తిరుపతి వెంకటాద్రి రాముడు-3(చివరి భాగం )
శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో ,షోడశ కళలతో జన్మించి సంపూర్ణావతారం అని చాటాడు .శ్రీరాముడు 14 కళలతో జన్మించాడు .మిగిలిన రెండు కళలుపరశురాముని వద్ద ఉన్నాయి .ఈయన విష్ణు ధనుస్సును చేతితో పట్టుకోవటంతో ఆయనవద్ద ఉన్న ఆ రెండు కళలు రాముని చేరాయి .కోదండ రామాలయం లొ14 స్తంభాలు రాముడి కళలకు ప్రతిరూపం .14 భువనాలకూ కావచ్చు .ముందున్న రెండు స్తంబాలను కలిపితే 16అయి ‘’షోడశ కళానిధికి షోడశోపచారాలు ‘’అనే మాట సార్ధకమౌతుంది.గర్భ గుడి సాక్షాత్ వైకుంఠం లా ఉంటుంది . ద్వార౦పై శ్రీరామ శ్రీరామ శ్రీరామ సువర్ణాక్షరాలతో ఉంటుంది.గడపపై గరుడ ఆంజనేయులు చెరొక వైపున ఉంటారు .రాముడికి దక్షిణ భాగం లో సీతాదేవి ఎడమభాగం లో లక్ష్మణ స్వామి ఉంటారు . లక్ష్మణస్వామి ధనుస్సుకూ ఏడు గ౦టలున్నాయి .రామస్వామి విగ్రహం కొలతలు తిరుమల బాలాజీ కొలతలు ఒకటే .అందుకే ఎఏడుకొండలాయనకు చేయించిన కిరీటం కోదండ రాముడికి సరిపోయిందట .తిరుమల వెంకన్నకు కోదండం తగిలిస్తే అచ్చంగా కోదండ రామస్వామిగానే ఉంటాడని అర్చకస్వాములు ఉవాచ .రాముడి వక్షస్థలం పై మహా లక్ష్మీదేవి ముద్ర ఉండటం తో తిరుమలయ్యకు రామయ్యకు భేదం లేదు .కోదండరాముని చూసి మోహనాకారుడని పొంగిపోతారు భక్తులు .తిరుమల వెంకన్నను చూసి బయటికి రాబుద్ధికానట్లు ఈ రామయ్యను చూసినా అంతే.ఫిదా అయిపోతారు .
భద్రాచల రాముడు నాలుగు భుజాలతో ఆసన భంగిమలో ,వెంకన్న చతుర్భుజాలతో స్థానక భంగిమలో ,కోదండరామస్వామి ద్విభుజుడై ఉంటారు .తిరుమల మూల విరాట్ కు ధనుర్బాణాలు ధరించిన చిహ్నాలు చారలుగా భుజాలపై కనిపిస్తాయట .సీతా దేవి విగ్రహం లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది .రాముడికి ఎడమవైపున్న సీతమ్మను కొలిస్తే ఐశ్వర్యాభి వృద్ధి ,కుడివైపున్న సీతమ్మను కొలిస్తే మోక్ష ప్రాప్తి అని శాస్త్రం .వైఖానస సంప్రదాయం లో అమ్మవారు అయ్యవారికి కుడి ప్రక్కన ఉంటుంది –‘’సీతాయ దక్షిణే పార్శ్వే లక్ష్మణస్యచ పార్శ్వతః ‘’అని శాస్త్రం .తిరుమలలో సీతారామ ఉత్సవ మూర్తులు ఇలానే ఉంటాయి .ఆమె ప్రక్కనే ఉన్నా ,కోదండం ధరించి ఉన్నా రాముడు మాత్రం పరమ ప్రశాంతంగా ఉంటాడు .తిరుమలలో అర్చన తర్వాత దర్శనం శయన మందిరం నుంచి ఉన్నట్లుగానే కోదండరామాలయం లోకూడా అలాగే ఉండటం విశేషం .
తిరుమలలో బాలాజీ ఆలయం మెట్లు ఎక్కి ఎదురుగా బేడీ ఆంజనేయ దేవాలయం లో స్వామిని చూసినట్లే కోదండ రామాలయానికి ఎదురుగా మెట్లెక్కి ఎదురుగా ఉన్న హనుమను దర్శించాలి .అక్కడ తిరు సన్నిధి ఉన్నట్లే ఇక్కడ రామ సన్నిధి ఉంది .రాముడికి ఎడమవైపు ఉండటం వలన తూర్పు కుతిరిగి హనుమ౦తస్వామిని చూస్తూ ఉంటాడు .ఒకప్పుడు ఆలయం బయటినుంచి ఎలా అరిస్తే లోపల అలా ప్రతిధ్వని వినిపించేది .ప్రతిశనివారం శ్రీరామ ఉత్సవ విగ్రహాలూరేగింపు ఉంటుంది .కొదందరామునికి నివేదించిన ప్రసాదాలను హనుమకు కూడా నివేదించి ఆటర్వాతే భక్తులకు ప్రసాదం పెడతారు .తిరుమలలో స్వామికి నివేదించి బేడీ ఆంజనేయస్వామికి నివేదన పెడతారు .
తిరుపతిలో గోవిందరాజస్వామి దేవేరి ఆండాలమ్మ ఉత్సవం జరిగేటప్పుడు ప్రతిరోజూ ఉదయం ,సాయంత్రం కోదండ రామాలయానికి వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్ళటం ఆచారం .ధనుర్మాసం లో ప్రతి ఉదయం వెండి బిందెలతో తీర్దాన్నిఏనుగుపై ఊరేగిస్తూ తీసుకు వెళ్లి గోవింద రాజ స్వామికి అందిస్తారు.కొదంద రామాలయం దగ్గర రామ చంద్ర గుంట లేక తీర్ధం నుంచి గోరువెచ్చని నీటిని సీతమ్మవారి అభిషేకానికి తీసుకు వెడతారు .దీనినే ‘’నీరాట్టం ‘’అంటారు .గోవిందరాజ ఆలయంలో పార్ధసారధి దగ్గరున్న బీబీ నాంచారమ్మ ఉత్సవిగ్రహం ,కొదందరామాలయానికి రావటం విశేషం .బాలాజీకి ,రాముడికి భేదం లేదని చాటటానికేమో !కోదండ రాముని గుడికి దగ్గరలో అన్నమాచర్య కళామందిరం,త్యాగరాజాలయ మండపాలున్నాయి . అన్నమయ్య జయంతికి త్యాగరాజ ఉత్సవాలకు కొదందరాముడే స్వయంగా హాజరౌతాడు .గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు వెళ్ళేటప్పుడు స్వామి పాదాలు కొదందరాముడికి మహా ప్రదక్షణ౦ గా వెళ్ళటం ,మోహినీ రూప వాహనం పై ఊరేగేటప్పుడు స్వామి కొదందరామాలయాంకి రావటం గొప్ప విశేషాలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-21-ఉయ్యూరు

