మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16
16-అమర సందేశం హీరో –ఆమరనాథ్
1950-60మధ్య కాలం లో తెలుగు చలన చిత్ర సీమకు అనేకమంది నటీ నటులు పరిచయమయ్యారు .అదృష్టం బాగుండి తారాజువ్వల్లాగా పైకి ఎదిగిన వారు కొందరు దురదృష్ట కాలసర్ప బాధ పడి అధోగతి పాలైనవారు కొందరు వీరిలో ఉన్నారు .1953లో వచ్చిన ‘’నా చెల్లెలు ‘’సినిమాలో పరిచయమైన అమరనాథ్,1954లో ఆదుర్తి సుబ్బారావు తొలిగా దర్శకత్వం వహించి ,ఘంటసాలమాస్తారు గారికి ఆర్కెస్ట్రా పార్టీ గా ఉంటున్న ప్రసాదరావు అండ్ పార్టీ సంగీతం అందించిన‘’ సంగీత ,సాహిత్యాల క్లాసిక్ ‘’అమర సందేశం ‘’ సినిమాలలో అద్భుత నటన ప్రదర్శించి ,ఆంధ్ర సినీ ప్రేక్షకుల హృదయాలలో స్థిరస్థానం సంపాదించుకొన్నారు .తర్వాత భరణి ,నేషనల్ పిక్చర్స్ ,భాస్కర్ ప్రొడక్షన్స్ ,గోకుల్ కృష్ణా ప్రోడక్షన్స్ వారి సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు .
అమరనాథ్ అసలుపేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ .విశాఖ పట్టణం లో 1925లో జన్మించారు .చిన్నప్పటి నుంచి నటన ,సంగీతాలపై మోజు పడి,వాటిలో నైపుణ్యం సాధించటానికి తీవ్ర కృషి చేశారు .చాలా లలిత సంగీత కచేరీలు చేసి రంజింప జేశారు .ఆయన మధుర కంఠస్వర౦ తో శ్రోతలను సమ్మోహితులను చేసేవారు .నాటకాలలోనూ ప్రధాన పాత్రలు ధరించి మెప్పించేవారు .హాస్యం మిళితం చేసి కొన్ని గీతాలు రచించి గ్రామఫోన్ రికార్డ్ లు ఇచ్చారు .ఇవన్నీ 1950 ప్రాంతం లోఎం. ఎస్ .పట్నాయక్ పేరిట విడుదలైనాయి .ఈరికార్డ్ లకు మాంచి గిరాకీ ఉండేది .
ఇంటర్ పాసై,విశాఖ లో ఫుడ్ కార్పోరేషన్ లో గుమాస్తాగా చేరి పని చేస్తూ సినిమా అవకాశాలకోసం ప్రయత్నించారు .అప్పుడు జికే మంగరాజు ,ఎం ఎస్ నాయక్ లు కొందరు నిర్మాతలకు ఈతనిని పరిచయం చేశారు .దానిఫలితం గా ‘’అమ్మ లక్కలు ‘’ నా చెల్లెలు ‘’సినిమాలలో నటించే అవకాశం వచ్చింది .మంచి హావభావాలతో చక్కని నటన ప్రదర్శించటం చూసి ,ఇతరనిర్మాతలూ తమ చిత్రాలలో కాంట్రాక్ట్ చేసుకోవటం జరిగింది .నాచెల్లెలు చిత్రం లో పెద్దన్న పాత్ర గొప్పగా పోషించి ప్రేక్షక, నిర్మాత ,డైరెక్టర్లను ఆకర్షించారు .భరణి ప్రొడక్షన్స్ ని ర్మించి ,భానుమతి ,రామారావు రంగారావు మొదలైన అగ్ర శ్రేణి నటులు నటించి భానుమతి మొదటిసారిగా దర్శకత్వం చేసిన చండీ రాణి లో కూడా నటించారు .ఇవన్నీ ఒకే ఏడాదిలో విడుదలై, వైవిధ్య పాత్రలను పోషించిన నటుడుగా అమరనాథ్ స్థిరపడ్డారు .