మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107 107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107

107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ

కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 – జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళాశాల యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. జర్నలిస్ట్‌గా వ్యవహరించి, సినీరంగంలోకి ప్రవేశించి, కథా రచయితగా, అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఈయన బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు

తొలి జీవితం
కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1924వ సంవత్సరంలో కొల్లి కోటయ్య వర్మ, అన్నపూర్ణ దంపతులకు జన్మించిన ప్రత్యగాత్మ తొలుత కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో ఉన్న కారణంగా కొంతకాలం అండర్‌గ్రౌండ్‌లోనూ ఉన్నారు. ఈయన భార్య అన్నపూర్ణ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత ఉద్యమంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపాధి ఎంచుకునే దశలో జర్నలిస్ట్‌గా కెరీర్‌ ఎంపిక చేసుకుని ‘జ్వాల’ పత్రికను ఏప్రిల్‌ 1952లో ప్రారంభించి కొంతకాలం నిర్వహించారు. ‘ఉదయని’ పత్రికకు కూడా వ్యాసాలు రాసేవారు.

చలనచిత్రరంగ జీవితం
మద్రాసు చేరి, తాతినేని ప్రకాశరావు వద్ద కథా రచయితగా, సహాయదర్శకుడుగా పనిచేసారు. 1954లో తొలిసారి సమకూర్చిన కథ నిరుపేదలు చిత్రానికి. ఆ తరువాత జయం మనదే, ఇల్లరికం, చిత్రాలకు కథ సమకూర్చారు. పి.ఎ.పి వారు నిర్మించిన ఇల్లరికం చిత్రానికి సెకండ్‌ యూనిట్‌ డైరక్టర్‌గా 1959లో వ్యవహరించారు.

కృష్ణకుమారి, అక్కినేని ప్రధానపాత్రలు పోషించిన భార్యాభర్తలు చిత్రంతో 1961లో దర్శకుడుగా మారారు. ఇది ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ పతాకాన నిర్మితమయింది. ఎ.వి.సుబ్బారావు ఈ చిత్ర నిర్మాత. తొలి చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆ తరువాత అక్కినేని హీరోగా పలు చిత్రాలను రూపొందించారు ప్రత్యగాత్మ. భార్యాభర్తలు చిత్రంలో పాటలు కూడా హిట్‌. ఈ చిత్రానికిగాను రజిత కమలం దక్కింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి చేతులమీదుగా.

చక్కని కుటుంబ కథకు, సెంటిమెంట్లు జోడించడం, మంచి డ్రామా పండించగల నేర్పు, హిట్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడం అనేవి ప్రత్యగాత్మలోని ప్రత్యేకతలు. సహజంగా ఉన్న ఊహాశక్తి, తాతినేని ప్రకాశరావు వద్ద చేరడంతో మరింత మెరుగులు దిద్దుకుంది. మంచి దర్శకుడుగా ఎదుగుతాడని తొలిదశలోనే తాతినేని ప్రకాశరావు, ఎ.వి.సుబ్బారావులతో పాటు అక్కినేని నాగేశ్వరరావు కూడా తలచారు. తొలి తలపులకు అనుగుణంగానే ఇటు తెలుగు చిత్రసీమలోనూ, అటు హిందీ చిత్రసీమలోనూ రాణించారు ప్రత్యగాత్మ. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ ఆత్మ ఆర్ట్స్ ప్రారంభించాడు. కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు మమతలు, ఆదర్శకుటుంబం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ అక్కినేని హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించాయి. అమ్మకోసం, ముగ్గురు అమ్మాయిలు, మా వదిన, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు, గడుసు అమ్మాయి, కన్నవారి ఇల్లు, కమలమ్మ కమతం తదితర చిత్రాలు ప్రత్యగాత్మ రూపొందించినవే. 1980లో దర్శకత్వం వహించిన నాయకుడు – వినాయకుడు ఈయన చివరి చిత్రం.

హిందీ చిత్రాలు
కృష్ణంరాజును హీరోగా పరిచయం చేస్తూ ‘చిలకా గోరింక’ చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించారు 1966లో. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ ఏడాదే హిందీ చిత్ర రంగంలోకి కె.పి. ఆత్మగా ప్రవేశించి ‘ఛోటా భాయి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘రాజా ఔర్‌ రంక్‌’ కి సంజీవ్ కుమార్ హీరోగా, ‘తమన్నా’ చిత్రాన్ని పూజాభట్‌, శరద్‌ కపూర్‌లతో, ‘ఎక్‌ నారి ఏక్‌ బ్రహ్మచారి’ చిత్రాన్ని జితేంద్ర, మంతాజ్‌లతో ‘బచ్‌పన్‌’ దో లడకియా! చిత్రాల్ని సంజీవ్ కుమార్ తో, మెహమాన్‌, చిత్రాన్ని బిశ్వజిత్‌తో రూపొందించారు.

