గాంధీ పై ఇండియాలో ప్రజాభిప్రాయం బాగా అనుకూలం గానే ఉంది. 1911 ఏప్రిల్ లో బోతా ప్రభుత్వ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ జాన్ స్మట్స్ చివరికి గాంధీ సూత్రాలకు (ఫార్ములా ) ఉత్తరాలద్వారా సూత్రప్రాయంగా అంగీకరింఛగా ఇద్దరిమధ్యా తాత్కాలిక ఒప్పందం కూడా ఉత్తరాలద్వారానే కుదిరింది .28-4-1911న జోహాన్స్ బర్గ్ లో గాంధీ పబ్లిక్ మీటింగ్ లో తెలియ జేసి ,ప్రజామోదం పొందగా పోరాటానికి తెరపడింది .జూన్ 1న ఖైదీల నందర్నీ విడిచిపెట్టారు .ఒప్పందం కుదిరినట్లే ఉంది కాని వాతావరణం ఇంకా పూర్తి అనుకూలం గా లేదనిపించింది .ఇది అయిదవ జార్జి పట్టాభి షేకాన్ని ధృవీకరించటం లో ప్రతిబింబించింది . సామ్రాజ్యానికి విధేయత ప్రకటించినా ,పట్టాభి షేక మహోత్సవం లో పాల్గొనటానికి సుముఖంగా లేరు .
ఇలాంటి అసందిగ్ధ వాతావరణం లో భారత జాతీయ నాయకుడు ,గౌరవనీయుడు గోపాలకృష్ణ గోఖలే దక్షిణాఫ్రికా పర్యటనకు గాంధీజీ ఆహ్వానం పై వచ్చాడు .గాంధీతో అత్యంత చనువు గా ఉంటూ గాంధీని ,దక్షిణాఫ్రికా భారతీయులను ,అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా గమనించాడు .దక్షిణాఫ్రికాకు ఆయన బ్రిటిష్ ,ఇండియా ప్రభుత్వాల ఆశీస్సులతోనే వచ్చాడు .బ్రిటిష్ ప్రభుత్వం యూని యాన్ ప్రభుత్వానికి సామ్రాజ్యం లో గోఖలే హోదాను తెలియ జేసి అదే గౌరవమర్యాదలు కలుగ జేయమని కోరగా సౌతాఫ్రికా గవర్నమెంట్ ఏ లోపం రాకు౦డా అత్యంత గౌరవమర్యాదలతో చూసింది .ప్రముఖులందరితో ఆయన మాట్లాడి ,భారతీయులను ,యూనియన్ ప్రభుత్వాన్నీ మళ్ళీ చర్చలు జరిపెట్లు చేశాడు .ఒప్పందంలోని నటాల్ లోని ఇండియన్ లపై ఏడాదికి విధించిన 3పౌండ్ల టాక్స్ ను వెనక్కి తీసుకోవటానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలని అది తాను దక్షిణాఫ్రికాలో సాధించిన విజయం కావాలని నిర్ణయించాడు .తాను వెళ్ళేటప్పుడు ప్రభుత్వం తనమాట కాదనదనే విశ్వాసం తో ఉన్నాడు .కాని యూనియన్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు .అదేకాక కేప్ ప్రావిషియల్ సుప్రీం కోర్ట్’’ క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన వివాహాలే చట్టబద్ధమైనవని’’ తీర్పు ఇవ్వటం అగ్నిలో ఆజ్యమైంది .ఆ తీర్పు ప్రకారం దక్షిణాఫ్రికాలో ని హిందూ ముస్లిం ,పార్సీ భార్యలు ఉ౦పుడు గత్తెల లేక వ్యభిచారిణుల స్థాయికి దిగజార్చటం అన్నమాట అని గాంధీ అభిప్రాయపడ్డాడు .దీనితో భారతీయ మహిళలంతా సత్యాగ్రహినులుగా మారిపోయారు .అందులో కొందర్ని గాంధి తన దళ సభ్యులను చేశాడు .
