవవిధ సృస్టుల గురించి చెప్పమని అడగగా మహర్షి ‘’అవ్యక్తం అంటే మూల ప్రకృతి నుంచి మహాదాత్మ పుట్టింది .ఇదే మొదటి సృష్టి .మహత్తు నుంచి అహంకారం పుట్టి బుధాత్మకమైన ద్వితీయ సృష్టి అయింది .అహంకారంనుంచి ఆకాశం మొదలైన భూతాత్మక
మనస్సు పుట్టి అహంకారిక తృతీయ సృష్టి అయింది .మనసు నుండి మహాభూతాలు అయిదు పుట్టి మానసిక నాల్గవ సృష్టి అయింది .శబ్ద స్పర్శ రస గంధ రూప మైన భౌతిక పంచమ సృష్టి ఏర్పడింది. శ్రోత్వ చక్షు త్వక్ జిహ్వ ఘ్రాణం అనే చి౦తాత్మక ఆరవ సృష్టి జరిగింది .కర్మేంద్రియాలు పుట్టి ఐంద్రియ సప్తమ సృష్టి అయింది .ఊర్ధ్వంగా పుట్టే వాయువు అంటే ప్రాణం అడ్డంగా పుట్టే వాయువులు అంటే అపాన ఉదాన వ్యానాలు పుట్టి ఆవర్జక ఎనిమిదవ సృష్టి అయింది .తర్వాత అడ్డం గా పోయే వాయువులు అనగా సమానం దానం వ్యానం ,క్రిందుగా పోయే అపానం వాయువులు పుట్టి అనార్జవం అనే తొమ్మిదవ సృష్టి అయింది ‘’ అని వివరించాడు .
సంతృప్తి చెందిన జనకరాజు గుణాలు కాలం గురించి వివరించమని కోరాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పది వేల కల్పాలు అవ్యక్త పురుషుడికి ఒక పగలు ,రాత్రి కూడా అంతేపరిమాణం కలది .రాత్రి గడవగానే అతడు సకలప్రాణులకు జీవాధారమైన ఓషధులను సృష్టిస్తాడు .తర్వాత హిరణ్మయమైన అండం నుండి బ్రహ్మ౦ ను సృష్టిస్తాడు. ఇతడే సర్వభూతాలకు మూర్తి .ఒక సంవత్సరకాలం ఆ అండంలోనే ఉండి,తర్వాత బయటికి వచ్చి ఆ అండంలో సగం స్వర్గం గా సగం భూమిగా చేశాడు అని వేదాలే చెప్పాయి .ఈ రెండిటికి మధ్య ఆకాశం ఏర్పరచాడు .ఏడు వేల ఏనూరు కల్పాలు బ్రహ్మకు ఒకపగలు అంతేకాలం రాత్రి .మహత్తు అనబడే బ్రహ్మం అహంకారం ,తర్వాత తన శరీరం నుండి నలుగురుపుత్రులు అంటే మన పితరులకు పితరులను పుట్టించాడు .జ్ఞానేంద్రియాలు అంతఃకరణ ఈ పితరులనుండే పుట్టినట్లు ,చరాచర జగత్తు అంతా ఆ మహా భూతాలచేత నిండింప బడినట్లుగావింటున్నాము .అహంకారం అయిన పరమేస్టి పంచభూతాలను సృజించాడు. ఆ అహంకారం కు అయిదు వేలకల్పాలు పగలు అయిదు వేలకల్పాలు రాత్రి అవుతాయి .శబ్ద స్పర్శాదులు పంచమహాభూతాలతోచేరుతాయి .ఈ అయిదు ప్రాణులలో చేరి స్నేహం అతిక్రమణ మాత్సర్యం కలిగిస్తాయి .ఇవి అవ్యయాలను హరిస్తాయి ,గుణాల చేత పురిగొల్పబడి,ఒకదాన్ని ఒకటి చంపుతూ తిర్యక్ వ్యోమాలలో ప్రవేశించి ,ఈలోకం చుట్టూ తిరుగుతాయి .వీటికి మూడువేలకల్పాలు పగలు మరో మూడు వేలకల్పాలు రాత్రి అవుతాయి .ఇంద్రియాలను పురికొల్పినప్పుడు మనస్సు అన్ని వస్తువులపైకిపోతుంది .ఇంద్రియాలు ఒకదానినొకటి కనుక్కోలేవు. మనస్సు మాత్రమే వాటిమూలంగా విషయాలు తెలుసుకొ౦టుంది.కన్ను మనసు సాయం తో రూపాన్ని చూస్తుంది .మనసు పని అయిపోతే ఇంద్రియాలపనీ ఆఖరు .కనుక ఇంద్రియాలు మనసుకు లోబడే ఉంటాయి .మనసే ఇంద్రియాలకు ఈశ్వరుడు .జగత్తులో ఉన్న 20భూతాలూ ఇవే ‘’అని చెప్పాడు .