కుటుంబ విశేషాలు
చక్కని చిత్రాలు డైరక్ట్‌ చేసిన కె. హేమాంబరధరరావు ఈయన సోదరుడే. హాస్య చిత్రాల దర్శకుడు కె.వాసు, ప్రత్యగాత్మ పెద్దకుమారుడు.

మరణం
చిత్ర పరిశ్రమల్లో వచ్చిన మార్పులు జీర్ణించుకోలేకనో, ఆరోగ్యం సహకరించకనో 1980 తర్వాత నుంచి దర్శకత్వంకి దూరమై జూన్ 6, 2001 వ సంవత్సరంలో హైదరాబాదులో స్వర్గస్తులయ్యారు. గొప్ప దర్శకుడుగా రాణిస్తారని ఆదుర్తిని స్ఫురింపచేసే లక్షణాలున్న వ్యక్తి అని అక్కినేని భావించేవారు.

పురస్కారాలు
ఈయన 1962లో భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రముగా రజత కమలాన్ని అందుకున్నాడు.

చిత్ర సమాహారం
తెలుగు సినిమాలు
· భార్యాభర్తలు (1961)

· కులగోత్రాలు (1962)

· పునర్జన్మ (1963)

· మంచి మనిషి (1964)

· మనుషులు మమతలు (1965)

· చిలకా గోరింక (1966)

· మా వదిన (1967)

· ఆదర్శ కుటుంబం (1969)

· అమ్మకోసం (1970)

· మనసు మాంగల్యం (1970)

· శ్రీమంతుడు (1971)

· స్త్రీ (1973)

· పల్లెటూరి బావ (1973)

· దీక్ష (1974)

· ముగ్గురమ్మాయిలు (1974)

· అల్లుడొచ్చాడు (1976)

· అత్తవారిల్లు (1976)

· గడుసు అమ్మాయి (1977)

· కన్నవారి ఇల్లు (1978)

· మంచి మనసు (1978)

· కమలమ్మ కమతం (1979)

· నాయకుడు – వినాయకుడు (1980)

హిందీ సినిమాలు
ఈయన హిందిలో కె.పి.ఆత్మ పేరుతో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు

· దో లడ్కియా (1976)

· మెహమాన్ (1973)

· ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ (1971)

· బచ్‌పన్ (1970)

· తమన్నా (1969)

· రాజా ఔర్ రంక్ (1968)

· ఛోటాభాయి (1966)

· ఎందరో రచయితలు దర్శకులుగా రాణించి అలరించారు. వారిలో కె. ప్రత్యగాత్మ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక జనరంజకమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ప్రత్యగాత్మ, హిందీలో కె.పి.ఆత్మగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. తెలుగులో జయలలిత నటించిన తొలి చిత్రం, చివరి చిత్రం రెండూ ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం! కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరొందిన ప్రత్యగాత్మ చివరి వరకూ అదే తీరున సాగారు.

· ప్రత్యగాత్మ ఇంటిపేరు కొల్లి. కానీ, ఆయన తండ్రి పేరు కోటయ్య వర్మ. అందువల్ల కొందరు కోటయ్య ప్రత్యగాత్మ అనీ పిలిచేవారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1925 అక్టోబర్ 31న ప్రత్యగాత్మ జన్మించారు. బాల్యం నుంచీ అభ్యుదయ భావాలతో సాగారు. కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాలుపంచుకొని అండర్ గ్రౌండ్ లోనూ ఉన్నారు. ఆ ఉద్యమంలోనే అన్నపూర్ణ పరిచయం అయ్యారు. వారిద్దరూ పెళ్ళాడారు. కొంతకాలం ‘ఉదయని’ పత్రికలో వ్యాసాలు రాశారు. జర్నలిస్ట్ గానూ పనిచేశారు. మద్రాసు చేరుకుని, అక్కడ తాతినేని ప్రకాశరావు వద్ద కథారచయితగా, అసోసియేట్ గా పనిచేశారు. తొలుత ‘నిరుపేదలు’ చిత్రానికి కథ సమకూర్చారు. ఆ తరువాత ‘ఇల్లరికం’ చిత్రం కూడా ఆయన కథతోనే తెరకెక్కింది. అదే సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశారు. దాంతో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘భార్యాభర్తలు’ చిత్రంతో ప్రత్యగాత్మను దర్శకునిగా పరిచయం చేశారు. ఏయన్నార్, కృష్ణకుమారి జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ యేడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత పతకం గెలుచుకుంది. తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లోనే వరుసగా ఏయన్నార్ తో ‘కులగోత్రాలు’, ‘పునర్జన్మ’ వంటి చిత్రాలు తెరకెక్కించి అలరించారు. ఈ సంస్థ నిర్మించిన ‘మనుషులు-మమతలు’తోనే జయలలిత తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో ఆమె స్విమ్ షూట్ ధరించడంతో ఆ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. తెలుగులో తొలి ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రంగా ‘మనుషులు-మమతలు’ నిలచింది.మనుషులు మమతలు సెంటి మెంట్ పండిన సినిమా .

· యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘మంచి మనసు’, ‘దీక్ష’ చిత్రాలకూ కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలలోనూ జమున నాయిక కావడం విశేషం. కృష్ణంరాజును తన ‘చిలకా-గోరింకా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు ప్రత్యగాత్మ. ఇదే సినిమాతో రమాప్రభను నటిగా నిలిపారు. ఏయన్నార్ రజతోత్సవ చిత్రంగా తెరకెక్కిన ‘ఆదర్శకుటుంబం’కు కూడా ప్రత్యగాత్మ దర్శకుడు. విశాఖ పట్నంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా ప్రత్యగాత్మ ‘కులగోత్రాలు’ నిలచింది. ఏ.ఏ.కంబైన్స్ పతాకంపై ఏయన్నార్ సమర్పణలో కృష్ణంరాజు హీరోగా రూపొందిన ‘మంచిమనసు’ కూడా ప్రత్యగాత్మ నిర్దేశకత్వంలోనే రూపొందింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన “అమ్మకోసం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ, ముగ్గురమ్మాయిలు, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, గడుసు అమ్మాయి, కమలమ్మ కమతం” వంటి చిత్రాలు అలరించాయి.

· కె.పి.ఆత్మ పేరుతో హిందీలో “దో లడ్కియా, మెహమాన్, ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి, బచ్ పన్, తమన్నా, రాజా ఔర్ రంక్, ఛోటా భాయి” వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో కొన్ని సిల్వర్ జూబ్లీ చూడడం విశేషం. ప్రముఖ దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు, ప్రత్యగాత్మకు సోదరుడే. ప్రత్యగాత్మ తనయుడు కె.వాసు కూడా దర్శకనిర్మాతగా సాగారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘నాయకుడు -వినాయకుడు’ కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపైనే తెరకెక్కడం విశేషం. ఈ చిత్రం జయలలిత చివరి తెలుగు సినిమా కావడం మరింత విశేషం! తరువాత ప్రత్యగాత్మ సినిమాలకు దూరంగా జరిగారు. 2001 జూన్ 8న ప్రత్యగాత్మ తుదిశ్వాస విడిచారు.

భార్యాభర్తలు సినిమా సూపర్ డూపర్ హిట్ రాజేశ్వరరావు సంగీతం రసవాహినే ..కులగొత్రాలుఎన్ని సార్లైనా చూడాలని పిస్తుంది –అయ్యొయ్యో జేబులో డబ్బులు పోయెనే ‘’అనుకొంటూనే .రైలులో పాట మహాగొప్ప .పునర్జన్మ తెలుగు సినిమాకే పునర్జన్మ .మంచిమనిషిలో రామారావు జమున జోడీ ముచ్చట గా ఉంటె ‘’ఏమండోయ్ ఇటు చూడండి ‘’,అంతగా నను చూడకు ,రాననుకున్నావేమో పాటలు రసాలూరు రాజేశ్వరరావు బాణీలలో ఘంటసాల సుశీలమ్మల స్వర మాధుర్యం వర్ణనాతీతమే .పిబిశ్రీనివాస్ పాడిన ‘’ఓహో గులాబిబాలా ‘’యెదలో విషాదపు ముళ్ళు నాటుతుంది .కొసరాజు పాటలు గిలిగింతలుపెడతాయి పద్మనాభం నటనలో మాధవపెద్ది పిఠాపురం గొంతుకలలో ..పల్లెటూరి బావ నాగ్, లక్ష్మీ ల నటనా వినోదమే కృష్ణశాస్త్రి గారిపాటలు ఆణిముత్యాలు –‘’నేలతో నీడ అన్నది నన్ను తాకరాదనీ –నేడు ఒక భార్య భర్తతో అన్నదీ నన్ను తాకరాదనీ ‘’మంచి సందేశమిచ్చే పాట.ఇలా సెంటిమెంట్స్ ,ఎమోషన్స్ ఫామిలి టచ్ ,అన్నీ ఉన్న కుటుంబ కదా చిత్రాలు దర్శకత్వం చేసిన ప్రత్యగాత్మఅంటే ‘’అసలు సిసలైన నేను ‘’అనే ఆధ్యాత్మికార్ధం .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.