ఇజ్రాయిల్ ఏకైక మహిళా ప్రధాని గోల్డా మీర్ –

బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు:

1898 మే నెల 3వ తేదీ న జన్మించిన’’ గోల్డా మాబో విచ్ ‘’ఆనాటి రష్యా సామ్రాజ్యం లో, నేటి యుక్రెయిన్ లో బ్లూమ్ నీడిచ్ ,మాషే మాటోవిచ్ దంపతులకు జన్మించింది .కార్పెంటర్ అయిన తండ్రి ఉద్యోగాన్వేషణలో 1903లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ కి , తర్వాత మిల్ వాకీ సిటీ కి చేరి రెండేళ్ళు బాగా కస్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని తెచ్చుకొన్నాడు తల్లి గ్రోసరి దుకాణాన్ని చూసుకొనేది .గోల్డా ఆమెకు సాయం చేసేది .1906నుండి 1912 వరకు ఫోర్త్ స్ట్రీట్ గ్రేడ్ స్కూల్ లో చదివింది .స్టూడెంట్ లీడర్ గా ఉంటూ తోటి విద్యార్ధులు పుస్తకాలు కొనుక్కోవటానికి నిధి సేకరించి అందజేసింది .’’అమెరికన్ య౦గ్ సిస్టర్స్ అసోసియేషన్ ‘’స్థాపించి ,ఒక హాలు అద్దెకు తీసుకొని సభలు సమావేశాలు జరిపింది .తన క్లాస్ కు ‘’వాలడి క్టేరియన్’’గా గ్రాడ్యుయేట్ అయింది .

చదువుతోపాటు ఉద్యోగం –సామాజిక దృక్పధం:

14 వ ఏట గోల్డా ‘’నార్త్ డివిజన్ హైస్కూల్’’ లో చేరి చదువుతూ ,మిల్ వాకీ పబ్లిక్ లైబ్రరీ వంటి ప్రసిద్ధ సంస్థలలో పార్ట్ టైం ఉద్యోగమూ చేసింది .తల్లికి గోల్డా ను చదువు మానిపించి పెళ్లి చేయాలని ఉండేది .కాని ఇష్టం లేని గోల్డా పెళ్లి అయిన అక్క షెనా కార్న్ గోల్డ్ తో కలిసి డెన్వర్ కొలరెడో లో ఉండటానికి ట్రెయిన్ టికెట్లు కొని వెళ్లి పోయింది . అక్కా, చెల్లెలు తమ మేధస్సును ఇతరులతో పంచుకొంటూ సాయంకాలాలు గడిపేవారు .జియోనిజం ,సాహిత్యం, స్త్రీ ల వోటు హక్కు ,ట్రేడ్ యూనియన్ వంటి సమస్యలపై మీర్ నిస్సంకోచంగా తన స్థిర అభిప్రాయాలు తెలియబర చేది .ఆమె అభిప్రాయాలను అందరూ మన్ని౦చేవారు .తనజీవితాన్ని తీర్చి దిద్దింది డెన్వర్ లో గడిపిన రోజులే అని గోల్డా చెప్పింది .

లేబర్ జియోనిజం పై ఆసక్తి –వివాహం:

1913లో మళ్ళీ నార్త్ డివిజన్ హైస్కూల్ కు వచ్చి 1915లో గ్రాడ్యుయేట్ అయింది గోల్దామీర్ .య౦గ్ పావోల్ జియాన్ లో క్రియా శీలకపాత్ర పోషిస్తూ చివరికి సోషలిస్ట్ జియోనిజం లో చేరింది .మిల్వాకీ లోని స్టేట్ నార్మల్ స్కూల్ లో చేరి ‘’ఇద్ధిష్ స్పీకింగ్ ఫోక్స్ స్కూల్ లో లేబర్ జియోనిజం లో ముఖ్య పాత్ర పోషించింది .మోరిస్ డేయార్సన్ తో సన్నిహిత౦ గా మెలగి లేబర్ జియానిస్ట్ కు అంకితభావంతో పని చేస్తూ మిల్వాకీ పబ్లిక్ లైబ్రరీ లో పార్ట్ టైం ఉద్యోగం చేసింది . మేరిస్ ను తామిద్దరం ఇజ్రాయిల్ లో స్థిరపడటానికి ఒప్పించి గోల్డా అతనిని 1917లో పెళ్లి చేసుకొన్నది .అమెరికా మొదటి ప్రపంచయుద్ధం లో చేరటంవలన ఇజ్రాయిల్ వెళ్ళే అవకాశం ఆగిపోయి ,అమెరికాలోనే ఉంటూ దేశమంతా తిరుగుతూ పోల్ జియాన్ యాక్టి విటీస్ నిధి కోసం తీవ్రంగా కృషి చేసి విజయం సాధించింది .