గంభీర విషయాలను కూడా సునాయాసంగా అరటిపండు వొలిచి చేటిలో పెట్టినట్లు చెప్పిన యాజ్ఞావల్క్యుని జ్ఞానానికి అబ్బురపడి జనక మహారాజు భూత సృజన ,సంహారం అనాదినాధుడు బ్రహ్మ ఎలా చేస్తాడని ప్రశ్నించాడు .యాజ్ఞవల్క్యుడు ‘’ రాత్రి కాగానే బ్రహ్మ నిద్రపోతాడు .భూత సంహారం కోసం ఒక రుద్ర రూపుడిని ఏర్పాటు చేస్తాడు .ఆ మహారుద్రుడు వందలకొద్దీ సూర్యులై జ్వలించే 12అగ్నులరూపం గా మారుతాడు .తన తేజస్సుచే జరాయుజాలు అండజాలు స్వేదజాలు ఉద్భిజాలనే నాలుగు రకాల జంతువులను దహిస్తాడు ఒక రెప్పపాటుకాలంలో స్థావర జ౦గమాలన్నీ నశిస్తాయి. అప్పుడు భూమి నాలుగు ప్రక్కలకు తాబేటి చిప్పలాగా మారుతుంది .భూమిపై నాలుగు వైపులా నీటిని ప్రవహి౦ప జేస్తాడు .తర్వాత ప్రళయ కాలాగ్ని పుట్టించి భూమిని ముంచేసి ,నీటిని ఇగురి౦ప జేస్తుంది .జలాలు లేకపోవటం తో ఆమహాగ్ని అంతటా ప్రజ్వరిల్లుతుంది .సప్తాగ్ని జ్వాలలను ఎనిమిది మూర్తులతో వాయువు భక్షి౦చి కిందకు మీదికి అడ్డంగా నాలుగు ప్రక్కలకు పరుగులు తీస్తుంది .అతి విస్తృతి చెందిన వాయువును ఆకాశం మింగేస్తుంది .మనసు ఉల్లాసం తో ఆకాశాన్నే మింగేస్తుంది .ప్రజాపతి మనస్సును మింగితే ,అహంకారం మనస్సును మింగగా మహదాత్మ అహంకారాన్ని మింగేస్తుంది .అప్పుడు ప్రజాపతి ,అణి మహిమాది విభూతి సంపన్నుడైన శంభుడు మహదాత్మను మింగేస్తాడు . అతడి చేతులు ,పాదాలు నేత్రాలు శిరస్సు ముఖం చెవులుకలిగి అన్నిట్లో వ్యాపిస్తాడు .అన్ని భూతాలకు హృదయమై అంగుస్టమాత్ర పరిమితమై ఉంటాడు .అన౦తుడు మహాత్ముడు ఐన ఈశ్వరుడు ఈ విధంగా జగత్తు నంతా మింగుతున్నాడు .చివరికి అక్షయం ,అవ్యయం అప్రణవం, భూత భవిష్యత్తులను సృష్టించే అనఘుడైన పరబ్రహ్మం ఒక్కటే మిగిలి ఉంటుంది ‘’అని సవిస్తరంగా సృష్టి ప్రయోగ ఉపసంహారాలను వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-19-ఉయ్యూరు . .
.