గౌతమీ మాహాత్మ్యం -47
62- యమతీర్ధం
పితృదేవతలకు ప్రీతికరమైన యమ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .పూర్వం ‘’సరమ ‘’అనే దేవ శునక స్త్రీ ఉండేది .ఆమెకు శ్రేష్టమైన రెండు మగ శునకాలు పుట్టాయి .వాటికి నాలుగు కళ్ళు ఉండటం చేత వాయు భక్షణకోసం రోజూ దేవతలవెంట వెళ్ళేవి .వీటిపై యముడికి ప్రీతి ఎక్కువ .దేవతల యజ్ఞాలకు పోషి౦పబడే పశువులను సురమ కాపలా కాసేది .యజ్ఞ పశువులను రాక్షసులు ఆమెను మోసగించి దొంగిలించారు .సరమ దేవతలకు విషయం విన్నవించింది .బృహస్పతి ఆమెదే దోషమన్నాడు .నిజమని నమ్మి ఇంద్రుడు ఆమెను పాదం తో తన్నాడు .ఆ ఘాతానికి సరమ శునక ముఖం నుంచి పాలు కారాయి .రాక్షసులు అపహరించిన ఆవుపాలు ఆమె తాగిందికనుక ,వాటిని తీసుకొచ్చే బాధ్యతా ఆమెదే అన్నాడు .దానికి ఆమె ఇందులో తనది కాని ఇతరులదికాని తప్పు లేదని తాను కాపలా లో నిర్లక్ష్యం చూపలేదనీ బలవంతులైన రాక్షసులు తనను బంధించి గోవులను ఎత్తుకు పోయారని చెప్పింది .దేవగురుడు ధ్యానించి ఆమె నిజంగా దుస్టురాలని ,శత్రు పక్షం లో చేరిందనిఅనగా ఇంద్రుడు ఆమెను మానవ లోకం లో ఆడకుక్కగా పుట్టమని శపించాడు .అలాగే ఆడకుక్కగా భయంకరమైనదిగా పుట్టింది .
యజ్ఞ గోవుఅలను తెచ్చే ప్రయత్నం చేస్తూ ఇంద్రుడు విష్ణువును దర్శించి నివేదించాడు .ఆయన దోషులైన దైత్య దనుజ ,రాక్షసులను సంహరించటానికి శార్ ఙ్గ ధన్సుస్సుతో బయల్దేరి దండకారణ్యం లోఉన్న దేవ దనుజ రాక్ష సంహారం చేశాడు .అప్పటినుంచి విష్ణువుకు శార్ ఙ్గపాణి అనే పేరొచ్చింది .విష్ణువుకు భయపడ్డ రాక్షసులు దక్షిణ దిక్కుకు పారిపోయారు .గరుడవాహనమెక్కి విష్ణువు వారిని వెంబడించి గంగ ఉత్తర తీరం లో తన ధనుర్బాణాలతో చంపేశాడు .అపహరింపబడిన గోవులను దేవతలకు ఇచ్చాడు .ఇదే గో తీర్ధం లేక బాణ తీర్ధం .గ౦గ దక్షిణ తీరం లో గోవులు యజ్ఞ పశువులయ్యాయి .దేవతలంతా ఇక్కడే గంగలో మునిగి మధ్యభాగం లో ఒక ద్వీపాన్ని ఏర్పాటు చేసి దేవతాయజ్ఞం చేశారు .ఇదే యజ్ఞ తీర్ధం ,గోరక్షక తీర్ధం అయింది .
నాలుగు కన్నులున్న సరమ కొడుకులు యముడికి జరిగినదంతా చెప్పారు .యముడు వారిద్దరినీ తీసుకొని తన తండ్రి సూర్యుడి దగ్గరకు వెళ్ళాడు .ఆయన గంగా తీరం చేరి పవిత్ర స్నానం చేసి బ్రహ్మా విష్ణు మహేశ్వరుల ధ్యానం చేయమన్నాడు .అలాగే చేశాడు శునకాలతో సహా .సరమ శాప విమోచనమై సుఖ శాంతులు పొందింది .
63-యక్షిణీ సంగమం
యక్షిణీ సంగమ౦లో స్నాదోషనివారణం సకల అభీస్ట దాయకం .పూర్వం విశ్వావశువుకు పిప్పలా అనే సోదరి ఉండేది .ఆమెకు బిగ్గరగా నవ్వటం అలవాటు .ఒకసారి ఆమె గంగా తీరం లో ఋషులు చేస్తున్న యజ్ఞాన్ని చూడటానికి వెళ్లి వాళ్ళను పరిహాసం చేస్తూ ‘’నౌ షడ్, శ్రౌ షడ్’’అంటూ బిగ్గరగా అపస్వరం తో పలికింది .కోపించిన ఋషులు ఆమెను నదిగా మారమని శపించారు .నదిగా మారి యక్షిణి పేరుతొ పిలువబడింది .ఇది తెలిసిన ఆమె సోదరుడు విశ్వావశువు ఋషులను, ముక్కంటిని పూజించి యక్షిణి నదిని గంగలో కలిపేసి శాపవిమోచనం కావించాడు .ఇక్కడే విశ్వావశువుకు ఉమామహేశ్వరుడు సాక్షాత్కరించాడుకనుక ఇది శైవ తీర్ధం, దుర్గా తీర్ధంగా పిలువబడింది .సమస్త దుర్గతులు పోగొట్టే ఈ తీర్ధం ముఖ్య తీర్ధమైనదని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-2-19-ఉయ్యూరు

