సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-37
చూడామణి ప్రదానం చేశాక హనుమతో సీత ‘’ఈ అభిజ్ఞానంరాముడికి బాగా తెలుసు ,దీన్ని చూసి ఆయన మా తల్లిని ,నన్ను మామమగారిని స్మరిస్తాడు .నువ్వు వెళ్లి రాముడిని తొందరపెట్టి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చెయ్యి .నీ ప్రయత్నం సఫలమై నా దుఖం తీరాలి. దీనికి నువ్వే సమర్దుడివి .‘’అనగానే అలాగే అని చెప్పి హనుమ ఆమెకు నమస్కరించి బయల్దేర బోయాడు .అతడు వెళ్ళటం చూసి సీత కన్నీరు కారుస్తూ ‘’, రామ సోదరుల,సుగ్రీవాదుల క్షేమ౦ అడిగానని చెప్పు .నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి దాటించే,నన్ను బ్రతికించే ఉపాయం రాముడికినీ వాచిక ధర్మం తో చెప్పు .నువ్వు రోజూ ఆయనకు ఉత్సాహం కలిగిస్తూ నన్ను చేరే పౌరుషం పెంచుకోవటానికి ప్రయత్నించు .నీమాటలు విన్న తక్షణం ఆయన పరాక్రమ౦ ప్రదర్శిస్తాడు ‘’అని చెప్పింది .శిరస్సంజలి మాదాయ గా హనుమ ‘’అమ్మా !రామదండు త్వరలోనే వస్తుంది .శత్రు నాశనం చేసి రాముడు నీ దుఖం నివారిస్తాడు నమ్ము .రాముడు సాగర పర్యంత భూమిని పాలించటానికి ఉత్సాహంగా ఉన్నాడు .నీకోసం లంకను జయిస్తాడు ‘’అన్నాడు.
‘’నహి సాగర పర్యంతాం మహీం శాసితు మీహతే -త్వన్నిమిత్తో హి రామస్య జయో జనక నందిని ‘’
హనుమ వెళ్లి పోతుంటే మాటిమాటికీ అతన్ని చూస్తూ గౌరవిస్తూ భర్తను స్మరిస్తూ మళ్ళీ ‘’నీకు ఇష్టమైతే ఎక్కడో అక్కడ దాక్కుని విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళు .ఇంకొక్క రోజు ఇక్కడ నువ్వు ఉంటె నా మహా దుఖం కొంచెమైనా తగ్గుతుంది. కాదని నువ్వు వెడితే నా ప్రాణాలు నిలవటం కూడా అనుమానమే .నువ్వు కనబడకపోతే కలిగే దుఖం ఇప్పటి దాకా అనుభవించిన దుఖం కంటే ఎక్కువౌతుంది .నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక నాకొక సందేహం కలిగింది దాన్ని తీర్చి వెళ్ళు .కోతులు ఎలుగులు మనుషులు మహా సముద్రాన్ని యెట్లా దాటగలరు .సముద్రం దాటటానికి నువ్వు నీ తండ్రి వాయువు ,గరుత్మంతుడు మాత్రమె సమర్ధులు .ఇంతటి కష్టమైన విషయాన్నిఎలా సాధ్యం చేయాలని ఆలోచి౦చావోచెప్పు కార్య సాధక ఉపాయజ్ఞులలో నువ్వు గొప్పవాడివి .అయినా సకల శత్రు నాశనానికి నీవు ఒక్కడివే సమర్దుడవు అని నాకు తెలుసు .కాని దీనివలన కీర్తి నీకు వస్తుంది కాని నాకు కాదు .రాముడే వచ్చి శత్రునాశనం చేస్తే నాకు కీర్తి కలుగు తుంది ‘’అన్నది .