పాలస్తీనా రాజకీయం –ఉద్యోగ సోపానం:

గోల్డా మీర్ దంపతులు 1921లో పాలెస్తీనా లో స్థిరపడ్డారు. వీరిద్దరితోపాటు ఆమె సోదరి శయనా కూడా వచ్చింది . బ్రిటిష్ మాండేట్ పాలస్టైన్ లో గోల్డా దంపతులు కిబ్బూజ్ లో చేరారు .అక్కడ వాళ్ళపని ఆల్మండ్ లను కోయటం ,మొక్కలు నాటటం ,వంటపని ,గుడ్ల పని చేయటం .ఆమె శక్తి సామర్ధ్యాలు గుర్తించి ఆమెను హిస్ట్రా డట్ అనే జనరల్ ఫెడరేషన్ లేబర్ కు ప్రతినిధిని చేశారు .1924లో దీన్ని వదిలి టెల్ అవైవ్ కు దంపతులు చేరి ఒకకొడుకు ఒక కూతురు లకు జన్మనిచ్చారు .1928లో గోల్డా వర్కింగ్ వుమెన్ కౌన్సిల్ సెక్రెటరి అయింది .దీనివలన 1932-34వరకు రెండేళ్ళు సంతానం తో అమెరికాలో ఆమె ఉండాల్సి వచ్చింది .భర్త జెరూసలెం లో ఉండి పోయాడు .ఇలా విడిపోయిన ఆ భార్యా భర్తలు తిరిగి కలుసుకోలేదు. కానీ విడాకులు తీసుకోనూ లేదు.1951లో మోరిస్ చనిపోయాడు .

రాజకీయ సోపానం:

1934లో అమెరికా నుంచి తిరిగి వచ్చాక గోల్డా మీర్ ‘’హిస్ట్రా డట్’’ఎక్జి క్యూటివ్ కమిటీలో చేరి క్రమంగా ఎదుగుతూ పొలిటికల్ డిపార్ట్ మెంట్ హెడ్ అయింది .ఇందులో పొందిన శిక్షణ ఆమె భవిష్యత్ నాయకత్వానికి గొప్ప ఆసరా అయింది.1938లో అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ 32దేశాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఈవియన్ కాన్ఫరెన్స్ కు పాలస్తీనా తరఫున జ్యూయిష్ పరిశీలకు రాలిగా హాజరై, ఐరోపా యూదుల దయనీయ స్థితి గతులను వివరించి , ఆ దేశాలు యూదు శరణార్ధులను ఎందుకు అనుమతించటం లేదని తీవ్రమైన ఆవేశంతో ప్రశ్నించింది .డొమెనికన్ రిపబ్లిక్ మాత్రం ఒక లక్షమంది శరణార్ధులకు అనుమతించింది .ఆ సమావేశ ఫలితం సంతృప్తి గా లేదని విలేఖరులతో చెబుతూ గోల్డా ‘’నేను బతికి ఉన్నంతకాలం నా పాలస్తీనా ప్రజలకు ఇక సానుభూతి వచనాలు సహించను ‘’అని మొండి ధైర్యం తో తెగేసి చెప్పింది .

యూదుల వాణి:

1946లో బ్రిటిష్ ప్రభుత్వం పాలస్తీనాలో జియోనిస్ట్ ఉద్యమం పై తీవ్రంగా విరుచుకు పడింది ఈషువ్ అంటే బ్లాక్ షబ్బాత్ సభ్యులను మోషే షెర్రత్ తో సహా వందలాది మందిని అరెస్ట్ చేసింది .గోల్డా మీర్ జ్యూయిష్ ఏజెన్సీ కి చెందిన పొలిటికల్ డిపార్ట్ మెంట్ క్రియా శీలక హెడ్ గా బాధ్యతలు తీసుకొని యూదుల సమస్యలను ప్రపంచం దృష్టికి తెచ్చింది .పాలస్తీనా యూదులకు ,బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగటానికి ముఖ్య ప్రాతినిధ్యం వహించింది .షర్రాత్ విడుదలైనతర్వాత గొల్డాను పొలిటికల్ హెడ్ గా ఉంచి ,అమెరికా వెళ్లి ‘’యు యెన్ పార్టిషన్ ప్లాన్ ‘’తో చర్చలు జరిపాడు .