ఆదుర్తి మొదటి సారి దర్శకత్వం వహించిన సంగీత సాహిత్య రసాత్మక చిత్రం అమర సందేశం లో అమరనాథ్ నాయక పాత్ర ధరించి అశేష ప్రేక్షకాభిమానం సంపాదించారు .54లో వచ్చిన చక్రపాణి లో భానుమతి అన్నగా ,55లో వచ్చినకోవెలమూడి భాస్కరరావు డైరెక్ట్ చేసిన జానకి, రామారావు నటించిన ‘’చెడపకురా చెడేవు ‘’లో,అ౦జలీ దేవితో అదే ఏడాదిలో రజనీ కాంత్ దర్శకత్వం లో వచ్చిన వదిన గారి గాజులు లో ,1956చిత్రం రజనీకాంత్ దర్శకత్వం ,ఎస్ వరలక్ష్మి రంగారావు ,గుమ్మడి నటించిన కనకతార లో ,భానుమతి ,రామారావు నటించి భానుమతి భర్త రామకృష్ణ డైరెక్ట్ చేసిన చింతామణి లో ,1957లో కృష్ణకుమారి మొదలైన వారు నటించిన అక్కా చెల్లెళ్ళు లో రంజనితో ముఖ్యపాత్ర లో నటించారు .ఇందులో ఆరుద్రరాసి పిఠాపురం ,జిక్కిపాడిన ‘’ఇండియాకు రాజధాని ఢిల్లీ,నా గుండెల్లో ప్రేమరాణి లిల్లీ ‘’పాట సూపర్ హిట్ .భానుమతి ,జగ్గయ్య ,రామన్న పంతులు నటించి భరణి రామ కృష్ణ డైరెక్ట్ చేసిన వరుడు కావాలి లో,1959లో వచ్చిన సతీ సుకన్య లో చ్యవన మహర్షిగా ,సుకన్యగా కృష్ణకుమారినటించగా చంద్రమోహన్ దర్శకత్వం చేశారు .1960లో విడుదలైన మగవారిమాయలు సినిమాలో కృష్ణకుమారితో హీరో గా అమరనాథ్ నటింఛి నిర్మించిన చిత్రం . శోభనాద్రిరావు డైరెక్ట్ చేశారు ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి విపరీతంగా నష్టపోవాల్సి వచ్చి ఆతర్వాత సినిమా అవకాశాలు కూడా క్రమ౦గా తగ్గిపోయి ఫేడౌట్ అయిపోయారు .
1973లో అమరచంద్ర మూవీస్ సంస్థ స్థాపించిఅమరనాథ్ హీరోగా ,విజయనిర్మల హీరోయిన్ గా ‘’బాలయోగి ‘’సినిమా మొదలుపెట్టి ,సగం తీసి డబ్బు లేక,పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయి ఆపేశారు .మానసికంగా ,ఆర్ధికంగా కుంగిపోయిన హీరో నిర్మాత అమరనాథ్ 65ఏళ్ల వయసులో అమరులైనారు.ఈయన కుమారుడు రాజేష్ ,కూతురు శ్రీ లక్ష్మి సినీ రంగం లోనే స్థిరపడ్డారు రాజేష్ చనిపోయి చాలాకాలమైంది .విలక్షణమైన హాస్యనటిగా శ్రీ లక్ష్మి అద్భుతంగా నటిస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు .అదృష్టం తో పైకెగసి మహాద్భుత నటనలో 7 సంవత్సరాలు మాత్రమె రాణించి దురదృష్టం కాటుకు బలైన హీరో అమరనాథ్ అమర్ రహే .
అమరనాథ్ నటించి జీవించి కీర్తి ప్రతిష్టలు పొందిన అమర సందేశం సినిమా హీరోయిన్ శ్రీ రంజని .సంగీతం ప్రసాదరావు అండ్ పార్టీ,కేల్కర్ లు .పాటలు ఏ.ఎం.రాజా జిక్కీ ,పిబిశ్రీనివాస్పా ,మాధవపెద్ది పాడారు .దీనికి మూలం హిందీ సినిమా –బైజుబావరా ‘’ ఇందులో ఆణిముత్యాలలాంటి పాటలు -1-ఆనతికావలేనా గానానికి సమయము కావలెనా –(రాజా )ఏదో ఏదోనవీన భావం కదిలించే మధురమధుర (రాజా ),దయామయి దేవి శారదా –(పేరు తెలీదు )ప్రియతమా మరులుమా తిరిగిరాని పయన మేల(జిక్కి )మధురం మధురం మనోహరం రాధామాధవ (రాజా) ,మానస లాలస సంగీతం (రాజా )సరసత్ కళా క్షీరజముల (రాజా )
ఈపాటలు ఆరుద్ర ,శ్రీ శ్రీ ,తాపీ ధర్మారావు లు రాశారు .వీటి పూర్తి స్క్రిప్ట్ కూడా దొరక లేదు . చరిత్ర,.లో కలిసిన ఈ మహా నటుడిని పరిచయం చేసే భాగ్యం కలిగింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-1-21-ఉయ్యూరు

