ప్రపంచ దేశాల సారస్వత౦
14-పారశీక సాహిత్యం 3
సెల్జూకులు –వీరికాలం లో సుప్రసిద్ధ సాహిత్యోపాసకుడు వజీర్ అబుల్ హసన్ అనే నిజాముల్ ముల్క్ .ఈయన పాలనా కళా వైభవాన్ని ‘’సత్ నామా ‘’గ్రంథం లో వివరించాడు .పారశీ సాహిత్యమంతా సూఫీ సిద్ధాంతం పైనే ఆధార పడి ఉంది .ఈ ఉద్యమ మొదటికవి అబూ సయీద్ ఖైర్ ‘’క్వాట్రైన్ ‘’అనే పద్య రూపాన్ని పునరుద్ధరించి ప్రచారం చేశాడు .ఖాజా అబ్దుల్లా అన్సారి క్వాట్రై న్ లకు ,మొనాజా కట్అనే ప్రార్ధనలకు ప్రసిద్ధి .సూఫీకవులలో సనాయీ ‘’మున్నవీ ‘’రూపాన్ని వాడిన మొదటివాడు ‘’హదీ కత్ -,ఉల్ –హకిక అనేది అతని ప్రముఖ మన్నవీ .
ఈకాలం లో సూఫీతో పాటు ఉమర్ ఖయ్యాం నాస్తిక సిద్ధాంతం కూడా బాగాప్రచారం పొందింది .ఈయన జ్యోతిష్యుడు ,గణకుడు ,తత్వవేత్త కూడా .ఇతని రుబాయీలు ప్రపంచమంతా వ్యాపించాయి .పారసీ సాహిత్యం లో గద్య రచన తక్కువే .ప్రాచీన గద్య రచనలలో’’ జిజీర –ఏ-ఖవా –రజం షాహి’’ముఖ్యమైంది .ఆల్ గజాలి అనే నీతి తత్వ వేత్త తో ఇస్లామిక్ సూఫీ తత్త్వం లో గొప్ప పరిణామం కలిగింది .ఎక్కువభాగం ఆరబీలో రాసినా అతని ప్రసిద్ధ ‘’ఎహ్యా ఉల్-ఉతాంఫిద్దీ౦ ‘’ను ‘’కిమియా పసాజత్ ‘’పేరుతొ పారసీలోనూ రాశాడు .అరూజి సమర్ ఖండి రాసిన ‘’చహార్ మకాలా ‘’అనే తత్వ గ్రంథం ఆయన ఈవిత చరిత్ర కూడా.
కథలనుంచి ప్రేయసీప్రియుల వృత్తాంతాలతో శృంగార కవిత్వం రచి౦ప బడింది .ఇలాంటి రచనకు నిజామీ ప్రసిద్ధుడు .’’ఖంస ‘’అనే ఇతని అయిదు మన్నవీలు (idylls)తర్వాతవారికి ప్రేరణకలిగించాయి .సూఫీ సంప్రదాయాన్ని సనాయీ తర్వాత ఫరీద్ ఉద్దీన్ అత్తార్ కొనసాగించాడు .ఇతని ప్రసిద్ధ రచన ‘’మంతిఖ్ –ఉత్ –తైర్’’.ముస్లిం సన్యాసుల వేదాంతుల జీవిత చరిత్రలను సేకరించి ‘’తజ్ కిరత్ అల్ ఔలియా ‘’అనే గద్య రచన రాశాడు .
మౌలానా ఎ రూమీ అనే పేరున్న జలాలుద్దీన్ సకల శాస్త్రవేత్త .జ్ఞానోదయం పొంది ,సాహిత్య జీవితం ప్రారంభించాడు .మంగోలు దండయాత్రలు జరుగుతున్నా రచనకు ఆటంకం కలగలేదు .ఇతని రచన ‘’మస్ నవీకి ‘’ఖురాన్ అంతటి ప్రసిద్ధి పొందింది .సాదీఅనే మహాకవి గద్యపద్య రచనలు చాలా చేశాడు .బోస్తాన్ ,గులిస్తాన్ అనే రచనలు అన్నిభాషలలోకి అనువాదం పొందాయి .
మంగోలులు కూడా శాస్త్ర ,చరిత్ర విలువలు గుర్తించారు .వారి రాకముందు నజీరుద్దీన్ తత్వవేత్త గొప్ప పేరు పొందాడు .ఇతని ప్రసిద్ధ రచన ‘’అఖ్ లాకె-ఎ-వాసిరి ‘’దేశీయ పారశీక భాషలో రాశాడు .దీనికంటే ఆ సాహిత్యం లో ఉత్తమ నీతి గ్రంథం లేదని ప్రతీతి.హలాగు కార్యదర్శి అతామలిక్ మంగోలుల చరిత్రను సమగ్రంగా రాశాడు .దీనికి తర్వాత కాలం లో ‘’తారీఖ్ ఎ-జహాన్ –గుషా ‘’అనే పేరువచ్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-20-ఉయ్యూరు