1948 జనవరిలో జ్యూయిష్ ఏజెన్సీ ట్రెజరర్ కు ఇజ్రాయిల్ కు అమెరికన్ జ్యూయిష్ కమ్యూనిటి నుంచి ఏడు లేక ఎనిమిది మిలియన్ల డాలర్ల ఆర్ధిక సాయం మాత్రమే అందే వీలుంటుంది అని తెలియజేశారు .గోల్డా మీర్ అమెరికా వెళ్లి విస్తృతంగా పర్యటించి, అందరినీ భాగస్వాములను చేసి 50,000,000, డాలర్లు సాధించి ,ఆడబ్బుతో యూరప్ యువకులకు ఆయుధాలు కొనుగోలు చేయించింది ఇది ఆమె సాధించిన చారిత్రాత్మక విజయం అని పత్రికలు పతాక శీర్షికలతో రాశాయి .1948 మే 10న ఇజ్రాయిల్ సాధికారంగా ఏర్పడటానికి నాలుగు రోజులముందు గోల్డామీర్ ఆరబ్ మహిళా వేషం లో అమ్మాన్ లో జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశమై యూదులపై దాడి చేయటానికి ఇతర ఆరబ్బు దేశాలతో చేతులు కలపవద్దని కోరింది .ఆయన ఇజ్రాయిల్ దేశం ఏర్పాటుపై ప్రకటనకోసం తొందరపడ వద్దని సలహా ఇచ్చాడు .దీనికి ఆమె ‘’ఇప్పటికి 2 వేల సంవత్సరాలనుంచి ఇజ్రాయిల్ దేశం కోసం ఎదురు చూస్తున్నాం .ఇది తొందరపాటా ?’’అని ఎదురు ప్రశ్న వేసింది .ఇజ్రాయిల్ స్వాతంత్ర యుద్ధం మొదలవటానికి ముందు ఆరబ్బులంతా దేశం విడిచి వెళ్లి పోవాలని అల్టిమేటం ఇచ్చింది .

ఇజ్రాయిల్  ప్రకటన:

1948మే14 న ‘’ఇజ్రేలి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ‘’పత్రం పై గోల్డా మీర్ తోపాటు 24 మంది ప్రముఖులు సంతకాలు చేసి విడుదల చేశారు .ఈ సందర్భంగా ‘’నిజమైన నా ప్రజలు నిజంగా ఈపని చేస్తున్నారా అని ఆశ్చర్య పడుతున్నాను ‘’అన్నది గోల్డా . ఆ మర్నాడే సరిహద్దు దేశాల సైన్యాలు ఇజ్రాయిల్ పై దాడి ప్రారంభించాయి .ఇదే ‘’1948 ఆరబ్ –ఇజ్రాయిల్ యుద్ధం ‘’గా చరిత్రకెక్కింది .ఆసైన్యాన్ని దీటుగా ఎదుర్కొని ,ఇజ్రాయిల్ ప్రజలను సంఘటితపరచి యుద్ధానికి పరి సమాప్తి పలికింది .

మంత్రి పదవి –రష్యా ప్రజల అపూర్వ స్వాగతం –కరెన్సీ నోటు పై గోల్డా బొమ్మ:

మొదటి ‘’ఇజ్రాయిలి పాస్ పోర్ట్ ‘’పొంది గోల్డా మీర్ ఇజ్రాయిల్ మంత్రిగా బాధ్యతలు చేబట్టి1948 సెప్టెంబర్ 2నుంచి 1949మార్చి వరకు ఉన్నది .ఆయుధ సేకరణకు రష్యాతో సంబందాలు అవసరం అని భావించి స్నేహ హస్తం చాచింది .రష్యా నియంత స్టాలిన్ కూడా అనుకూలంగా స్పందించాడు .తర్వాత హిబ్రూ భాష నిషేధం ,యూదుల సంస్థలపై నిషేధం పెట్టిన రష్యాతో మైత్రి తెగ తె౦పులయింది .ఈ కొద్దికాలం లోనే గోల్డా మాస్కో వెళ్లి రోష్ హసన్నా ,యాం కిప్పూర్ సమావేశాలలో పాల్గొన్నది .వేలాది రష్యన్ యూదులు ఆమె పేరు స్మరిస్తూ వీధులలో స్వాగతం పలికారు .ఇజ్రాయిల్ దేశం 10,000ల షెకెల్ బాంక్ నోటు పై ఒకవైపు ఆమె బొమ్మ ,రెండవ వైపు ఆమెకు స్వాగతం పలికిన రష్యా ప్రజల బొమ్మతో ముద్రించి 1984నవంబర్ లో విడుదల చేసి ఆమెకు అత్యధిక గౌరవం కలిగించింది .

