ప్రపంచ దేశాల సాహిత్యం
15-బర్మీస్ సాహిత్యం
భాష –చీనో-టిబెట్ భాషాకుటుంబానికి చెందింది .పదాలు దాదాపు ఏకాక్షరాలే. స్వరాన్ని బట్టి ఒకే పదానికి వేర్వేరు అర్ధాలు వస్తాయి .దీనిలోని మాండలీకాలు –అరకానీజ్ ,దాను ,ఇంథా,అ త్సి,లాషి ,మారు మొదలైనవి .భారతీయ పాళీబాష బర్మీయులకు పరమ పవిత్రభాషకనుక లిపిగా దానినేఉపయొగిస్తారు.
సాహిత్యం –ప్రాచీన సాహిత్యం శిలాఫలకాలలో దొరుకుతుంది .ఇందులో మొదటి శాసనం మయిజెయి లేక మయిన్క బాకు క్రీశ .1113 నాటిది .ఈశాసనాలు వ్యక్తులకు అంకితమైనవి .భావనాత్మక బర్మా సాహిత్యం 15వ శతాబ్ది మధ్య నుండి కనబడుతుంది .అప్పటినుంచి 19వ శతాబ్దం వరకు బౌద్ధ చక్రవర్తుల పోషణలో వచ్చిందే .గ్రంథ కర్తలు కూడా బౌద్ధ సన్యాసులే.సుశిక్షితులైన ఆస్థాన పండితులతోపాటు మహిళలుకూడా రచనలు చేశారు .పద్యాలలో ఉన్న బౌద్ధ జాతక కథలు(ప్యో ),పద్య నీతి కథలు ,కొన్ని స్తుతి పద్యాలు (మాగన్ ).కొన్ని చారిత్రిక పదాలు ,-ఎగియిన్ ,కొన్ని ప్రకృతి ప్రేమ గేయాలు (యదు )కొన్ని టేదత్ ,దాన్-చో,లే-చో,ద్వే-చో,బా –లే అనేవి చిన్న గేయాలు మియాట్జన్జా అనే లేఖలు ,కొన్ని ఆస్థాన రూపకాలు ,కొన్ని ప్రాచీన రంగస్థల నాటకాలు (ప్యా-జన్).ఇందులో 50కి పైగా పద్యరచనలున్నాయి .వీటిలో బౌద్ధ ధర్మాసక్తి ,భాషా మాధుర్యం ఉంటాయి .
గద్య రచనకూడా కొంత జరిగింది .ఇవి ఎక్కువగా పాళీజాతక కథలు ,బర్మాపూర్వ చరిత్రాధారాలు (క్రానికల్స్ )కు అనువాదాలే .చిన్న చిన్న వాక్యాలతో ఇష్టం వచ్చినట్లు ఉన్న విరమణ చిహ్నాలతో ఉంటాయి ..1870లో బర్మాలో ముద్రణశాలలు ఏర్పాటవటంతో సాహిత్యం లో గొప్పమార్పులు వచ్చాయి .1875నుంచి ఫ్యాజన్ ,నవలలు ,కథానికలు విస్తృతంగా వచ్చాయి .1920లో రంగూన్ లో యూనివర్సిటి ఏర్పడిన దగ్గరనుంచి ,కొత్తతర రచయితలు వ్యాసాలు కథలు మొదలైన వివిధ ప్రక్రియలలో సాహిత్య సృజన చేశారు .అనుకరణ ,అనువాదాలవల్ల దేశీయ సాహిత్యం వృద్ధి చెందింది .1947లో బర్మా యూనియన్ ఏర్పడగా జాతీయ సంస్కృతిపై అభిమానం పెరిగింది .ఉత్తమ నవలలకు బర్మా ప్రభుత్వం బహుమానాలు అందించి ప్రోత్సహించింది .
