త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు
అనే స్వీయ చరిత్రను విజయవాడకు చెందిన సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ,సాహితీ వేత్త డా .గూడూరు నమశ్శివాయ సేకరిస్తే ,హైదరాబాద్ సుల్తాన్ నగర్ గాంధీ జ్ఞానమందిర్ కు చెందిన గాంధీ సాహిత్య ప్రచురణాలయం వారు విజయవాడ లోని పటమట లో ఉన్న సర్వోదయ ప్రెస్ 1983లో ప్రచురించింది .వెల –నాలుగు రూపాయలు . ప్రకాశకుల నివేదనలో’’గాంధీకి ముందే శ్రీ వేమూరి రామ్జీరావు ,శ్రీ గూడూరు రామచంద్రుడు ,శ్రీ నల్లపాటి హనుమంతరావు గార్లు అస్పృశ్యతా ,హరిజన సేవకు అత్యద్భుత కృషి చేశారు .గూడూరు నమ శ్శివాయగారు రాంజీరావు ,రామచంద్రుడు గార్ల జీవిత విశేషాలను సేకరించి గ్రంథాలురాశారు .హనుమంతరావు గారి చరిత్రను ఆయనతోనే రాయించారు .నమశ్శివాయ గారి కృషి అనన్య సాధ్యం .శ్రీ పాతూరి నాగభూషణం గారికి ధన్యవాదాలు ‘’అని రాశారు గాంధీ సాహిత్య ప్రచురణ కార్యదర్శి శ్రీ కోదాటి నారాయణ రావు .
విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, ప్రఖ్యత సాహిత్య విమర్శక ,పరిశోధకులు శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు రాసిన పీఠిక లో ’’బ్రాహ్మణా బ్రాహ్మణేతర కులాల వారు అట్టడుగు కులాలవారరైన మాల మాదిగలను అస్పృశ్యులుగా భావించి ,వారికి సామాన్య మానవులకు కావాల్సిన కనీస సౌకర్యాలను కూడా లేకుండా చేసి గ్రామాలకు దూరం గా గూడాలలో ఉండే స్థితి కల్పించారు .గ్రామాలలోని బావి నీరు వారికి వాడుకొనే అర్హత ఉండేది కాదు.ఎవరైనా పుణ్యాత్ముడు వారి గూడెం లో బావి తవ్విస్తేనే వాళ్లకు నీళ్ళగతి .లేకపోతె పశువులను కడిగే, బట్టలు ఉతికే చెరువులలోని మురికి నీరే వారి గతి గా ఉండేది .తాగే నీరే లేనప్పుడు స్నానానికి నీరు ఎక్కడ ?కనుక శుచి శుభ్రతలకు దూరంగా ఉండేవారు .ఆ రెండు కులాలు లేకపోతె రైతుల వ్యవసాయం అంగుళం కూడా ముందుకు సాగదు.మోటు పనులన్నీ వాళ్ళే చేయాలి .వారికి జీవన భ్రుతి అత్యల్పంగా ముట్ట చెప్పేవారు కామందులు .చచ్చిన గొడ్లను తీసుకు వెళ్లి తోళ్ళనువొలిచి ఆర బెట్టటం తో మాదిగ గూడాలు చాలా అపరి శుభ్రంగా ఉండేవి .మాల మాదిగల మధ్య కూడా గొడవలు ఎక్కువగానే ఉండేవి.
మాలలు రామభక్తి వైష్ణవ సంప్రదాయం పాటించేవారు .మాదిగలు శివభక్తి తత్పరులు జంగాలు వీరి గురువులు .మాల ,మాదిగ దాసులు మతాచారాలు పాటిస్తూ పౌరోహిత్యమూ ,వైద్యమూ చేసేవారు .శ్లోకాలు దండకాలు కంఠస్తం చేసేవారు .సామాన్యులు అక్షరజ్ఞాన శూన్యులుగానే ఉండేవారు .కానీ వారిలో పెద్దలు మన పురాణ ఇతిహాసాలు వినటం చేత వేదాంతం వంటబట్టి హిందువులుగానే ఉండిపోయారుతరతరాలుగా .బ్రిటిష్ పాలనలో క్రైస్తవ బోధకులు ఈ అంటరాని తనాన్ని గుర్తించి ,హిందూ సాంఘిక ఆచారాలను విమర్శిస్తూ ,అగ్రకులాలు ఈ నిమ్న కులాల వారిని నీచంగా చూస్తున్నారని వాళ్ళ మనస్సులలో నాటి ,క్రైస్తవం లోకి కలుపుకొనే ప్రయత్నం చేశారు .ప్రయత్నం కొంత ఫలించినా మెజార్టీ హిందువులుగానే మిగిలారు .ఇంగ్లీష్ పాలకులు మనలో జాతి కులమత భేదాలు కల్పించి రాజ కీయ స్వాంత౦త్ర్య౦ ఇవ్వటానికి సాకులతో అడ్డు చెప్పారు .మిత్రభేదం పాటింఛి 1947దాకాగాడిపి గత్యంతరం లేక మనకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు .
