’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-13
కుంటిమద్ది రామాచార్యులగారి అసాధారణ అవధానం
సాహిత్య చక్రవర్తి కుంటిమద్ది శ్రీనివాసా చార్యులవారి తమ్ముడు కుంటిమద్ది రామాచార్యులు గారు అవధాన ప్రక్రియ స్వాయత్తం చేసుకొన్నారు .భాగవత , భగవద్గీత లలో ఏ పదం ,ఏ అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో కరతలామలకం వారికి .ఒక సారి బళ్లారిలో అనంతపురం జిల్లాకలేక్టర్ ఆయన అవధానం సాహిత్యానికే పరిమితమా ఇతరత్రా కూడా ఉందా అని అడిగాడు .అప్పుడు అవధానిగారు ‘’ఏ భాషలోనైనా ,ఏ విషయం లోనైనా సరే ‘’అన్నారు .ఆయన్ను పరీక్షించటానికి ఒకవంద మంది యూరోపియన్ జంటలను సమావేశపరచి ప్రతి భార్యాభర్తలను అవధానిగారికి పేరు పేరునా పరి చయం చేశారు .మూడు నాలుగు గంటలు విందులూ వినోదాలతో కాలక్షేపం అయింది .తర్వాత ఆవందమంది దంపతులను చెల్లా చెదరుగా కూర్చోబెట్టి అవధాని గారిని పిలిచి ,’’మీకు మూడు గంటల క్రితం పరిచయం చేసిన దంపతులను పేరుపేరునా పిలిచి ,వారెక్కడ ఉన్నారో కనుక్కొని ఆహ్వానించండి ‘’అన్నాడు కలెక్టర్ .అవధానిగారికి తెలుగు సంస్కృతం కన్నడం తమిళం తప్ప మరే భాషా రాదు .అవధానిగారు తడుముకోకుండా ‘’స్టోన్ గారూ దయచేయండి ,శ్రీమతి ఎలిజబెత్ స్టోన్ గారు అమ్మా తమరూ వచ్చి మీభర్తప్రక్క నిలబడండి ‘’అంటూ రెండువందలమంది పేర్లూ ఒక్కటికూడా తప్పు లేకుండా అవ౦దమంది దంపతులను ఆహ్వానించగా కలెక్టర్ ఆన౦ దానికి అవధుల్లేకుండా పోయి అవధానికుంటిమద్ది రామాచార్యులవారి అసాధారణ ధారణకు అమితాశ్చర్యపడి గొప్పగా ప్రశంసించి సన్మానించాడు . ..
పండిత రచయిత శ్రీ రూపనగుడి నారాయణ రావు గారు
28-10-1880 న రూపనగుడి నారాయణ రావు గారు జన్మించారు .తండ్రి నరసింగరావు శిరస్తదారు .మేనమామ హోసూరు సుబ్బారావు కడప డిప్యూటీ కలెక్టర్ .ఈయన’’ హెర్బర్ట్ స్పెన్సర్ ఆన్ ఎడ్యుకేషన్ ‘’అనే గ్రంథాన్నిసంస్కృతం లోకి’’విద్యాభ్యాస పద్ధతిః’’పేరుతొ అనువదించారు.జే ఎస్ మిల్ రాసిన ‘’పొలిటికల్ ఎకానమీ ‘’ని ‘’అర్ధశాస్త్రం ‘’ పేరుతొ ఆంధ్రీకరించారు .మేనమామగారి ఈ విజ్ఞానం నారాయణరావు గారికి అబ్బింది .రావు గారి భార్య గౌరమ్మ .
నారాయణరావు గారు బళ్ళారి వార్డ్లా కాలేజిలో చదివి ,తండ్రిమరణం తో డిగ్రీ చదవకుండా ఆపేశారు. స్వయంగా గ్రంధాలు చదివి సంస్కృత ఆంద్ర ఆంగ్లకవ్యాలు వ్యాఖ్యాన సహితంగా ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే పఠించారు.రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజీలో శిక్షణపొంది ,ఉపాధ్యాయులుగా చాలా చోట్ల పని చేసి మద్రాస్ సైదాపేట ట్రెయినింగ్ కాలేజీలో 30ఏళ్ళు పని చేసి ,1940లో రిటైరై బళ్లారిలో స్థిరపడ్డారు .