బాగాన్ వంశ పాలనలో అనవ్రహ్త రాజు తేరవాద బౌద్ధాన్ని అవలంబించి రాజ్యమతంగా ప్రకటించి సిలోన్ నుంచి చాలా పాళీ గ్రంథాలు తెప్పించాడు,.ఇవి అనువాదం పొందినా పాళీ రాజ్యభాష గా ఉంది .వీటి అనువాదాలకు ‘’నిస్సాయ ‘’అనిపేరు .సియాం ను టౌంగూ వంశరాజులు ఆక్రమించాక ధాయ్లాండ్ బర్మా కాలనీ ఐపోయింది ,ధాయ్ సంస్కృతీ ,భాష చాలాభాగం బర్మీ లో చేరాయి .యదులేక యతుఅనే భావాత్మక యగాన్ సాహిత్యం వచ్చింది 13వ శతాబ్దికి ముందు ‘ధమ్మతత్’’,షౌక్ హ్టోనే అనే న్యాయ శాస్త్ర రచనలు వచ్చాయి .18వ శతాబ్దిలో ‘’కొనబంగ్ ‘’వంశసామ్రాజ్య స్థాపన జరిగాక ఆ యుగాన్నిసాహిత్యానికి స్వర్ణయుగం అన్నారు .లేట్వే తొందారా వంటిమహాకవులు సాహిత్య సృజన చేశారు .ధాయ్ పై రెండో దాడి జరిగాక అనేకా శిధిలాలు బర్మాకు చేరాయి .రామాయణం వచ్చి బర్మీస్ భాషలోకి అనువాదమై ,ఎందరో శృంగారకవులకు ప్రేరణ నిచ్చింది .రాజాస్థానాలలో నాటకాలు ఆడేవారు . 1829లో రాజు బగ్విదా మహా పండితులను నియమించి ‘’హిమాన్నం యజావిన్ డాగ్యి ‘’అంటే గ్లాస్ పాలస్ క్రానికల్ అనే బర్మా దేశ చరిత్రను 1821వరకు రచియి౦ప జేశాడు .తర్వాత రాజు మిండాన్ మిన్ 1867-1869కాలపు రెండవ క్రానికల్ తయారు చేయటానికి స్కాలర్స్ ను నియమించి రాయించాడు .1824-1948 బ్రిటిష్ కాలం లో 1910లో ఫర్నివల్లి బర్మీస్ రిసెర్చ్ సొసైటీ ఏర్పాటు చేసి బర్మా దేశపు సాహిత్య సంస్కృతుల వారసత్వాన్నికాపాడాడు .బర్మాలో ‘’హికిత్ సన్’’ అంటే పరీక్షా సమయం అనే ఉద్యమం వచ్చి రచనా శైలిలో మార్పు తెచ్చింది .సృజనాత్మక రచయితలలో మాంగ్ వా ,దియాన్ పే మింట్ లు ముఖ్యులు .మహిలారచయిత –డాగన్ ఖిన్ ఖిన్ లే కాలనీ ప్రభుత్వం లో రైతుల కస్టాలు కన్నీళ్లు బాధలను వర్ణించి రాసి జాతీయతా స్పూర్తికి మార్గదర్శి అయింది .బ్రిటిష్ రచయిత జార్జి ఆర్వెల్ బ్రిటిష్ కాలనీ ప్రభుత్వ దౌస్ట్యాలను ఖండిస్తూ వారికి అండగా ‘’బర్మీస్ డేస్’’పుస్తకం రాసి 1935లో ప్రచురి౦చాడు .ఈకాలం లో సాహిత్య సంస్కృతీ జనసామాన్యానికికూడా చేరింది .1920-30కాలం లో డాగన్,గండా లాకా (క్లాసిక్ ప్రపంచం )అనే మేగజైన్లు వచ్చాయి .
