మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226
226-మల్లీశ్వరి సినిమాలో పెద్దనామాత్యుడు ,రేడియో అన్నయ్య ,బాలానందం స్థాపకుడు –న్యాపతి రాఘవరావు
226 న్యాపతి రాఘవరావు (ఏప్రిల్ 13, 1905 – ఫిబ్రవరి 24, 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు, రచయిత.[1] – చాలామంది న్యాయపతి రాఘవరావు అని పొరబాటు పడుతారు .న్యాపతి రాఘవరావు అనేదే కరెక్ట్.వికీపీడియాలో కూడా పొరబాటున న్యాయపతి అనే రాశారు .
న్యాయపతి సుబ్బారావు ఆంద్ర భీష్మ బిరుదాంకితులు .స్వాతంత్ర్య సమరయోధులు .సంస్కరణ వాది,సాహితీ వేత్త
న్యాపతి రాఘవరావు  బిఎన్ రెడ్డి తీసిన మల్లీశ్వరి సినిమాలో పెద్దనామాత్యుడు గా నటించాడు .ఆతర్వాత నకా ఏమైనా సినిమాలలో నటించారో లేదో తెలియదు .మల్లి నాగరాజు లు ఒక సాయంత్రం బందీ మీద సంతకు వెళ్లి ,మాంచి గాలీవాన లో ఒక గుహలో తలదాచు కొంటారు అప్పుడు మల్లీశ్వరి అయిన భానుమతి కాలక్షేపం కోసం ‘’పిలచినా బిగువటరా ‘’జావళి పాడుతూ ,అభినయిస్తుంది .అనుకోకుండా కృష్ణ దేవరాయలు (శ్రీ వాత్సవ ),పెద్దనామాత్యుడు (న్యాపతి రాఘవరావు )అక్కడికి వస్తారు .మల్లి నృత్యం వారిద్దరికీ కనులపండువుగా కనిపిస్తుంది .అప్పుడు పెద్దన ‘’భళిరా ఎన్నాడుజారే నీ భువికి ‘రంభా రాగిణీ రత్నమేఖలయో ’అనే పద్యం ఆమెను గురించిపాడుతాడు .కృష్ణశాస్త్రి గారి రచన ఇది .
విశేషాలు
1905వ సంవత్సరం ఏప్రిల్ 13 న ఒరిస్సాలోని బరంపురం లో జన్మించాడు. తండ్రి న్యాపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసాడు. 1934 లో కామేశ్వరితో పెళ్ళయింది. రేడియో అక్కయ్యగా ప్రుగాంచిన న్యాపతి కామేశ్వరి ఈమెయే. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
రేడియో అన్నయ్య
డిగ్రీ అయ్యాక, మద్రాసు లో ది హిందూ పత్రికలో విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల తరువాత, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపై చేరాడు. ఆ రోజుల్లో బీ.బీ.సీ లోని పిల్ల కార్యక్రామాల తరహాలో మనదేశంలో కూడ రేడియో చిన్న పిల్లల కొరకు రేడియో ప్రసారలను ఆరంబించాలని అప్పటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది. మద్రాసు రేడియోలో పిల్లల కార్య క్రమాలను దుర్గాబాయి దేశముఖ్ నిర్వహించేవారు. 1933 లో రాఘవ రావు, కామేశ్వరి జంటకు ఆ అవకాశం వరించింది. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందారు. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్…….. పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్య గా పేరొందారు. రేడియోలో పనిని వారు ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంగా భావించారు.
ఆటవిడుపు కార్యక్రమానికి శ్రోతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఆ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల సంఖ్యకూడా ఎక్కువ కావటంతో పది సంవత్సరాలలోపు పిల్లలకి శనివారం బాలానందం అనీ, పది సంవత్సరాలు పైబడిన వారికి మరో కార్యక్రమం పెట్టి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఈ రేడియో అన్నయ్య ఎంతో కృషి చేశాడు. వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాట కనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవాడు. వాస్తవానికి ఆ కార్యక్రమం కోసం పిల్లలకన్నా పెద్దలే ఆతృతగా వేచి చూసేవారు.
రచనలు
రేడియో అన్నయ్య సృష్టించిన పాత్రల్లో మొద్దబ్బాయి, పొట్టిబావ, చిట్టిమరదలు, దొడ్డమ్మ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, పిల్లలకే స్వరాజ్యం వస్తే, చీమ కథ, ఏనుగొచ్చిందేనుగు, బడి గంట, మడతకుర్చీ, రామూ సోమూ, పిల్లల దొంగ ఇంకా అనేక హాస్య నాటికలు, గమ్మత్తు నాటికలు, చిట్టి నాటికలు దాదాపు పన్నెండు వందలకు పైగా రచించి వాటిని పిల్లలతో వేయించాడు. దాదాపు పది చలన చిత్రాలలో కూడా పిల్లలచే వేషం వేయించాడు. అనేక గ్రామఫోను రికార్డులు ఇచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎవరూ, ఏ సంస్థా , ఏ ప్రభుత్వమూ చేయనంత కృషి సలిపాడు. 1940లో మద్రాసులో ఆంధ్ర బాలానంద సంఘం స్థాపించాడు.
బాలల కోసం పత్రిక
రేడియో కార్యక్రమాల అనంతరం అన్నయ్య చేపట్టిన మరో బృహత్కార్యం బాలల కోసం “బాల” పత్రిక ను ప్రచురించడం. అంతవరకూ పిల్లల కంటూ ఒక పత్రిక లేదు. బాలకేసరి అనే పత్రిక కొంతకాలం వచ్చినా అది వెంటనే ఆగిపోయింది. రేడియో అన్నయ్య పిల్లల పత్రిక అవసరం గుర్తించి 1945లో బాల పత్రిక స్థాపించి బాల సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశాడు. అది అపారమైన ప్రభావాన్ని చూపింది.
ఆంధ్ర బాలానంద సంఘం
రేడియో అన్నయ్య స్థాపించిన ఆంధ్ర బాలానంద సంఘం విజయభేరి మ్రోగించింది. 1956లో హైదరాబాదు లో బ్రాంచి కూడా వెలిసింది. అనంతరం ఈ విజయం గ్రహించి బాలబాలికల పత్రికల సంఘాల అవశ్యకతను గుర్తించి అనేక బాలానంద సంఘాలు ఏర్పడ్డాయి. బాలపత్రికలు ఎన్నో వెలిశాయి. జవహర్ బాలభవన్ (1966), ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ (1976) స్థాపనకు ఆయన విశేషమైన కృషి చేశాడు. ఆ సంఘంలో అనేక చక్కని కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. సంగీతం , నాట్యం, నాటకం, మేజిక్. హిప్నాటిజం రంగాల్లో కూడా శిక్షణనిస్తూ అదొక బాలల దైవమందిరంగా అలరారుతోంది.
బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాపతి రాఘవరావుకు సంతానంలేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యల కున్న లక్షల ఆస్తిని ఆంధ్ర బాలబాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఆయన ఆశయానికి రూపకల్పనయే ప్రభుత్వం స్థాపించిన బాలల అకాడమీ.
మరణం
బాలానందం రేడియో అన్నయ్య 1984 ఫిబ్రవరి 24 న స్వర్గస్థుడైనాడు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.