సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18
ముందుకు దూకుదామను కొన్న సమయం లో హనుమకు మళ్ళీ దుఖం ఆవరించింది .దీని నివారణకు సీతారామనామ స్మరణమే సాధనం అని భావించి ‘’అమేయ పరాక్రమశాలురైన సోదరద్వయం ,అమిత సాధుశీల సీతాదేవి లకే ఇలాంటి దుఖం సంభవిస్తే’’ కాలాన్ని ఎవరూ అధిగమించటం సాధ్యం కాదు ‘’-అనిపిస్తోంది అనుకొన్నాడు .
‘’మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా –యది సీతాపి దుఖార్తా’’ దురతిక్రమః
వాల్మీకి మహర్షిహనుమతో చెప్పించిన ‘’కాలోహి దురతి క్రమః’’ అన్నఉడి మాట లోకం లో నానుడి అయింది ’
మళ్ళీ విచార ధార కొనసాగిస్తూ ‘’ స్వభావం ,వయసు ,నడవడి,వంశం,సాముద్రిక లక్షణాలు సీతా రాములకు సమానంగాఉన్నాయి.లక్ష్మీ దేవి గా ఉన్న సీతను స్మరిస్తూ ‘’ఈమె కోసమే రాముడు వాలి సంహారం చేసి ,రావణ సాటి పరాక్రమమున్న కబంధుని హతమార్చాడు .జనస్థానం లొ14వేలమంది భీకర రాక్షసులను అవలీలగా చంపేశాడు .ఖర ,దూషణ ,త్రిశిరస్క మహా తేజోవంత రాక్షసులను సంహరించాడు . దక్కదు అనుకొన్న వాలి సామ్రాజ్యం కిష్కింద సుగ్రీవుడికి అవలీలగా తమ్ముడు సుగ్రీవుడికి దక్కింది .సీత క్షేమం తెలుసుకోవటానికే నదీనదపతి మహా సముద్రాన్ని దాటి వచ్చి లంకలో ప్రవేశించాను .అలాంటి పతివ్రతామతల్లి సీతా దేవి కోసం రాముడు ధరిత్రిని అంతా తలక్రిందు చేసినా తప్పు లేదు .ముల్లోకాదిపత్యమా ,లేక జానకీ దేవి సీత యా ఎవరు గొప్ప అని ప్రశ్నవస్తే ,సీతతో పదహారవ వంతు అయినా ముల్లోకాదిపత్యం సరిరాదు అనిపిస్తోంది ఇది నిశ్చయం .-
‘’రాజ్యం వా త్రిషు లోకేషు ,సీతావా జనకాత్మజా –త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్కలాం ‘’.ఈ శ్లోకమూ లోకంలో గొప్ప ఉదాహరణగా వాడుకలో ఉన్నది.
శ్రేష్ట రాజు దశరధుని పెద్దకోడలు ,ధర్మజ్ఞుడు,కృతజ్ఞుడు,పరమాత్మ విదుడు ఐన శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి ఇక్కడ లంకలో రాక్షసులమధ్య దీనయై ,దుఖంతో కుమిలిపోతోంది .అల్లారు ముద్దుగా జనకుని ఇంటపెరిగి ,రామవివాహంతో అయోధ్య మెట్టినింటికి వచ్చి అసూర్యం పశ్య గా ఉన్న మహాతల్లి ,భర్త తనతండ్రికిచ్చిన మాట నిలబెట్టటానికి తానూ వనవాసానికి వెన్నంటి వచ్చి కస్టాలు పడిపడి ,అడవిలోకూడా భర్త సేవలో రాజభవనం లో ఉన్న ఆన౦దాన్నే పొందుతూ ,రావణ దుష్టపన్నాగం తో ఇక్కడికి వచ్చి బందీ అయింది .ఇక్కడ కూడా ఆమెకు రామధ్యానం తప్ప మరో ఆలోచన, చూపు లేదు .రామసమాగమనం కోసం ప్రాణాలతో ఉంది .అక్కడ రాముడు కూడా ఈమెకోసం పరితపిస్తూ వెదుకుతూ అనంత దుఖం లో ఉన్నాడు సీత మంచు దెబ్బతో సొంపుపు చెడిన తీగలాగా ,సహచరుడు లేని ఆడ చక్రవాకం లాగా కాంతి హీనంగా ఉన్నది .అనేక పుష్పాలభారంతో వంగి శోకాన్ని పోగొట్టే అశోకాలు కూడా ఈమెకు శోకాన్నే కలిగిస్తున్నాయి .
‘’హిమ వ్యపాయేన చ మందరశ్మి-రాభ్యుత్తితో నిక సహస్ర రశ్మిః-ఇత్యేవ అ మర్ధంకపి రన్వవేక్ష్య-సీతేవ మిత్యేవ నివిస్ట బుద్ధిః-సంశ్రిత్య తస్మి న్నిషసాద వృక్షే –బలీ హరీణా వృషభ స్తరస్వీ ‘’
వసంత చంద్రుడూ శోకాన్నే కలిగిస్తున్నాడు‘’అనిఅనేక విధాలుగా ఆలోచించాడు.దెబ్బలు తగిలిన వారికే మళ్ళీ మళ్ళీ దెబ్బలు తగలటం సహజం .మూలిగే నక్కపై తాటిపండు పడటం లోకరీతి .లేకపోతె శోకాన్ని దూరం చేయాల్సిన అశోకం శోకం పెంచటం ఏమిటి ?చల్లని వెలుగులతో మానసికానందాన్నివ్వాల్సిన చంద్రుడు కూడా దయమాలి శోక౦ కలిగించటం ఏమిటి ? ‘’ఇలా ఆలోచిస్తూ చివరికి ఆమె సీతాదేవి అనే నిశ్చయానికి వచ్చి బలిస్టుడు,వానర శ్రేష్టుడు,,మహాహరి హనుమ , శింశుపా వృక్షం మీద కూర్చుని ఏం జరుగుతుందో చూస్తున్నాడు .
ఇది32 శ్లోకాల 16వ సర్గ
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-20-ఉయ్యూరు

