గౌతమీ మాహాత్మ్యం -51
69-భాను వాది సహస్ర తీర్ధం
శర్యాతి అనే రాజు ధార్మికుడు .భార్య స్థవిష్ట.విశ్వామిత్ర గోత్రజుడు ,’’మధుచ్చందుడు ‘’అనే పేరున్న బ్రహ్మర్షి పురోహితుడు .ఇద్దరూ కలిసి ఒకసారి దిగ్విజయ యాత్ర చేశారు .ఒక చోట విడిది చేసి పురోహితుడు అన్యమనస్కంగా ఉండటం గ్రహించి రాజు కారణమేమిటి అని అడిగాడు .భార్య తనకై ఎదురు చూస్తూ ఉంటుందనే దిగులుతో ఉన్నానని చెప్పాడు .అనిత్య సుఖాలపై ఆరాటం పనికి రాదని రాజు హితవు చెప్పాడు .మధుచ్చందుడు’’రాజా !దంపతులు అనుకూలంగా ఉంటె ధర్మార్ధకామాలు వృద్ధి చెందుతాయి .సుఖం దూషణంకాదు మాన్యమైనదే ‘’అన్నాడు . మళ్ళీ ఇద్దరూ రాజ్యానికి తిరిగివచ్చి ,పురోహితునిప్రేమను పరీక్షించాలనుకొని వార్తాహరునిద్వారా’’ రాజు ,మంత్రిని ఒక రాక్షసుడు అపహరించి పాతాళానికి తీసుకు వెళ్ళాడు’’ అని వార్తా పంపాడు .రాజుభార్య ఆ వార్తలోని నిజం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే, ఆవార్తవిన్న పురోహితుడి భార్య ప్రాణాలు విడిచింది .ఈ వార్తను వార్తాహరుడు రాజుకు చెప్పాడు .
పురోహితుని భార్య శవాన్ని కాపాడమని తానూ పురోహితుడు అక్కడికి వస్తున్నామని చెప్పిపంపాడు .విచారం లో ఉన్నరాజుకు ఆశరీరవాణి’’ సకలపాపాలు ,దుఖాలు పోగొట్టుతుంది గంగానది’’ అని పలికింది .రాజు గౌతమీ నదిని చేరి స్నానించి బ్రాహ్మణులకు దానాలిచ్చి ‘’నేనేదైనా పుణ్యం చేసినా దానం చేసినా సత్యం పాటించినా నా ఆయుస్సు పోసుకొని మధుచ్చ౦ద పురోహితుని సాధ్వీ సతీమణి జీవి౦చు గాక ‘’అని సిద్ధం చేయబడిన అగ్నిలో దేహత్యాగం చేయటానికి అగ్ని ప్రవేశం చేయగానే ,అక్కడ పురోహితునిభార్య బ్రతికి అందరికి ఆశ్చర్య౦ కలిగించింది .తనభార్యకోసం రాజు ప్రాణత్యాగంచేయటం జీర్ణించుకోలేని పురోహితుడు ముందుగా రాజును బ్రతికించి తర్వాతే తన ధర్మపత్ని దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకొని సూర్యుని –‘’నమోస్తు తస్మై సూర్యాయ ముక్తయే అమిత తేజసే -ఛందోమయాయ దేవాయ ఓం కారార్దాయ తేనమః ‘’-‘’విరూపాయ సురూపాయ త్రిగుణాయ త్రిమూర్తయే –స్థిత్యుత్పత్తి నాశానాం హేతవే ప్రభవిష్ణవే ‘’అంటూ స్తుతించాడు .
ప్రీతి చెంది భానుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే రాజును తన ప్రియభార్యను బ్రతికించ మని కోరాడు .వెంటనే సూర్యుడు శర్యాతి రాజును ,పురోహితునిభార్య ను బ్రతికించి ఇచ్చాడు .రాజు, రాణి, పురోహితుడు, భార్య అందరూ నగరానికి చేరి సుఖ సంతోషాలతో వర్దిల్లారు. ఇదే భాను తీర్దమని , మృత సంజీవినీ తీర్ధమని ,శర్యాత తీర్ధమని మధుచ్చంద తీర్ధమని పేరుపొంది మూడు వేల తీర్దాలతో విరాజిల్లుతోందని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-19-ఉయ్యూరు

