సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

దుఃఖ భారం తో ఉన్న సీతాదేవి ఎడమకన్ను చేప చేత కొట్టబడిన కమలం,ఎడమ భుజం   ఎడమ తొడకూడా బాగా  అదిరి రాముడు ఆమె ముందే ఉన్నాడు అని సూచించాయి . –

‘’తస్యాశ్శుభం వామ మరాళ పక్ష్మ-రాజీవృతం ,కృష్ణ విశాల శుక్లం –ప్రాస్పంద తైకం నయనం సు కేశ్యా-మీనాహతం పద్మమి వాభి తామ్రం’’

‘’భుజశ్చచార్వంచిత పీన వృత్తః-పరార్ధ్య కాలాగరు చందనార్హః –అనుత్తమే నాధ్యుషితః ప్రియేణ-చిరేణ వామ స్సమవేపతా శు ‘’

గజేంద్ర హస్త ప్రతిమశ్చ పీన –స్తయోర్ద్వాయో స్సంహతయా స్సుజాతః-ప్రస్పంద మానః పునరూరు రస్యా –రామం పురస్తాత్ స్థిత మాచ  చక్ష్యే’’

  ఆమె చీర కొంచెం జారింది .’’అన్నీ మంచి శకునములే శ్రీ రామదర్శన  లాభ శూచనలే ‘’అని పించింది మనసుకు .వేసవి ప్రతాపానికి వాడిన చిన్న మొలక తొలకరి వర్షం తో తెప్పరిల్లి ఆకులు తొడిగినట్లు ఉన్నది .ఆకులు అంటే ఆమె ఆశలు మారాకులు తొడిగాయి అన్నమాట .ఆమె ముఖం రాహువు చే కబళింప బడిన చంద్రుడు మళ్ళీ బయటికి వచ్చినంత ప్రకాశ మానం గా ఉన్నది .శుభ సూచనలతో మనసు తెప్పరిల్లి ఆశలమోసులు తొడిగి  ఆనంద పారవశ్యం తో చంద్రోదయం తో శోభిల్లిన శుక్లపక్ష రాత్రిలా కనబడింది .

  ఇది ఎనిమిదే శ్లోకాలున్న 29 వ సర్గ .

  చెట్టుపై ఆకులమాటున ఎవరికీ కనిపించకుండా ఉన్న హనుమ ,ఇప్పటి దాకా జరిగిన సర్వ విషయాలు ప్రత్యక్షం గా చూసి ,సీతా శోకానికి కలత చెంది ,రహస్యం గా తాను లంకలో చూసిన విషయాలు, రావణ దర్పం అన్నీ గుర్తు చేసుకొని ,సీతా దేవి దుఖం మా౦చకుండా కిష్కింధకు  వెళ్ళ రాదు అనుకొన్నాడు  .సీతా దర్శన శుభవార్త రామ చంద్రునికి నివేదించి ఆయన దుఖం పోగొట్టాలి అని నిశ్చయించాడు .ఆ రాత్రి ఆమెను ఊరడి౦చకపోతే మర్నాడు ఉదయానికి ఆమె బతికి ఉంటుందో లేదో అని సందేహించాడు .సీతా సందేశం ఏమిటి అని రాముడు అడిగితె నా దగ్గర సమాధానం ఉండదు కదా .ఆమెను చూసి,చెప్పిన మాటలు విని ఆయనకు చెప్పకపోతే ఒక్క చూపుతో నన్ను కాల్చి మసి చేస్తాడు .సీతను వోదార్చకుండా ,కిష్కింధకు వెళ్లి సుగ్రీవుడిని  స సైన్యంగా ఇక్కడికి తెస్తే ప్రయోజనం లేదు ,కనుక ఇక్కడే ఉండి,రాక్షసులు చాటు అయినప్పుడు ఆమెతో మాట్లాడి ఓదారుస్తాను ‘’అని ఒక నిర్ణయానికి వచ్చాడు హనుమ .

