మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3
ఆప్టే భార్య భర్త కోరికప్రకారం చదవటం రాయటం నేర్చింది .అమ్మలక్కలు ఆమెను హేళన చేసేవారు .ఆమెను సభలకు సమావేశాలకు తీసుకు వెళ్ళేవాడు .ఆనాడు సనాతన కుటుంబాలలో నిబంధనలు అతి కఠినంగా ఉండేవి .దీనితో బడిలో చేరి చదవాలనే ఆమె కోరిక తీరలేదు .ఆనందాశ్రమం నుంచి వేరుపడి విడిగా కాపురం పెట్టాలని చాలా సార్లు భర్తపై ఒత్తిడి తెచ్చింది .పెద్దలకు కష్టం కలిగించటం హరికి ఇష్టం లేదు .మగపిల్లాడుపుట్టి మూడు నెలలలోపే చనిపోయాడు .రెండోసారి మగబిడ్డ పుట్టి ఆమె బాలింత జాడ్యం తో చనిపోయింది .ఏడువారాలు బతికి బిడ్డా చనిపోయాడు .మానసికంగా కు౦గిపోయాడు హరి .తన భార్యను రక్షించుకోలేకపోయినందుకు ప్రాయశ్చిత్తంగా పంచదార ,పాన్ మానేశాడు .నేలమీద చాపపై పడుకొనేవాడు .
వేసవిలో మహాబలేశ్వర్ లో గడపటానికి కనిత్కర్ దంపతులు ఆహ్వానించారు .అక్కడ ఉపశమనం పొందాడు .కనిత్కర్ భార్య సలహాపై మళ్ళీ చక్కర వాడుతున్నాడు .పండితుడు సంస్కర్తమాధవ్ గోవింద రానడే పరిచయమయ్యాడు .కనిత్కర్ దంపతులతోపాటు ఆప్టే కూడా ఇంటికి ఆహ్వానించాడు రానడే .ఆతడు మళ్ళీ పెళ్లి చేసుకొనే ఏర్పాటుపైరానడే ఆలోచిస్తే,కనిత్కర్ భార్య అంత తేలికకాదని చెప్పింది .ప్రజాహితకార్యక్రమాల్లో మునిగిపోయాడు .
1890అక్టోబర్ 4న గోపాలరావు జోషీ ‘’పంజాబ్ హౌస్ మిషన్ ‘’అనే క్రైస్తవ సంస్థ స్థాపించి ,పూనా క్రైస్తవమిషన్ సంస్థలో ఉపన్యాసం, టీపార్టీ ఏర్పాటు చేశాడు అప్పుడు ఆప్టే ఫాదర్ రివింగ్టన్ వద్ద ఫ్రెంచ్ నేర్చుకొంటున్నాడు .ఆసభకు రానడే తిలక్ గోకలే మొదలైన పెద్దలకు ఆహ్వానాలు వెళ్ళాయి .ఆప్టే దగ్గర బంధువు చనిపోతే ఆయన వెళ్ళలేకపోయాడు .పూనాలోని పూర్వాచార పత్రిక ‘’పూనావైభవ్ ‘’లో సభకు వచ్చినా రాకపోయినా అందరి పేర్లు వచ్చినట్లు వేసింది .ఇదొక దుమారంగా మారి 42 కుటుంబాలవారిని బహిష్కరించారు .దీనితో స్త్రీల జీవితం దుర్భరమైంది .శ్రోత్రియకర్మలకు ఆటంకం కలిగింది .ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి రానడే ముందుకు రావటం తో సమస్య పరిష్కారమైంది .హరి ఆ సమావేశానికి వెళ్ళక పోయినా వెళ్ళిన వారిగా ఆయన పేరు పత్రికలో వచ్చినందువలన తండ్రి కి కోపం వచ్చింది .వారింట అన్ని కార్యక్రమాలు బంద్ అయ్యాయి .ఈ మానసిక వ్యధతో హరి నాయనమ్మ చనిపోయింది .ఆమెకలలో కనిపించి తాను వెళ్ళిపోతున్నట్లు చెప్పగా ,మెలకువవచ్చి కిందకు వచ్చి టైం ఎంతయిందో వాకబు చేస్తే రాత్రి రెండు అని తెలియజేస్తే మరో నిమిషానికి నాయనమ్మ చనిపోయిందని కబురు వచ్చింది .ఆయన ఆనందాశ్రమం లో ఉంటూ భోజనానికి ఇంటికి వెళ్ళేవాడు .శంకరాచార్య విచారణ జరిపి హరి ఎలాంటి తప్పూ చేయలేదని సర్టిఫికేట్ ఇచ్చారు .ఆప్టే తండ్రి ఆప్టే ఆ సమావేశానికి హాజరుకాలేదని పత్రికా ప్రకటన ఇచ్చాడు .హరి పెత్తండ్రి ఎంతో పలుకుబడి ఉయోగించి పురోహితుని రప్పించి ముసలావిడ అపరకర్మలు యధా విధిగా జరిపించాడు .
