గౌతమీ మాహాత్మ్యం -53
72-కపిలా సంగమ తీర్ధం
ముల్లోకాలలో ఉత్తమోత్తమమైనది కపిలా సంగమతీర్ధం .కపిలముని క్రూరుడే అయినా ప్రసన్నుడు .గౌతమీ తీరం లో తపస్సు చేసుకొంటున్న ఆయనదగ్గరకు వేనుని సంహరించి ,రాజ్యం అరాజకంగా ఉండటం చేత వామదేవాది మునులు వచ్చి వేదాలు యజ్ఞయాగాదులు ఆదరణకు నోచుకోవటం లేదని చెబితే ,వేనుని తొడ చిలికితే పరి ష్కారంలభిస్తుందని చెప్పగా అలాగే చేయగా వేనుని తొడనుంచి నల్లని మహాపాపం బయటికి రాగా భయపడి ‘’నిశీదస్వ ‘’అంటే కూర్చో అన్నారు .అతడే నిషాదుడు –బోయవాడు అయ్యాడు .అతని సంతానమే నిషాదులు .తర్వాత మునులు వేనుని దక్షిణ బాహువు ను చిలికారు .దాని నుండి సర్వ లక్షణమైన స్వరం తో సిరిగల పృధు రాజు పుట్టాడు .దేవతలు వచ్చి ఆశీర్వదించి ఆయనకు కావాల్సినవన్నీ ఇచ్చారు అతడిని ‘’పృథువు’’అని పేరుపెట్టి జీవులకు ,వోషధులకు ఆహారం ఇవ్వమని ఆదేశించారు .అతడు ధనుస్సు తీసుకొని భూమిని ఆమె మింగిన ఓషధులను ఇవ్వమన్నాడు .తాను మింగేసిన వాటిని మళ్ళీ ఇచ్చే సమర్ధత తనకు లేదని భూమి చెప్పింది .తనమాట విని ఇవ్వకపోతే సంహరిస్తా అని పృథువు పృధివిని భయపెట్టాడు .తాను లేకుండా దేన్ని పాలించగలవని ప్రశ్నించింది .
అతడు ఒకరి చావు అనేకులకు మేలు అయితే దోషం లేదంటారని ,ప్రజలను తపస్సుతో ధరిస్తానని చెప్పాడు .ఇంతలో దేవతలు ,ఋషులు అక్కడికి వచ్చి రాజును ఓదార్చి భూదేవితో ‘’గోవు రూపం పొంది ,పాలరూపం లో నీలోని ఓషధులను పిండి రాజుకు సంతోషం కలిగగించి ప్రజారక్షణం ,క్షేమం కలిగించు ‘’అన్నారు .భూమి ఆవురూపం పొంది కపిలముని దగ్గర నిలబడింది .ఆ ఆవు పొదుగునుండి పృథువు మహా ఓషధులను ,నర్మదా సరస్వతి భాగీరధి ,గోదావరి మొదలైన నదులను పాలరూపం లో పిండాడు .పృథువుతో పిండబడిన పృధివి పుణ్యజలాలు కల నదిగా మారి గౌతమీనదితో కలిసిపోయింది .అప్పటిను౦చి అది కపిలాసంగమ తీర్ధమై ,ఎనిమిది వేల తీర్థాలతో వర్ధిల్లింది అని బ్రహ్మ నారదునికి ఉవాచ
73-దేవస్థాన తీర్ధం
కృతయుగం మొదట్లో జరిగిన దేవదానవ యుద్ధకాలం లో ‘’సింహిక ‘’అనే రాక్ష స్త్రీ ఉండేది .ఆమె కొడుకు రాహువు మహా బలవంతుడు .అమృతోద్భవం జరిగినప్పుడు రాహువు ఖండించబడ్డాడు .అతడికొడుకు మేఘ హాసుడు దుఖం భరించలేక గంగాతీరం లో తపస్సు చేయ సంకల్పించాడు .సహజంగానే భయపడిన దేవతలు అతడిని సమీపించి తపస్సు వద్దని అతని మనసులోని కోరికలన్నీ తీరుతాయని చెప్పారు .అలాగే చేస్తానుకానీ తనతండ్రి కి న్యాయం చేయమని , ఇకనుంచి వారిమధ్య వైరం ఉండరాదని ఆతీర్ధం తనపేర విరాజిల్లాలని కోరగా సరే అని రాహువును గ్రహం గా చేశారు . అదే మేఘ హాస తీర్ధం ,దేవస్థాన తీర్ధం ,దేవతీర్ధం .ఇక్కడ 18తీర్దాలేర్పడి ప్రసిద్ధి చెందాయని నారదునికి బ్రహ్మ చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-19-ఉయ్యూరు