1950లో స్వతంత్ర భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి అస్పృశ్యత రద్దు చేయబడి ప్రజలందరూ సమానులే అన్న భావానికి బలం చేకూర్చారు అప్పటినుంచి అట్టడుగు కులాల ఉద్ధరణ,రక్షణ ,సౌకర్యాలకోసం కోసం ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చు చేసినా నిజమైన అభి వృద్ధి జరగనే లేదు .మాలమాదిగలు అసెంబ్లీ ,పార్లమెంట్ సభ్యులు మంత్రులు అయినారు .అయినవారు అన్నీ అనుభవిస్తూ భోగభాగ్యాలతో తులతూగుతున్నారు .కాని నోరులేని బక్క జీవుల స్థితి ఏమాత్రమూ మారకపోవటం శోచనీయం .కనీస సౌకర్యాలు కూడా వారికి దక్కనే లేదు .దీనికి కారణం డా అంబేద్కర్ వంటి త్యాగమయులు విద్యాధికులు వారిలో లేకపోవటమే .వీరి ఈ దుస్థితి గుర్తించి మహాత్మాగాంధీ సామూహిక హరిజనోద్ధరణకు పూనుకొన్నాడు .వారిని ఉద్ధరించే సంఘాలు ఏర్పడ్డాయి .వీటిలో బ్రాహ్మణ బ్రాహ్మణేతరులుకూడా దేశభక్తులు సభ్యులుగా ఉన్నారు.గ్రామాలలో అస్ప్రుశ్యులకు న్యాయం చేకూరింది .
కానీ గాంధీ కంటే ముందే హరిజనోద్ధరణ కు కంకణం కట్టుకొని కృషి చేసిన సత్పురుష త్యాగమూర్తులున్నారని చాలామందికి తెలియదు వారి జీవిత విషయాలు సాధించిన మహత్కార్యాలు కూడా అసలు తెలియదు .మాలమాదిగల స్థితి గతులను వివరించే గ్రంథం శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి ‘’మాలపల్లి నవల ‘’ఒక్కటే . ప్రజా ప్రభుత్వం లో అన్నికుకులాల వారితో పాటు వీరూ జీత భత్యాలు పెంచమని ,రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండాలనీ కోరుతున్నారు .అంతే తప్ప అట్టడుగు వర్గాల సంక్షేమం పై వాళ్ళకూ దృష్టి లేకపోవటం శోచనీయం .వారి సేవలో అవకతవకలు చాలా ఉంటున్నాయి .
