మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్  కోడి రామ మూర్తి నాయుడు

మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్  కోడి రామ మూర్తి నాయుడు

— కోడి రామ్మూర్తి నాయుడు (1882 – 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు, మల్లయోధులు.[1][2] ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.[3]

బాల్యము
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతోవిజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.* విజయనగరం జిల్లా వెబ్ సైటులో కోడి రామ్మూర్తిని గురించిన వ్యాసం

సర్కస్ కంపెనీ
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.

ప్రముఖులు ఇచ్చిన బిరుదులు[మార్చు]
పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.
హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదమిచ్చారు.
అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూచి ఆనందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.
విదేశాలలో ప్రదర్శన
సర్కస్ కంపెనీ బాగా పెరిగింది. రామమూర్తిగారు 1600 మంది గల తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు ఇమామ్‌ బక్షీ ఆ బృందంలో వుండేవాడు.

లండన్లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత ‘ఇండియన్ హెర్కులస్’ బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.

స్పెయిన్ దేశంలో ‘కోడె పోరాటం’ (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ‘ సరే ‘ అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.

జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.

బర్మాలో వున్నపుడు రంగూన్లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.

భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. అమెరికా వెళ్ళాలనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో ఉన్నారు. ఆయన శాకాహారి. భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.

కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.

చివరిరోజులు బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు.[4] తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, ‘కలియుగ భీమ’ కోడి రామమూర్తి నాయుడుగారు.

వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావుగారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ ” సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి ” అన్నారు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.

శ్రీకాకుళంలో స్థాపించిన కోడి రామమూర్తి విగ్రహం
బలప్రదర్శన విశేషాలు[మార్చు]
గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.
బిరుదులు

కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ‘ఇండియన్ హెర్క్యులెస్’ అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.[5]

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.