’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11
గొడుగు పాలుడి సాహస గాథ
గొడుగు పాలుడి గురించి మొదటి ఎపిసోడ్ లోనే సంక్షిప్తంగా రాశాను ఇప్పుడు పూర్తిగా తెలుసుకొందాం .గొడుగు ఎప్పుడూ పట్టుకొనే వాడు కనుక ఆపేరు. అసలు పేరు ఎవరికీ తెలీదు .కృష్ణ దేవరాయల వద్ద రాజ లా౦ఛన మైన శ్వేత చ్చత్రం పట్టే బంటు .రాజుకు అంగరక్షకులు,గొడుగుపట్టేవారు ,చామరం వీచేవారు తాంబూల-అడపం భరిణ పట్టుకొనే వారు ‘(కరండ)ఎప్పుడూ ప్రక్కన ఉండేవారు . అడపా వంశం వాళ్ళే అడపా వారయ్యారు .ప్రముఖ అడపా రామకృష్ణా రావు గారిది ఆ వంశమే .
రాజుకు ఆ౦తరింగుకులు చాలామంది ఉండేవారు వారిలో గొడుగు పాలుడు ఒకడు ., రాయలు గుర్రం మీదస్వారీ చేస్తుంటే ,వెంట మనిషి మోసేంత బరువున్న తెల్లగొడుగు పట్టుకొని గుర్రం వెంట నడవటం ,అవసరమైతే పరిగెత్తటం గొడుగుపాలుడి ముఖ్యమైన పని .రాయలకు నీడ వంటివాడు .
రాయలవేసవి విడిది అనంతపురం జిల్లా పెనుగొండ .హంపీ విజయనగరం నుంచి 120 మైళ్ళు .కానీ షార్ట్ కట్ గా హంపీనుంచి ఒక సొరంగమార్గం గుండా వెడితే సుమారు 80మైళ్ళు.ఆ మార్గం ఇప్పటి గజశాల వరకు ఉండేది .తర్వాత పూడిపోయింది .రాయలు ప్రతి త్రయోదశినాడు ప్రదోషకాలం లో విరూపాక్షస్వామిని దర్శించే వాడు .అప్పటికి ఇంకా ఎనిమిది గడియల పొద్దు అంటే దాదాపు మూడుం బావు గంటలు ఉంది .హంపీ వైపు తిరిగి రాయలు ఆలోచిస్తున్నాడు .రాయల మనస్తత్వం బాగా ఆకళింపు చేసుకొన్న గొడుగుపాలుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు .రాయలు వెనక్కి తిరిగి అతడి వైపు ప్రశ్నార్ధకం గా చూశాడు .సిద్ధంగా ఉన్నాను అన్నట్లు వెంటనే గొడుగు పైకెత్తాడు .మాటా,పలుకూ లేకుండా హంపీ ప్రయాణం క్షణాలలో నిర్ణయమైంది .పంచకల్యాణి గుర్రం జీను కదిలిస్తూ, దౌడుకు సిద్ధంగా ఉంది .రాయలను చూసి సంతోషం తో సకిలించింది .
ఇంకా ఏడుగడియలె ఉంది .ప్రదోషసమయానికి విరూపాక్ష సన్నిధిలో ఉండాలి రాయలు .రాయలు గుర్రమెక్కి ,ఒక్క సారి కళ్ళెం లాగటం ఆలస్యం ,వాయు వేగ మనో వేగాలతో పరిగెత్తింది .గంటకు 30మైళ్ళ వేగంతో రాజలా౦ఛనమైన శ్వేత చ్ఛత్రం కూడా వెంట ఉండాలి కదా .గొడుగు మీద ఉన్న రాయలకు సాయంకాలపు ఎండ తగలకుండా గొడుగుపాలుడు గొడుగుపట్టుకొని అదే వేగంతో పరిగెత్తుతున్నాడు .రాయల మనసెరిగిన గుర్రం ప్రదోష సమయానికి హంపీ చేర్చకపోతే తన పరువేం కావాలని ,వేగం విజ్రు౦ భించ గా గొడుగుపాలుడూ దానితో పందెం కాసినట్లు పరుగు తీస్తున్నాడు .గుర్రం కంటే రెండడుగులు ముందే ఉంటున్నాడు .
హంపీ సమీపించి విరూపాక్షాలయం కనిపిస్తోంది .దేవాలయం గంటలు మోగుతున్నాయ్ .హేమకూట౦ దగ్గరకొచ్చేసరికి గుర్రం దమ్ము అయిపోయి ,ఇక నిలవలేకపోతే ,రాయలు అమాంతం గుర్రం మీదనుంచి కిందికి దూకి ,హేమకూట౦ ప్రక్కనుంచి ,దేవాలయం వైపు నడిచాడు .గొడుగుపాలుడు గుర్రాన్ని భటులకు అప్పగించాడు .అది ఎన్నో సార్లు పొర్లి అలసట తీర్చుకొన్నది .గొడుగుపాలుడు చత్రంతో దేవాలయ ప్రవేశం చేశాడు .చెమట ఏళ్ళయి కారుతున్నా గొడుగు పట్టు వదలలేదు .రాయలు కూడా అలసిపోయాడు .విరూపాక్ష స్వామి దర్శనం చేసుకొని ,గొడుగుపాలుడికి సెలవిచ్చాడు. మర్నాడు ఉదయం వరకు ఇక కొలువు ఉండదు .తర్వాత ఏమి జరిగిందో రేపు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-20-ఉయ్యూరు