ఆంద్ర దేశం లో అన్ని జిల్లాలో మాలమాదిగలలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు మాదిగాలే అయినా ,వీరికంటే మాలలకు ఎక్కువ ప్రాతినిధ్యం ,పలుకుబడి సౌకర్యాలు లభించాయని మాదిగ నాయకులు సభలు జరిపిచైతన్యం తెస్తున్నారు . పోరాట సమితులు ఏర్పడ్డాయి .అయినా గొంగళి అక్కడే ఉంది .అస్పృశ్యులలో అస్పృశ్యులు ఉన్నారని చరిత్ర పరిశోధకులు గుర్తించారు .ఇవాళ వారి గురించి ఏపత్రికలో ,శాసనసభలో ప్రకటింపబడటం లేనేలేదు.జనాభాలెక్కల్లో,ప్రభుత్వ నివేదికలో నూ వీరి గురించి వివరాలు లేవు .1961లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన ETNOLOGICAL FIELD SURVEY లో కోస్తా ,రాయలసీమ జిల్లాలో మాలమాదిగలలో ఎల్లమ్మ దేవత కు అంకితం చేయబడిన ‘’మాతంగులు ‘’అనే అవివాహిత స్త్రీలున్నారనీ ,వీరికి పుట్టిన బాలికలు మాతంగులుగానే ఉండిపోతున్నారనీ ,గ్రామ దేవతల ఉత్సవాలలో పాల్గొంటున్నారనీ మగపిల్లలు మాలమాదిగకులాల లో కలిసిపోతున్నారనీ ,కోస్తా రాయల సీమలో 392మాతంగి స్త్రీలు ,250మంది మాతంగి పురుషులు ఉన్నారనీ ప్రకటించింది. తెలంగాణా లో ఫీల్డ్ సర్వే జరగలేదు.మాతంగి స్త్రీ ఎల్లమ్మ దేవత అవతారంగా భావిస్తారు .ఈ స్త్రీజరిపే తుడుపులవలన పిశాచాది బాధలు తొలగిపోతాయని ,మాలమాదిగలే కాక, ఇతరకులాల వారుకూడా ఇలా తుడుపులు చేయిచుకొంటారని ఆ రిపోర్ట్ చెప్పింది .
కుల తార తమ్యాలు మన దేశం లోనే కాదు అన్ని దేశాలలో ఏదోరూపం లో ఉంది .దీనివలన దేశానికి నష్టం కలగకూడదు .ఇటీవల బ్రాహ్మణేతరుల ఉద్యమాలలో బ్రాహ్మణులను కించపరుస్తున్నారు .కానీ బ్రాహ్మణ ఆచారాలను ఉల్లంఘించి మాలమాదిగలకు సేవ చేస్తూ ,బ్రాహ్మణ కులంచేత నానాఅవమానాలు అగచాట్లు పడుతున్న త్యాగ మూర్తులు కూడా ఉన్నారు .అలాంటి ధన్యజీవులలో శ్రీ నల్లపాటి హనుమంతరావు ,శ్రీ గూడూరు రామ చంద్రుడు ,శ్రీ వేమూరి రాంజీ రావు గార్లు అగ్రగణ్యులు .వారి కృషి విశేషాలను చెప్పే ఈ పుస్తకం అతి విలువైనది ‘’అని తన మేధో పాండిత్యాన్నీ ,పరిశోధన విశేషాలను అరటిపండు వొలిచి చేతికి అందించారు ప్లీడర్ దిగవల్లి వెంకట శివరావు గారు .ఈ పీఠిక ఈ పుస్తకానిక్ శిరో భూషణం .
శ్రీ నల్లపాటి హనుమంతరావు గారి చరిత్ర
ఆరువేల నియోగులు, గౌతమ గోత్రులు నల్లపాటి వారు గుంటూరు జిల్లా నల్లపాడు కరణాలు.వీరిలో ఒక శాఖ దగ్గరలో ఉన్న యంగళాయ పాలానికి తరలి వెళ్ళింది .నల్లపాటి రమణ రాజు మూల పురుషుడు .వారికి కృష్ణం రాజు ఈయనకు సుబ్బరాజు కొడుకులు .సుబ్బరాజుగారి అయిదుగురు కొడుకులు కోటయ్య ,వెంకటప్పయ్య, నాగరాజు, నరసింహం ,రామదాసు .నరసింహం గారి కొడుకే మన హనుమంతరావు గారు .వాసి రెడ్డి రామన్న అనే జమీందారు వీరి మూలపురుషుడు రమణ రాజు గారికి గుంటూరు దగ్గర లాల్ పురం లో 27ఎకరాల భూమి ఇనాం గా ఇచ్చాడు .లింగాయపాలెం గ్రామం లో 30ఎకరాల చెరువు బహుమతిగా ఇచ్చాడు .ఈనాం భూమిపై వచ్చే ఆదాయంతో చెరువు మరమ్మత్తులు చేయాలని అర్ధం .ఇప్పటికీ ఈ చెరువునల్లపాటి వారి ఆధీనంలోనే ఉంది వారే ధర్మకర్తలు .ఈ చెరువులో 8ఎకరాలలో మాత్రమె నీరు నిలుస్తుంది .మిగాతాదిఖాళీ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-21-ఉయ్యూరు