స్టే హోం జీరోలు కరోనా

స్టే హోం జీరోలు

దానయ్య –అమ్మా వాసంతి ఏమిటి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు  మావాడు బానే ఉన్నాడా .ఏడీ కనబడడెం

వాసంతి –మీ కోసం ఎదురు చూస్తూ గదిలో ఉన్నరన్నయ్యా ,ఏమిటి తల, మొఖానికి  తువ్వాలు చుట్టుకు వచ్చారు

దాన-అదా అదీ  అదీ-కంగారులో వస్తుంటే మాస్క్ దొరక్కపోతే పోలీసులు పట్టుకొంటారని అలా వచ్చానన్నమాట అదన్నమాట .అంతకంటే ఏమీ లేదన్నమాట .

వాస-సర్లెండి .లోపలి వెళ్ళండి .లోపల హాయిగా మాట్లాడుకోండి బయట గొళ్ళెం పెడతా ఎవరూ రాకుండా

దాన –లోపలికెళ్ళి –అరె మదన్ అనగానే మదన్ భళ్ళున కక్కుకున్నట్లు ఏడుపు లంకించుకొన్నాడు  అదేంట్రా నోటికి ఆప్లాస్టర్ ఏమిటి

మదన్ –దానికి లాక్ డౌన్ అంత కథ ఉందిరా అన్నాడు ప్లాస్టర్ తీసేసి .

దాన-అదేదో వదులు త్వరగా మళ్ళీ ఇంటికిపోవాలి మీ చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటుంది

మద-ఒరే అసెంబ్లీ లో మా వాళ్ళు అందర్నీ బండబూతులు తిడుతుంటే  నాకూ ఆమధ్య వీరావేశం వచ్చి అవన్నీ మా ఆవిడమీద ప్రయోగించా .ఆఫీసుకు వెళ్ళేవరకు బానే ఉండేది .లాక్ డౌన్ మొదలైన దగ్గర్నుంచి  నాపని నరకం చేసిందిరా .ఆఫీసుపనే కాక ఇంటి పనీ చేయిస్తోందిరా .ఏదైనా లోపం వస్తే పిచ్చబండ బూతులు తిడుతోంది .మొదట్లో నాకు అందులో డిగ్రీ ఉ౦ది కనుక నేనూ మొదలెట్ట బోయాను .అంతే చటుక్కు మూడు వరసలు ప్లాస్టర్ వేసి బెసగ కుండా క్రాస్ గా కూడా వేసి తీసుకోటానికి వీల్లేకుండా చేసి౦దిరా బాబాయ్.ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తే కుదరలేదు గదిలో సిసి కెమెరాలు పెట్టిందట క్షణం లో తెలిసి లోపలి వచ్చి నాపని భజగోవిందం చేస్తోందిరా.ఇంతకంటే ఘోరం చేసిందిరా .నోటికేకాదు కిందకూడా గట్టి ప్లాస్టర్ వేసి బంద్ చేసింది .ఆకంపు భరించలేక చచ్చిపోయాను .పిల్లలు చూసి భయపడి వాళ్ళ అమ్మమ్మగారింటికి పారిపోయారు వారం దాటాక నాకు మోక్షం కలిగించింది. కొంపంతా గౌలుకంపు రోజూ ఫినాయిల్ డెట్టాల్ తో కడిగి లైజాల్ చల్లి ఆ వాసన పోగొట్టటాని కి పది రోజులు పట్టింది .ఐతే ఫుడ్ ఎలర్జీ వస్తుందని నాతో ఆపది రోజులు వంట చేయించలేదు మిగిలిన ఆడవా చాకిరీ మామూలే  .

దాన-ఒరే మీ ఆవిడ పరమ సాధ్విలాగా ఉండేది .ఎప్పుడూ పూజలు పునస్కారాలు తీర్ధ ప్రసాదాలతో గడిపేది సడెన్ గా ఇంత వయోలేంట్ ఎలా అయిందిరా

మదన్ –పిల్లిని గదిలో  పెట్టి బంధించి బెదిరిస్తే  దానికీ పౌరుషం తన్నుకొచ్చి మీదపడి రక్కుతుంది అదే జరిగింది .బూతుమాట అసలే తెలియంది ఆన్ లైన్ బూతుపాఠాలు నేరుస్తూ ,కొత్తబూతుపుస్తకాలు తెప్పించిఅప్ డేట్ అవుతూ తిట్టిన తిట్టకుండా కొట్టిన చోట కొట్టకుండా కొట్టి పగ తీర్చుకొంటో౦ది .అసలుకారణం నామీదకాదు .మా నాయకుల బూతులమీద పగ అది నామీద చూపించింది అనుకొంటా.సరే ఇప్పటిదాకా నా వాయి౦పే కానీ  నీ నెత్తిన,ముఖానికీ ఆముసుగేమిట్రా