   ఇంతవరకు బానే ఉంది మరి ఆమెతో మాట్లాడటం ఎలా అనే సందేహం వచ్చింది .తాను  అతి చిన్న కోతిగా ఉన్నాడు .మానవులు మాట్లాడే సుసంస్కృత భాషలో మాట్లాడాలి .అలాకాక బ్రాహ్మణ భాష లో మాట్లాడితే నన్ను రావణుడు అని సందేహింఛి భయపడవచ్చు .ఒక వేళ నేను అలామాట్లాడినా కోతి  ఏమిటి సంస్కృతం ఏమిటి అని కూడా అనుకోవచ్చు .కనుక ఇవన్నీ కుదరదు మానవ భాషలో అర్ధవంతం గా మాట్లాడితే ఇబ్బంది ఉండదు .కాక సంస్కృతం లో మాటాడితే ,నా రూపం భాష లకు మరింత భయపడి ,మారు వేషం లో ఉన్న రావణుడు అనుకొని భయంతో గట్టిగా అరవ వచ్చు అప్పుడు కావలి రాక్షస స్త్రీలు పరిగెత్తుకొచ్చి పెద్దచెట్ల మొదళ్ళతో నన్ను పచ్చడి చేయచ్చు .అప్రయత్నాలు తప్పించుకోవటానికి నేను అటూ ఇటూ పరిగెత్తితే ,వాళ్లకు అనుమానం మరీ ఎక్కువై ,నా వెంటపడి తరిమి ,నా వికృత రూపం చూసి మరింత భయం తో రావణ గృహ కావలి వారిని పిలిపిస్తే వాళ్ళంతా వివిధ ఆయుధాలతో నాపైకి దాడికి వస్తే ,నేను వాళ్ళను ఎదిరించగలనుకాని అలసి పోయి  సముద్ర లంఘనం తో అవతలి ఒడ్డుకు చేరలేనేమో .అప్పుడు నాకంటే వేగంగా నాపై దూకి నన్ను పట్టుకొని హింసి౦చి బంధిస్తే అసలు నేను వచ్చిన పని హుళక్కి అవుతుంది .నామీద కోపం సీత మీద చూపించి ఆమెను చంపేస్తారుకూడా .మా రాజు ,రాముడు నాకు అప్పగించిన పని భ్రస్ట  మైపోతుంది .నన్ను ఇక్కడ చంపేస్తే రాముడికి సీత విషయం చెప్పే వారెవరూ ఉండరు .నేను చనిపోతే నూరు యోజనాల సముద్రాన్ని దాటి రాముడి దగ్గరకు చేరేవాడు లేనేలేడు .అనుమానం వచ్చిన చోట అనాలోచితం గా ఏపనీ చేయరాదు .యజమాని ఏది కర్తవ్యమో ఏది కాదో మంత్రులతో ఆలోచించి దూతను పంపితే వాడు తామే వాళ్ళకంటే తెలివి గలవారమని భావించి ఆ దూత  కృత్యాన్ని చెడ గొట్టే బుద్ధి హీనులు ఉంటారు .కనుక స్వామికార్యం స్వకార్యం సఫలం అవ్వాలి .అందుకే శ్రీరాముని కీర్తిస్తూ ,ఆయనపైనే మనసు పెట్టుకొని ఉన్న సీత భయపడకుండా చేస్తా .ఇది ఉభయ తారకం .అని నిశ్చయించి ,ఇక ఆలస్యం చేయరాదని భావించి –

‘’ఇక్ష్వాకూణా౦ వరిష్ఠస్య రామస్య విదితాత్మనః –శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్

‘’’’శ్రావ ఇష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరిం –శ్రద్ధాస్యతి యథా హీయం తథా సర్వ౦  సమాదధే

‘’ఇతి స బహువిధం మహాను భావో –జగతి పాతేః ప్రమదా మవేక్ష్య మాణః-మధుర మవితథం జగాద వాక్యం –ద్రుమ విటపాంతరమాస్థితో హనూమాన్ ‘’

ఇది 44శోకాల 30 వ సర్గ

‘’రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ –పుణ్య శీలో మహాకీర్తి ర్రుజు రాసీ న్మహాయశాః’’

రాజర్షీణా౦ గుణ శ్రేష్ట స్తపసా చర్షిభిస్సమః –చక్రవర్తి కులే జాతః పురందర సమో బలే ‘

‘’అహింసా రతి రక్షుద్రో  ఘ్రుణీ సత్య పరాక్రమః –ముఖ్యే శ్చేక్ష్వాకువంశస్య లక్ష్మీ వాన్ లక్ష్మి వర్ధనః

‘’పార్ధివ వ్యంజనైర్యుక్తం పృథుశ్రీః పార్ధి వర్షభః –పృధివ్యాం చతురంతాయాం విశ్రుత స్సుఖద స్సుఖీ- ‘’తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ స్సర్వ ధను ష్మతాం –

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా -రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః

‘’తస్య సత్యాభి సంధస్య వృద్ధస్య వచనా  త్పితుః-సభార్యస్య హ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనం ‘’

అని మొదలుపెట్టి ఏకబిగిన 13శ్లోకాలు చెప్పేశాడు .

