కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన
వడ్డారాధన మతపూర్వ యుగ కృతి .చతుర్విధ ఉపసర్గలను విని ,ముక్తి పొందిన 19 జైన మహాపురుషులకధలు ఇవి .దీనికి ‘’ఉపసర్గ కేవలుల కధలు ‘’అనే పేరు కూడా ఉంది .దీన్ని క్రీ శ 920లో శివ కొత్యాచార్యుడు రచించాడని మొదట అంతా అనుకొన్నారు .కానీ డా హం .ప .నాగరాజయ్య చేసిన పరిశోధన ఫలితంగా కన్నడం లో దీనిపేరు ‘’ఆరాధనా కర్నాట టీక ‘’అనీ ,కర్త క్రీ.శ 800 నాటి భ్రాజిష్ణు అని తేలింది.ఇదికూడా ప్రాకృతి రచన ‘’మూలారాధన ‘’కు కన్నడ అనువాదం .భ్రాజిష్ణుడు రాష్ట్ర కూట రాజుల రాజధాని మాన్యకటకం అనే మలఖేడ వాసి ..వడ్డారాధన ప్రాకృత పదం అయిన ‘’బృహదారాధన ‘’కు రూపాంతర పదం .కర్త ఆరాధన కర్నాటక టీకా అని రాసినా జనం లో వడ్డారాధన అనే పేరుతోనే బాగా ప్రచారమైంది .ఈఆరాధన ,మూలా రాధనా ,భగవతీ ఆరాధన అనేది క్రీస్తు శకం ఒకటవ శతాబ్దిలోనే ప్రారంభమైంది .దీనిమూల భాష ‘’జైన సూర సేన ప్రాకృతం ‘’.ఇందులో 40అధికరణాలు ,40 శీర్షికలు ఉండి,జైనముని ఆచారాన్ని తెలియ జేస్తోంది .కథలన్నీ రెండు వరుసలలో అమరి ఉంటాయి .35వది కవచాధికరణం . కష్టాలను గెలిచే సామర్ధ్యమే కవచం .ఈ కవచార భాగాన్నే భ్రాజిష్ణు కన్నడం లోకి అనువదించాడు .మూలాధారానికి వ్యాఖ్యానాలు,కథా కోశాలు ఉన్నాయి .శ్రీ చంద్ర –కథాకోశ –అప భ్రంశ ,ప్రభా చంద్ర-కథాకోశ- సంస్కృత ,నేమికోశ –కథా కోశ –సంస్కృతం రాశారు .హరి సేనుడి కథాకోశం లో 157 కథలున్నాయి .దీని కథనం భావం వడ్డారాధన తో సరిపోలుతుంది .జాతక కథలు ,శివ శరణ కథలు,జైన కథలు ఒకే కోవలోనివే .కథలలో ఉద్దేశ్యం ధార్మికం కనుక ,నిరూపణలో వైవిధ్యం కనిపించదు .వడ్డా రాదన లో ఆకాలపు జనజీవన వివరణ కన్పిస్తుంది .
వడ్డారాధన కన్నడ సాహిత్యం లో మొట్టమొదటి సాహిత్య గ్రంథమే కాకుండా ,మొదటి గద్యకావ్యం కూడా .ఇందులో సుకుమారస్వామి అనే జైనముని నుంచి వృషభ సేనుని వరకు జైనమునుల 19 కథలున్నాయి .ప్రతి కథకు ముందు ఒక ప్రాకృతగాథ ఉంటుంది .ఇవి ఆరాధన లోనివే .ఆత్మ శుద్ధి కోసం చేసే ప్రయత్నమే ఆరాధన .ఆరాధన గ్రంథాలలో శివాచార్యుని గ్రంథ౦ ఉత్తమమైనది .దీనిలో రెండు వేలకు పైగా ప్రాకృత గాథలున్నాయి.
వడ్డారాధన రచన కాలానికి కన్నడ ,తెలుగులకు ఒకే లిపి ఉంది .వ్యాకరణం ఛందస్సుకూడా ఒకేరకం సాంఘిక మత విషయాలలోనూ ఐక్యత ఉండేది.,ప్రాచీన కన్నడం లో గద్యకృతులున్నాయని ‘’కవిరాజ మార్గ కారుడు ‘’చెప్పినప్పటికీ ,అవి అలభ్యాలు .చాము౦డరాయ పురాణం ,ముద్రా మంజూష ,నో౦పియకథలు ,రాజావళి కథా సార మొదలైనవి కన్నడ గద్య రచనలే కాని వడ్డారాధన ఒక్కటే కన్నడ సాహిత్యం లో విశిష్టకృతి అనిపించుకొన్నది .తెలుగులో కంటే కన్నడం లోనే ముందు కావ్య రచన జరిగింది .రాష్ట్రకూట సామంతరాజు వేములవాడ చాళుక్య వంశానికి చెందిన ఆంధ్ర మహారాజు అరి కేసరి కన్నడ ఆదికవి పంపమహాకవి ని పోషించాడు .మౌర్య చంద్ర గుప్తునికాలం లో భద్ర బాహుముని దక్షిణ భారతం లో జైనమతాన్ని వ్యాప్తి చేశాడు .చాళుక్యులు ,రాష్ట్రకూటులు జైనాన్ని ఆచరించారు .కమ్మనాటిలో రాష్ట్రకూట చక్రవర్తి సామంతరాజు పుంగనూరు పాలకుడైన మల్లపయ్యరాజు కన్నడకవి ‘’రన్నకవి ‘’నిపోషించాడు .చాళుక్యరాజులు జినభవనాలు కట్టించారు .జైనులకు అనేక దానాలిచ్చినట్లు శాసనాలున్నాయి .
రాజరాజ నరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు జైనమతావలంబి ,త్రికాల యోగి శిష్యుడుకూడా ..విశాఖజిల్లా రామ తీర్ధం లో విమలాదిత్యుని కన్నడ శాసనం ఉంది .రాజరాజ నరేంద్రుని కొడుకు కులోత్తుంగ చోళుడు జైనమతాన్ని ఆదరించినట్లు గుంటూరులో దొరికిన శాసనాలు చెబుతున్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-21-ఉయ్యూరు
—