దాన –అమాంతం ముసుగు ఎత్తేసి బకెట్ కన్నీరు కార్చేసి రూమ్ అంతా వరదచేసి –నా బాధలు కూడా నీతో చెప్పుకోటానికే మా ఆవిడ వద్దనివారించినా మీ ఆవిడ ఫోన్ తో పరిగెత్తుకొచ్చా

మద-నెత్తిన కరోనా ముళ్ళు లాగా ఆ బొప్పులేమిట్రా చెంపలమీద ఆ కెంపు లేమిటి

దాన-అదో పెద్ద కాశీ మజిలీ  స్టోరీ . అన్నం సరిగ్గా ఉడక  లేదని ,పప్పులో ఉప్పు లేదని కూరలో కారం ఎక్కువైందని పచ్చట్లో పులుపు తగ్గిందని ,పులుసులో బెల్లం వెయ్యలేదని అప్పడాలకర్రతో కొట్టిన దెబ్బలు అవి  బహుశా నెత్తిన గాప్ ఉన్నట్లు లేదు . చెంప లంటావా బట్టల మురికి వదల్లేదని ,ఇల్లు సరిగ్గా ఊడవలేదని , అంట్లు క్లీన్గా తోమలేదని స్టవ్ సరిగ్గా మండటం లేదని టిఫిన్లు టైంకి చేయటం లేదని ఒక్కొక్కదానికి ఒక్కో చెంప దెబ్బ లేదా అట్లకాడ దెబ్బ .రెండు బుగ్గలూ బూరెల్లా   ఉబ్బి పోయాయిరా అన్నం తినటానికి లేదు నీళ్ళు మింగటానికి లేదు నాగతి అధోగతి అయిందిరా మామా

మద –ఏమోరా ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా మీ ఆవిడ చాలా ఆత్మీయంగా పలకరించి కాఫీ తాగే దాకా ఊరుకోనేదికాదు .ఇంతసడన్ గా ఈ మార్పేమిట్రా

దాన –ఆఫీస్ కు వెళ్ళే రోజుల్లో ప్రతిదానికీ విసుక్కోటం సణుక్కోవటం ,సూటీ పోటీ మాటలతో బాధించటం ,ఒక్కోసారి పిచ్చకోపంతో చెయ్యి చేసుకోవటం చేసేవాడిని .ఇప్పుడుతీరుబడిగా ఇంట్లో ఉండటం తో ఆ పగా ,ప్రతీకారం రెట్టింపు ఉత్సాహంతో తీర్చుకొంటో౦ది మామా .నాబతుకు బస్టాండ్ అయింది బాబాయ్ .వీపు మీద చూడలేదు ఇదుగో చూడు చొక్కా విప్పుతా’’అని చొక్కా విప్పి చూపించి బావురుమన్నాడు .అంగుళం ఖాళీలేకుండా వాతలే వాతలు . ఇక పెడతాన్రా .ఆలస్యం ఐతే డబుల్ పనిష్మెంట్ భరించాలి ‘’అంటూ మళ్ళీ తలకూ మోహానికీ తుండుగుడ్డ చుట్టుకొని బై చెప్పి గది బైటికి వచ్చాడు

వాసంతి –అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నయ్యా .కమ్మగా కబుర్లు చెప్పుకోన్నారా .మా వారు బాగా మాట్లాడారా మనసు విప్పి మాట్లాడాడా నీ ఫ్రెండ్

దాన –హృదయ భారాలు తీరేదాకా హాయిగా మాట్లాడుకొని ఆనందించాం అమ్మా అన్నాడు డగ్గుత్తికతో

వాస-అదేంటి అన్నయ్యా కళ్ళవెంట ఆనీటి చారలేమిటి గొంతులో ఆకంపనం ఏమిటి

దాన-అదంతేలే అమ్మా. అంతేగామరి .అంతే మరి అని వినిపించీ వినిపించకుండా అనుకొంటూ నిష్క్రమించాడు

వాసంతి –రోలోచ్చి మద్దెలకు మొరపెట్టుకుని  వెళ్ళిందన్నమాట . స్టే హోం జీరోల బాధలంటే ఇవేనేమోమరి  ఏమోమరి నాకేం తెలుసు పాపం .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.