మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23
23- బ్రహ్మ చారి నటుడు
దొరైస్వామి
పింగళి నాగేంద్రరావు సంభాషణా రచయితగా కవిగా ,విజయావారి ఆస్థాన మహా కవిగా సుప్రసిద్ధులు .ఆజన్మ బ్రహ్మ చారి. అలాగే ఆదే కాలం లో సినిమాలకు పరిచయమైన కేరక్టర్ యాక్టర్ దొరైస్వామి కూడా బ్రహ్మ చారే అని తెలిస్తే అవాక్కై పోతాం కాని నిజం .దొరస్వామి పూర్తిపేరు పాల్ దొరస్వామి .దొరైస్వామి అనీ అంటారు .1897లో జన్మించారు .
1951లో బిఎన్ రెడ్డిగారి దర్శకత్వం లో వాహినీ వారి మల్లీశ్వరి సినిమాలో భానుమతి రామారావు వంటి ఉద్దండులతో దొరైస్వామి నటించారు .భానుమతి తండ్రిగా దొరైస్వామి నటించిన తీరు పరమాద్భుతం .కూతురుకు ఇష్టం లేని రాణి వాస భోగం ,భార్య ఋష్యేంద్ర మణి ని ఎదిరించలేని నిస్సహాయత, మేనల్లుడు రామారావు ను సోదరినీ తనభార్య తేలికగా చూడటం మొదలైన విషయాలలో గుండెలు పిండేదుఖాన్ని అదుపులో పెట్టుకొన్న తండ్రిగా దొరైస్వామి నటన చిరస్మరణీయం . నాగయ్య ,కాంచనమాల హీరో హీరోయిన్ లు గా బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం లో 1939లో వచ్చిన వందేమాతరం సినిమాలో నాగయ్యగారి తండ్రిగా అదే బిఎన్ రెడ్డిగారి దర్శకత్వం లో నాగయ్య ,కుమారి వగైరాలతో వచ్చిన సుమంగళి లో కూడా హీరో తండ్రిగా నటించారు .అంటే తెలుగు టాకీల తొలియుగపు నటులు దొరస్వామి .
1952లో ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో రామారావు సావిత్రి ,జి వరలక్ష్మి నటించిన ‘’పెళ్లి చేసి చూడు ‘’సినిమాలో గోవిందయ్య గా విలన్ వేషం కూడా వేసి బాగానటించి మెప్పించారు .హీరో పెళ్లి చెడ గొట్టటానికి విశ్వ ప్రయత్నం చేసి ,చివరికి రంగారావు నటించిన దూపాటి వియ్యన్న చేతిలో అవమానం పొందిన కేరక్టర్ లో దొరైస్వామి విజ్రుమ్భిమ్చి నటించి మెప్పించారు .అసలు ఆయన వేసినవన్నీ సాఫ్ట్ కారక్టర్స్ మాత్రమే .ఇదే విలక్షణ విలనిజం ఉన్న పాత్ర .1955లో ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో రామారావు, సావిత్రి వగైరా హేమా హేమీలు నటించిన మిస్సమ్మ చిత్రం లో మేరీ అనే సావిత్రి పెంపుడు తండ్రి గా క్రిష్టియన్ పాత్రను గంభీరంగా ,అమాయకంగా ,కూతురుపై అభిమానం ఉన్నవాడుగా దొరైస్వామి నటించి రక్తి కట్టించారు .
ఆతర్వాత చాలా సినిమాలలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించి మెప్పించారు .దాదాపు ఆ సినిమాలో ఆయన కన్నీరుతో, బాధలతో, దరిద్రంతో ,జబ్బులతో తీసుకు తీసుకొని కుళ్ళి కుళ్ళిమరణించే పాత్రలే ఎక్కువ .ఏ పాత్రనైనా తన నటనా సామర్ధ్యం తో దానికి జీవం పోసి నిలబెట్టినవారు దొరైస్వామి .
ఆయన నటించిన ముఖ్యమైన సినిమాలలో –సువర్ణమాల,నా ఇల్లు , భాగ్యలక్ష్మి,పరివర్తన ,త్యాగయ్య ,అన్నదాత ,కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం మంగళ,ఆడ జన్మ ,దేవదాసులో పార్వతి తండ్రి గా ,విశ్వ మోహిని ధర్మ దేవత నిర్దోషి ,అర్ధాంగి లో సావిత్రి తండ్రిగా ,దొరైస్వామి నటించి మెప్పించారు .
సశేషం
కనుమ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-22-ఉయ్యూరు