’’రాజా దశరథో నామ ‘’మొదలైనవి మరి రెండుమూడు చోట్ల హనుమ పలుకుతాడు ‘

ఈ శ్లోకాలలో ఇక్ష్వాకు వంశం లో మహా బలపరాక్రమ సంపన్నుడైన దశరథ మహారాజు అయోధ్యా పాలకుడు,అహింసా ఉదాత్తత దయ పరాక్రమం కలవాడు .సుఖాలు అనుభవిస్తూ సుఖాలు కలిగిస్తాడు .ఆయనపెద్ద కొడుకు రాముడు సర్వ విద్యాపార౦గ తుడు జనహితుడు .సత్యప్రతిజ్ఞ తో వృద్ధుడైన తండ్రి మాట విని భార్య సీత తమ్ముడు  లక్ష్మణుడి తో అరణ్యాలకు

వెళ్ళాడు .అక్కడ మునులకోరికపై ఎందరో రాక్షసులను సంహరించి మునుల తపస్సుకు ఇబ్బంది కలుగకుండా చేశాడు .జనస్థానం లో ఖరదూషణాదిరాక్షసులను చంపగా ,రావణుడికికోపం వచ్చి ,మాయామృగ రూపం తో మారీచుని పంపి ,రాముడిని మోసపుచ్చి సీతాపహరణం చేయగా ,రాముడు ఆమె కోసం వెదుకుతూ సుగ్రీవ వానరరాజు మైత్రి పొంది ,అతని అన్న వాలిని చంపి ఆరాజ్యం సుగ్రీవుడికి అప్పగించగా ,సుగ్రీవాజ్ఞ చేత వేలాది  వానరులు అన్నిదిక్కులా సీతకోసం పంపబడ్డారు .సంపాతి చెప్పిన మాటలు విని నేను శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి ,నాకు చెప్పిన లక్షణాలను బట్టి సీతా దేవిని చూసి గుర్తించాను ‘’అని ఏకబిగిని అప్పటిదాకా జరిగిన సీతా రామ   వృత్తాంతం ఏకరువు పెట్టి ఊరుకున్నాడు .

  ఆ కమ్మని మధురవాక్కులు విన్న సీత ఆశ్చర్యపడి ,ఒకసారి మొహం పైకెత్తి శింశుప చెట్టు కొమ్మలవైపు చూసి ,ఆన౦దించింది .క్రూర రాక్షసులకు కనపడకుండా ఇక్కడికి రాగలిగినందుకు అతని బుద్ధిని మెచ్చింది .పైకి ,కిందికి అన్ని దిక్కులూ చూసి మహా బుద్ధిమాన్ అనుకోని స్వతంత్రం లేని దూత ,స్వజాతి రాజు సుగ్రీవుని మంత్రి హనుమ ఉదయిస్తున్న సూర్యుడి లాగా ఆమెకు కనిపించాడు –

‘’సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తా –న్నిరీక్ష మాణా తమ చింత్య బుద్ధిం –దదర్శ పింగాదిపతే రమాత్యం –వాతాత్మజం సూర్య మివోదయస్థం’’

ఇది 19 సర్గల 31వ సర్గ

అమ్మయ్య 30సర్గల కాలం దాటి 31వ సర్గ లో హనుమ నిశ్చయ బుద్ధితో సీతా మాతదర్శనం చేసి ధన్యుడయ్యాడు .అసలు’’ హనుమ మార్గశిర శుద్ధ త్రయోదశి ‘’నాడు  సీతా అమ్మవారిని చూశాడు .ఇవాళ వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమ జ్జయంతి పర్వదినం నాడు హాయిగా సీతా దర్శనం చేయించాను అదొక సంతృప్తి .

  ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలని వితర్కి౦చు కొని హనుమ హరినామ స్మరణ అనే  శ్రీరామ చరిత్రను తెలియ జేసి ,తన బుద్ధిని చాటి ఆమె మనసుకూ బుద్ధి మంతుడు అనే మార్కులు మొదటి సారే కొట్టేశాడు .అదీ  ఆయన వ్యక్తిత్వం .ఇలా మాట్లాడకుండా ఇంకో రకంగా మాట్లాడితే రసాభాస అయ్యేది .కార్యసాధకుడికి ఉండాల్సిన సర్వ లక్షణాలు హనుమలో మనం దర్శిస్తాం .

  సశేషం

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-20-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.