ఇదివరకు రాని సందేహాలపుట్ట దులిపిన సీతాదేవియుక్తికి సంతోషిస్తూ హనుమ ‘’వానర భల్లూక సేనలకు రాజు సుగ్రీవుడు .నీ కార్యం సాధించటానికి వేలాది కోట్ల సైన్యంతో సర్వ సిద్ధంగా ఉన్నాడు .ఆ సైన్యం లో పరాక్రమ ధైర్య మహా బల సంపన్నులు మనో వేగులు ఉన్నారు .వారంతా పైకి కిందికి అడ్డం నిలువు గా అడ్డు లేకుండా సంచరించగల సర్వ సమర్ధులు .ఆవానరులు ఇప్పటికే చాలాసార్లు వాయుమార్గాన సంచరిస్తూ పర్వత సముద్రాలతో ఉన్న భూమిని ప్రదక్షిణం చేసి వచ్చిన వాళ్ళు .నా కంటే అధికులు ,నాతో సమానులు అయిన వానరులు ఎందరో సుగ్రీవ సైన్యంలో ఉన్నారు .నా కంటే బలహేనుడుఒక్కడు కూడా లేడు.నేనే సముద్రం దాటి వస్తే, వారి విషయం లో అనుమానం ఎందుకు .వాళ్ళంతా ఒక్కగంతులో ఇక్కడికి వస్తారు నమ్ము .దుఖం మాని సుఖంగాఉండు ఉదయ సూర్య చంద్రులులాగా రామ సోదరులను నా వీపు మీద కూర్చో పెట్టుకొని నీ దగ్గరకు తెస్తాను .తర్వాత రామ సోదరులు తమ అవక్ర పరాక్రమంతో లంకాదహనం చేస్తారు ‘’అని అనునయిస్తూ దుఖం మాన్పి ప్రయాణానికి బయల్దేరి మళ్ళీ ‘’అమ్మా !త్వరలో రామాదులు లంకాద్వారం సమీపిస్తారు .రామ లక్ష్మణుల కంటే వీరుడెవడున్నాడు.ఈ లంకలో ఎక్కువ కాలం ఉండవు నువ్వు .నీ పతి వస్తాడు త్వరలో .నేను వెళ్లి ఆయన్ను కలిసి నీమాట చెప్పేదాకా ఈ క్లేశాన్ని సహించు ‘’అన్నాడు .-
‘’రామా ద్విశిస్టఃకో న్యో స్తి కశ్చిత్సౌమిత్రిణా సమః –అగ్ని మారుత కల్పౌతౌ భ్రాతరౌ తవ సంశ్రయా ‘’
‘’నతేచిరా దాగమనం ప్రియస్య –క్షమస్వ మత్సం గమ కాల మాత్రం ‘’
ఇది 53శ్లోకాల 39వ సర్గ .
కార్య సాధనలో అనేక సందేహాలు రావటం సహజం .అంతాఅయి బయల్దేరి వెళ్ళబోతున్న హనుమను ఆపి మరో రోజు ఉండిపోమ్మనటం మనం అతిధులను ఇలాగే రేపు వెళ్ళచ్చు అని వాయిదా వేయించటం లాంటిదే .అతడు ఉంటె మరింత దుఃఖ ఉపశమనం తనకు .కాదని వెడితే అప్పటిదాకా అనుభవించిన దానికంటే అధిక దుఖం కలుగుతుంది .గృహస్తులు గా మనం చెప్పే మాటలూ ఇవే కాదా ?
అలాగే అసలైన మరో గొప్ప సందేహం –కోతులు ఎలుగులు మనుషులు అసలు సముద్రం ఎలా దాటి రాగలరు ?ఇది తప్పక తీర్చాల్సిన సందేహమే .దీనికి హనుమ సంతోషించి తన బుద్ధి విశేషం తో చాలా సంతృప్తి కరమైన సమాధానం చెప్పాడు –తనతో సమానులు తనకంటే ఎక్కువ పరాక్రమం ఉన్నవారు సుగ్రీవ సైన్యం లో ఉన్నారని చెప్పాడు .అంతవరకూ బానే ఉంది నమ్మచ్చు .కాని వాళ్ళు ఎప్పుడైనా చెట్లూ కొండలూ దాటి బయటికి వెళ్ళారా అనే ప్రశ్న వేస్తుందని ముందే గ్రహించి మతిమాన్ హనుమాన్ –వారంతా చాలా సార్లు భూ
ప్రదక్షిణచేసిన ధీర వీర,సమర్ధ పరాక్రమ శాలురు అని చెప్పి ఆ సందేహానికి లాక్ పెట్టేశాడు .ఇక్కడే ఆయన బహు ముఖీన వ్యక్తిత్వ ప్రతిభ జ్యోతకమౌతోంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-5-20-ఉయ్యూరు