ఏదో మసిపూసిమారేడుకాయ చేసే తాత్కాలిక ఒప్పందాలకంటే బహిరంగ పోరాటమే మంచిదని గాంధి భావించాడు .’’ఇండియన్ ఒపీనియన్ ‘’పత్రికలో ‘’ఒప్పందం,అసలైన స్పూర్తితో జరగనప్పుడు అది ఒప్పందమే కాదు ‘’అని రాశాడు .కనుక ప్రభుత్వ౦ ను దక్షిణాఫ్రికాలోని యూరోపియన్ జనాభాను కదిలించే పోరాటమే చేయాలని నిశ్చయించాడు .దీనికి మందు సామ్రాజ్యం లో అంతటా సహాయ నిరాకరణ ఉద్యమం చేబట్టాడు . సౌతాఫ్రికాలో కొందరు తెల్లవారు నల్లవారికి మద్దతుపలికారు .భారత జాతీయ నాయకులు దీటుగా స్పందించారు .ఊహించని పరిణామం వైస్ రాయ్ లార్డ్ హార్డింజ్ దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలను పబ్లిక్ గా ఘాటు మాటలతో విమర్శింఛి నిష్పక్షపాత విచారణకు ఆదేశించాడు విచారణ సంఘాన్ని నియమించటం తప్ప జెనరల్ స్మట్స్ కు గత్యంతరం లేకపోయి,గాంధీని ఆయన అనుచరులు కలలెన్ బాష్ ,పొలాక్ లను విడుదల చేశాడు .ఎంక్వైరికమిషన్ ఇండియన్ లకు స్థానం లేనందుకు గాంధీ వ్యతిరేకించాడు .దీనికోసం డర్బాన్ లో పెద్ద ప్రదర్శన 1914జనవరి 1 న నిర్వహిస్తానని ప్రకటించాడు .కాని దక్షిణాఫ్రికా రైల్వే లోని తెల్లజాతి ఉద్యోగులు అదే సమయం లో సమ్మె చేసే ప్రయత్నంలో ఉండగా ,ఘర్షణ పనికి రాదనీ గాంధీ ప్రదర్శన వాయిదా వేశాడు .దీనిప్రభావం ఇండియా,ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ల లోకూడా బాగా కనిపించింది .దక్షిణాఫ్రికాలోని నల్లవారిని వ్యతిరేకించే తెల్లవారు కూడా గాంధీ నిర్ణయాన్ని శ్లాఘించారు .
గోఖలే సి ఎఫ్ ఆండ్రూస్ ను దక్షిణాఫ్రికా కు పంపగా వచ్చి ,ఇరువైపులవారితో చర్చించి కలిపే ప్రయత్నం చేశాడు .గాంధీ ,స్మట్స్ మధ్య అనేక దఫాల చర్చలు జరిగాయి .చివరకు ఒక ఒప్పందం సాధించారు .దీని ప్రకారం ఇండియన్ రిలీఫ్ యాక్ట్ పాసయింది .3పౌండ్ల టాక్స్ రద్దయింది .హిందూ ,ముస్లిం పార్సీ వివాహాలు గుర్తింపబడ్డాయి . చట్టం అమలు న్యాయంగానిష్పక్షపాతంగా జరుగుతుందని ,హక్కులను కాపాడుతుందని జనరల్ స్మట్స్ ప్రజలకు హామీ ఇచ్చాడు .గాంధీ కూడా 1920నుంచి ఒప్పందం లేని కూలీలు దక్షిణాఫ్రికాలో ప్రవేశించరని ఒప్పుకున్నాడు .దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఇండియన్ల ,మళ్ళీ అక్కడికి చేరబోయే వలస భారతీయుల హక్కులను కాపాడటం అసాధ్యం అని గాంధీ భావించి ,అలా ప్రకటించి ఉంటాడు .ఈ ఒప్పందం సత్యాగ్రహానికి వాస్తవమైనదిగా కనిపించి చట్టబద్ధమైనదని పించింది .అంతే కాదు దక్షిణాఫ్రికాలోని భారతీయులకు చట్టబద్ధత కలిగిందికూడా .ఇంకా పూర్తిగా పౌరహక్కులు రాకపోయినా ,దక్షిణాఫ్రికా భారతీయులు సత్యాగ్రహం వలన ఉనికికి న్యాయ అనుమతి పొందగలిగి దక్షిణాఫ్రికా నుండి గెట్టి వెయ బడ జాలని బలమైన జాతివారుగా ,భాగస్వామ్యులుగా అయ్యారు .ఇది గాంధీ సాధించిన అపూర్వ విజయం దక్షిణాఫ్రికాలో .
మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –
సశేషం
గాంధీ జయంతి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-19-ఉయ్యూరు