ప్రజా సేవలో పునీతం:

1949లో KNESETకు మపాల్ ప్రతినిధిగా ఎన్నికై 1974వరకు 25ఏళ్ళు గొల్డామీర్ సేవలందించింది .1949నుంచి 1965వరకు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేబట్టి విజయవంతంగా పూర్తి చేసింది .శరణార్ధులను జాతీయ పౌరులుగా తీర్చి దిద్దింది .రోడ్డు గృహ నిర్మాణాలకు భారీ ప్రాజెక్ట్ లను నిర్వహించింది .ఆ కాలం లో 2లక్షల అపార్ట్ మెంట్ లు ,30వేల గృహాలను నిర్మించి ఇచ్చింది .అనేక వ్యవసాయ ,కర్మాగార అభి వృద్ధి కార్యక్రమాలు స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ రోడ్లనిర్మాణ౦ చేసింది .1954లో నేషనల్ ఇన్స్యూ రెన్స్ చట్టం తెచ్చి ప్రజలకు సాంఘిక భద్రత కల్పించింది .1955లో బెన్ గున్యాన్ ప్రోద్బలంతో టెల్ అవైవ్ కు మేయర్ గా పోటీచేసి ఆడవారికి పదవేమిటి అనుకొన్న మఠాధిపతుల ఆహ౦కారానికి బలై, రెండే రెండు వోట్ల తేడాతో ఓడిపోయింది .

సమర్ధ విదేశాంగమంత్రి:

1956లో ప్రధాని డేవిడ్ బెన్ గున్యాన్ మంత్రివర్గం లో విదేశీ వ్యవహారాలమంత్రిగా గోల్డా మీర్ సమర్ధవంతంగా పని చేసింది .ఆమెకు ము౦దు పనిచేసిన మోషే షెరాట్ ఆదేశం ప్రకారం విదేశే వ్యవహార శాఖలో పని చేసే వారంతా హిబ్రూ ఇంటి పేరు తప్పక పెట్టుకోవాలనే నియమం తో గోల్డా తన మేయర్సన్ ఇంటిపేరు ను’’ సంక్షిప్తం చేసి ‘’మీర్ ‘’గా మార్చుకొన్నది .దేశాన్ని తీర్చి దిద్దుకొనే నేర్పు ఇజ్రాయిల్స్ కు ఉన్నదని ఆఫ్రికన్ లకు ఇజ్రాయిల్ ఒక రోల్ మోడల్ గా ఉంటుందని తన చర్యలద్వారా చాటి చెప్పింది .విదేశ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేబట్ట గానే సూయజ్ కాలువ సమస్య తీవ్రమై౦ది .ఇదే రెండవ ఆరబ్ –ఇజ్రాయిల్ యుద్ధంగా మారింది .1956ఇజ్రాయిల్ ఈజిప్ట్ పై దాడి చేసింది .త్రైపాక్షిక సమావేశాలలో అంతర్జాతీయంగానూ సమస్య పరిష్కారానికి ఇజ్రాయిల్ తరఫున నిలిచి తనవాణి వినిపించింది .

ఇజ్రాయిల్ తొలి ప్రధాని గోల్డా మీర్:

1957అక్టోబర్ 29న సమావేశ మందిరంలో ఉండగా శత్రువులు వేసిన మిల్స్ బాంబ్ కు మీర్ పాదానికి కొద్దిగా దెబ్బతగిలింది .గున్యాన్, మోషే కార్మెల్ లు తీవ్రంగా గాయపడ్డారు . యూదులకు అండగా నిలిచినందుకు 1958లో 12వపోప్ పయస్ పాల్ కు కృతజ్ఞతలు తెలియజేసింది .1960లో లి౦ఫామా వ్యాధి సోకింది .లేవి ఎష్కోల్ అకస్మాత్తుగా మరణించగా పార్టీ గోల్డా మీర్ ను ప్రధానమంత్రిగా ఉండమని ఆదేశించగా ఇజ్రాయిల్ దేశానికి తొలి ప్రధానిగా గోల్డా మీర్ 17-3-1969 బాధ్యతలు చేబట్టి,1974వరకు అయిదేళ్ళు సమర్ధవంతంగా పాలించింది .జనరల్ ఎన్నికలలో తనపార్టీకి అఖండ విజయం చేకూర్చి రికార్డ్ సృష్టించింది .1969-70కాలం లో రిచర్డ్ నిక్సన్ ,6వ పోప్ పాల్ విల్లీబ్రాంట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నాయకులతో సమావేశాలు జరిపింది .అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఆమోదించి యుద్ధానికి స్వస్తిపలికింది . 1973ఫిబ్రవరి 28 వాషింగ్టన్ లో హెన్రి కిసింజర్ చేసిన శాంతి ప్రపోజల్ ‘’సెక్యూరిటీ వర్సెస్ సావేరినిటి ‘’ ని అంగీకరించింది