రమాబాయి పూనాలో స్థాపించిన సేవాసదన్ స్త్రీజనాభ్యుదయానికి బాగా తోడ్పడింది అందరూ మెచ్చారు .తర్వాత ఆమె క్రైస్తవం తీసుకొని ,హిందూ బాలికలను క్రైస్తవులుగా మారుస్తుంటే రానడే వంటివారు ఆమెకు దూరమయ్యారు .1891 నాగ పూర్ కాంగ్రెస్ సభలకు వెడుతుంటే హరి అమ్మమ్మ ఆయనతో ‘’విధవా వివాహం చేసుకోను ‘’అని ఒట్టు వేయించింది బలవంతంగా ఆయన ఇష్టానికి, ఆదర్శానికి వ్యతిరేకంగా .త్వరగా మళ్ళీ పెళ్లి చేసుకోవటానికీ ఆయన ఒప్పుకోలేదు దీనితో తండ్రి ,పెత్తండ్రి దాదాపు ఆయనతో మాట్లాడటం మానేశారు .ఈ గండం గడవటానికి మిత్ర్డుడు ప్రొఫెసర్ పాన్ సే సాయపడి చోల్కర్ గారి చదువుకున్న అమ్మాయి వేణు తాయి తో నిరాడంబరంగా 1892లో వివాహం జరిపించేశాడు .కట్నం లేదు .పెళ్లికాగానే ఆమెకు రమా అని పేరుపెట్టాడు .ఎవరికీ కబురులేదు ఎవరూ రాలేదు .తర్వాత బెల్గాం లో కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు కొత్తదంపతుల్ని .
ఈ సంప్రదాయ వివాహ౦ రానడే ,స్నేహితులు కూడా నచ్చలేదు .ఆప్టే కూడా ఇబ్బందిగానే ఉన్నా సంస్కరణ పేరుతొ కుటుంబాన్ని విచ్చిన్నం చేసుకో కూడదు అని అభిప్రాయ పడ్డాడు .తీవ్రంగా గ్రంథరచనలో మునిగిపోయాడు .కొత్త పెల్లికూతురు ఆప్టే మేనత్త అధీనం లో కట్టడిలో ఉండాల్సి వస్తోంది .ఆమె ఆరోగ్యం గురించి ఆప్టే ప్రశ్నిస్తే అది ఇంట్లో వారికి తప్పుగా తోచేది .తన స్నేహితుడితో వైద్యం చేయించాడు .రోజూ కొంతదూరం ఆమె నడవాలని డాక్టర్ సలహా .దీనితోపాటు ఇంటిపనులు చేయాల్సి వచ్చేది .వాళ్ళిద్దరూ ఆన౦దాశ్రమం లో కాపురం ఉంటె బాగుంటుంది అని తండ్రి సూచించినా అమలుకాలేదు .1902లో ఇంటి అజమాయిషీ చేసే మేనత్త నంజు వ్యాధితో చనిపోయింది .అప్పుడు హరి పూనాలో ఉన్నాడు .ఆమె చావు అతనిభార్యకు మరింత భారం పెంచింది .జబ్బు పెరిగింది. ఆమెను ఆన౦దాశ్రమ౦ కు తీసుకు వెళ్ళాడు .నిరాశ విలయతాండవం చేసింది ఆయనలో .ఆమెకు శ్రద్ధగా సపర్యలు చేశాడు .1903లో ఆమె పూర్తిగా కోలుకొని గృహిణి జీవితాన్ని హాయిగా గడిపి అతనికి ఆశ్చర్యం కలిగించింది .తర్వాత దంపతులు తృప్తిగా సంతోషంగా గడిపారు .1905లో జబ్బు తిరగబెడితే లోనావాలకు తీసుకువెళ్ళాడు .1906లో కూతురు పుట్టింది .టైఫాయిడ్ వచ్చి కొన్ని వారాలు బాధపడి కోలుకోన్నది .బాలసారజరిగి పిల్లకు శాంతి అని పేరుపెట్టారు .జీవిత రధం గతుకులమార్గం నుంచి తిన్నని మార్గం లో ప్రయాణిస్తోంది .
హరినారాయణ ఆప్టే రోజూ ఉదయం 3 కే లేచి గ్రంథాలయం లో కూర్చుని రాసుకోనేవాడు .దాదాపు రెండు గంటలతర్వాట టీతాగి కూతురుతో ఆడుకొని ,స్నేహితులతోకలిసి కొండమీది పార్వతీ దేవి ఆలయందాకా నడక చేసి, మిత్రులతో ఉదయం 7-30కి ఇంటికి చేరేవాడు .ఉత్తర ప్రత్యుత్తరాలు చూసి వార్తాపత్రికలు.మేగజైన్లు చదివి ఆశ్రమం లో సన్యాసులను దర్శించి ,రెసిడెంట్ విద్యార్ధులతో మాట్లాడి ,విజిటర్స్ నుకలిసి అతిధులైన సన్యాసులను పూజించి ,10-30కి భోజనం చేసి ,ఆశ్రమపనులు ప్రచురణ ,ముద్రణ పనులు సాయంత్రం 5-30వరకు చూసేవాడు .మధ్యలో విశ్రా౦తిలభిస్తే గ్రంధ పఠనం చేసి 3కు టీ కోసం కాసేపు పని ఆపేవాడు .5తర్వాత స్నేహితులతోకబుర్లు పేకాట ,టీ,వర్తమాన రాజకీయాలు మాట్లాడటం తో కాలక్షేపం .స్నేహితులు వెళ్ళాక రాత్రి 8కి భార్యా కూతురుతో గుర్రం బండీలో పట్నానికి వెళ్ళేవాడు .రాత్రి భోజనం తర్వాత తుకారాం అభంగాలతో భజనపాటలు పాడేవాడు .మత గ్రంథాలు, సమర్ధ రామదాసస్వామి రాసిన ‘’దాస బోధ’’ నిత్యం చదివే వాడు .రాత్రి పెందరాళే నిద్రపోయేవాడు .ఇదీ ఆయన నిత్యకృత్యం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.