విద్యార్ధులకు ఉపయోగపడే వాచకాలుకథా పుస్తకాలు మొదట రాసి ,తర్వాత కావ్యాలు నాటకాలు ,సిద్ధాంత గ్రంథాలు రాశారు .అరవింద సిద్ధాంత గ్రంథం రాశారు .మానవుడు కళాస్వాదనతో సౌందర్య రసజ్ఞత ,సుష్టుతసహృదయత పొందుతాడని ,వీటి వలన తనకు తెలియకుండానే హృదయ సామరస్యం పొంది ,సౌశీల్యవంతుడై ,జీవితం పై ఆసక్తి పెరిగి అన్ని విషయాలలోకి చొచ్చుకు పోతాడని రావు గారి సిద్ధాంతం .ఉత్తమకళాను భూతిఐహిక సుఖాన్ని మాత్రమె కాక ,దివ్యజ్ఞానాన్నీ ,అఖండ ప్రేమను అఖండ ఆనందాన్నీ అందిస్తుందని ఆయన సిద్ధాంతం .
రావుగారి కావ్యనాటకాలు ఆధ్యాత్మికపరమైనవి .మొదటికావ్యం కవితా నీరాజనం ను 16ఖండికలతో క్వెట్టా భూకంపం గురించి అందులో ఒకఖండిక’’అశ్రు తర్పణం ‘’మనసును కదిలించేట్లు రాశారు .’’కృష్ణరాయ సాగర కావేరి ‘’ఖండిక సమకాలీన కృష్ణ రాయ సాగర జలాశయ వర్ణన .రెండవ రచన ‘’ఆర్యా సుభాషితం ‘’భర్తృహరి సుభాషితం లాంటి స్వంత రచన .పరిణయ కథామంజరి ,కదామణి ,ప్రవాళ ముక్తావళి ఆంద్ర వ్యాకరణ దర్పణం,నారాయణ తెలుగు వాచకాలు,మాతృ భాషాబోధిని ,నారాయణ తెలుగు ఉపవాచకాలు ,విప్రనారాయణ నాటకం గౌతమబుద్ధనాటకం ,సౌన్దరనంద నాటకం ,,కావ్యనిదానం,పంపాపురీ శతకం ,ఆధ్యాత్మికోపాసనలు ఉన్మత్తరాఘవం –అనువాదం ,కాళిదాసు ,శ్రీ అరవిందులు జీవిత సంగ్రహం ,మాతప్రార్ధనలు ,కాకతీయ రుద్రమాంబ నాటకం ,విషాద విజయనగర నాటకం ,క్షమావతీ విజయ నాటకం , శిశు మానసిక శాస్త్రం ,మానవ విజయం ,రూపన్న కుమార భారతం మొదలైనవి సరళమైన తెలుగులో రచించారు .
నారాయణరావుగారు అరవింద గ్రంథాలు కూడా అనువదించారు –అందులో జాతీయ విద్యా విధానం ,భారతీయప్రజ్ఞ,జాతీయావశ్యకత ,జాతీయ కళాప్రయోజనం ,యోగ భూమికలు ,మాతృశ్రీ జీవిత సమస్యలు ,ప్రాతః కాలం నాటి పలుకులు ,శ్రీ అరవిందుల యోగము ,.రవీంద్రుని గ్రంథాలుకూడా అనువదించారు. వాటిలో మాలిని ,యజ్ఞము గీతాంజలి ముఖ్యమైనవి .టాల్ స్టాయ్ రచనలలో మొదటి సారాబట్టీ ,త్రాగు బోతు ముఖ్యమైనవి స్పెన్సర్ గ్రంథాన్ని ‘’విద్య ‘’గా అనువాదం చేశారు .
తనరచనలకు ఎలాంటి సన్మానం కోరుకొని వినయసంపంన్నులు రావుగారు .18పర్వాల కుమారభారతం మహాకావ్యాన్ని విని హిందూపురం లోని శ్రీ శారదా సమితి వారు ‘’సాహితీ శిల్పి ‘’బిరుదునిచ్చి సత్కరించారు .రావు గారు తన స్వీయ జీవిత చరిత్రకూడా రాసుకొన్నారు .అముద్రిత రచనలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం శ్రీ కైప నాగరాజు చేశారు.ఈ తరం వారికి రూపనగుడి నారాయణరావు గారి గురించి తెలిసి ఉండకపోవచ్చు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-20-ఉయ్యూరు