1972లో మూనిచ్ ఒలింపిక్స్ లో జరిగిన దారుణ హత్యాకాండ కు బాధ్యులైనవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మీర్ కోరింది .1970లో 2లక్షల రష్యన్ యూదులను ఇజ్రాయిల్ కు వెళ్ళిపొమ్మని ఆదేశించగా వారు ఆస్ట్రియా నుండి ఇజ్రాయిల్ కు బయల్దేరగా కొందరిపై ఆంక్ష విధిస్తే , వారి విడుదలకై పోరాడింది .1973లో గోలన్ హైట్స్ పై సిరియన్ సైన్యాలు దాడి చేస్తాయని తెలిసి యుద్ధ ప్రమాదం ముంచుకొస్తుందని భయపడే తరుణంలో6రోజుల యాం కిప్పూర్ వార్ తర్వాత చాకచక్యంగా వ్యవహరించి యుద్ధ ప్రమాదం తప్పించింది .అప్పుడు ఆమెకు అండగా నిలిచింది ఒంటి కన్నున్న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి మోషే డయాన్ . పదవీ కాంక్ష లేని ప్రధాని.

1973 డిసెంబర్ ఎన్నికలలో మీర్ పార్టీ ఘనవిజయం సాధించింది .కాని గోల్డామీర్ 1974ఏప్రిల్ 11న ‘’ అయిదేళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్నాను .ప్రజాసేవలో సంతృప్తి చెందాను .ఇక చాలు ‘’అని చెప్పి రాజీనామా చేసింది .ఆమె స్థానం లో రాబిన్ ప్రధాని అయ్యాడు .1975లో మీర్ తన స్వీయ జీవిత చరిత్ర ‘’మైలైఫ్ ‘’రాసి ప్రచురించింది .1977లో ఈజిప్ట్ ప్రధాని అన్వర్ సాదత్ ఇజ్రాయిల్ ను మొట్ట మొదటిసారి సందర్శింఛి చరిత్ర సృష్టించాడు .

గోల్డా మీర్ శక సమాప్తి:

8-12-1979న 80 ఏళ్ళ వయసులో లి౦ఫటిక్ కేన్సర్ వ్యాధితో ఇజ్రాయిల్ తొలి, చివరి మహిళా ప్రధాని , ‘’యూదుల స్వరపేటిక’’,,’’ఐరన్ లేడీ ఆఫ్ ఇజ్రాయిల్ పాలిటిక్స్ ‘’ప్రపంచం లోనే మొట్టమొదటి మహిళా ప్రధాని గోల్డా మీర్ మరణించింది .ఈమె తర్వాత బ్రిటన్ కు మార్గరెట్ థాచర్ ,శ్రీలంకకు సిరిమావో బండారు నాయకే ,ఇండియాకు ఇందిరాగాంధీ ప్రధానులయ్యారు .వీరికి మార్గ దర్శకురాలు గోల్డా మీర్ .

1974లో అమెరికన్ మదర్స్ గోల్డా మీర్ కు ‘వరల్డ్ మదర్ ‘’అవార్డ్ ఇచ్చి సత్కరించారు .ప్రిన్స్టన్ యూనివర్సిటి 1974లో జేమ్స్ మాడిసన్ అవార్డ్ ఇచ్చి గౌరవించింది .1975లో ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆమె దేశానికి ,సమాజానికి చేసిన సేవలకు గాను అత్యుత్తమమైన ‘’ఇజ్రాయిల్ అవార్డ్ ‘’అందజేసి సన్మానించింది .ఆమె సేవలను ‘’ది బెస్ట్ మాన్ ఇన్ ది గవర్న్ మెంట్ ‘’అని గొప్పగా చెప్పుకొంటారు . ‘’గ్రాండ్ మదర్ ఆఫ్ ఇజ్రాయిల్ జ్యూయిష్ పీపుల్ ‘’అని గోల్డా మీర్ ను సంస్మరిస్తారు .ఇజ్రాయిల్ ప్రజల మనసులలో ఆమె చిరస్థాయిగా నిలిచి పోయింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.