1948తర్వాత స్వాతంత్ర్యానంతరం పాశ్చాత్య భావ శైలి బర్మాలో బాగా ప్రవేశించింది .ప్రభుత్వం బర్మీస్ ట్రాన్స్ లేషన్ సొసైటీ ఏర్పాటు చేసి సైన్స్ టెక్నాలజీ తో సహా అనేక విదేశీ పుస్తకాలకు అనువాదం చేయించింది బాగాన్ ప్రెస్ మార్క్సీయ సాహిత్యాన్ని బర్మీస్ లోకి అనువాదం చేసి ప్రచురించింది .1976 బర్మీస్ మొదటి ‘’విజ్ఞానసర్వస్వం ‘’ప్రచురణ జరిగింది .సోషలిస్ట్ ప్రభుత్వం కూడా సాహిత్యానికి సహకరించింది .పర్యావరణ స్పృహతో రచనలు వచ్చాయి .1960 నెవిన్ ప్రభుత్వం లో సెన్సార్ షిప్ ఎక్కువై రచనల వేగం తగ్గింది .కాలనీ ప్రభుత్వం తర్వాత స్త్రీ రచయితలూ జర్నల్ క్యా మామా లే,ఖిన్ మియో చిట్ మొదలైనవారు ‘’దితర్టీన్ కారట్ డైమాండ్ ‘’వంటి నవల లు రాశారు .ఇది చాలాభాషలలో అనువాదం పొందింది .జర్నలిస్ట్ లుడు ఉ హ్లా ఎన్నో నవలలు ఎత్నిక్ మైనారిటి జీవితాలపై యు ను కాలపు జైలు జీవితాలపై .ఎందరో వ్యక్తుల జీవిత చరిత్రలు రాసింది .ప్రధానమంత్రి’’ ఉ ను’’ స్వయంగా గొప్ప రచయిత.అనేక రాజకీయ సాంఘిక నాటకాలు రాశాడు .’’ఓషన్ ట్రావెల్ ‘’,పెరల్ క్వీన్ ‘’వంటి బ్లాక్ బస్టర్ ,బర్మీస్ క్లాసిక్స్ అనబడే నవలలు రాసిన ధియన్ పే మింట్,వార్ అండ్ పీస్ వంటి నవలానువాదం చేసిన మ్యా ధాన్ టింట్.ధావ్డా స్వే,మియట్ హుత్సున్.క్యి ఆయే , ఖిన్ హ్యిన్ హ్యు మొదలైనవారు ఆధునిక బర్మీస్ సాహిత్యానికి వన్నెలూ చిన్నెలూ తెచ్చి తీర్చి దిద్దారు .
15మంది సమకాలీన బర్మీస్ కవులు పేరిట బోన్స్ విల్ క్రో2012లో పుస్తకం రాసి ప్రచురించాడు .
బర్మా దేశం పేరును 1989లో మిలిటరీ జుంటా పాలనలో మయన్మార్ గా మార్చారు .వీరికి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం శాంతియుత సత్యాగ్రహం ,పోరాటం చేసి ఎన్నో ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన ‘’ఆన్ సాన్ సుకి ‘’ అంతర్జాతీయ ఒత్తిడికి ప్రజా పోరాటానికి తలొగ్గి ప్రభుత్వం విడుదల చేస్తే 1990ఎన్నికలలో అపూర్వ మెజారిటీ తో గెలిచినా, హౌస్ అరెస్ట్ లో ఉంచింది మిలిటరీ జుంటా .1989 నుంచి 2010 నవంబర్ 13 వరకు 11ఏళ్ళు క్రూర కిరాత పాలనలో జైలులో మగ్గి విడుదలై ,మళ్ళీ తనరాజకీయ పగ్గాలు చేబట్టి దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నం అహరహం చేస్తోంది .ఆమె అవలంబించిన మహాత్మాగాంధీ శాంత్యహి౦సా మార్గానికి 2011లో నోబెల్ శాంతి పురస్కారం అందించారు .ఆ దేశంలో సాహిత్య నోబెల్ లారియట్స్ ఎవరూ లేరు .
రంగూన్ ను౦చి మనదేశం కలప దిగుమతి చేసుకొనేది రంగూన్ కలప నాణ్యమైనది గా ప్రసిద్ధి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-20-ఉయ్యూరు

