రాంగేయ రాఘవ -2

రాంగేయ రాఘవ -2
వ్యక్తిగతం-యుగసందర్భం
రా౦గేయరాఘవ పూర్వీకులు సుమారు రెండున్నర శతాబ్దాలకు పూర్వం దక్షిణ ఆర్కాడు నుంచి రాజస్థాన్ సరిహద్దు గ్రామాలైన వైర్,వారౌలీ జాగీరు క్షేత్రాలలో స్థిరపడ్డారు .ఆ వంశం లోనిశ్రీనివాసాచార్యుల పాండిత్యానికి మెచ్చి జైపూర్ మహారాజు ఒక జాగీరు ను ఇచ్ఛి ,రామాలయం కట్టించి ఆయన్ను అర్చకుడిగా నియమించాడు అంటే అగ్రహారీకుడుయ్యాడు .తమిళ సంస్కృత పండితుడు రంగా చార్యులు ఈ వంశం వాడే .ఈయనకు రాఘవ 17-1-1923న జన్మించాడు .తల్లి కనకవల్లి తమిళ సంస్కృతాలలో ,వ్రజభాషలో దిట్ట .ముగ్గురు సోదరుల్లో రాఘవ చివరి వాడు కనుక గారాబంగా పెరిగాడు .మేనత్త అక్కాజీ వ్రజభాషలో విదుషీ మణి.భర్త దేశికాచార్యులు వేద,వేదాంగాలలో అసమాన ప్రావీణ్య మున్నవాడు .శాస్త్ర చర్చల్లో అక్కాజీ కూడా పాల్గొనేది .ఇది రాఘవ పై గొప్ప ప్రభావం చూపింది .. రాఘవ అసలుపేరు ‘’తిరుమలైనంబాకం వీర రాఘవాచార్య ‘’.ఈపేరు స్కూలు, కాలేజీ రికార్డ్ లలో ఉంది .అతడి సన్నిహిత మిత్రుడు భరత్ భూషణ్ అగర్వాల్ సూచనతో తండ్రి పేరు కలిసి వచ్చేట్లు’’ రా౦గేయ్ రాఘవ్ ‘’గా మార్చుకొన్నాడు .తర్వాత రచనలన్నీ ఈ పేరుతోనే రాశాడు .ఇంగ్లీష్ మీడియం లోనే చదివాడు .ఆగ్రా విక్టోరియా స్కూల్ లో ప్రాధమిక విద్య ,,సెయింట్ జాన్స్ కాలేజిలోడిగ్రీ చదివాడు .1941లోతత్వ శాస్త్రం ఆర్ధిక శాస్త్రం ఇంగ్లీష్ సబ్జెక్ట్ లతో డిగ్రీ పొందాడు .అప్పుడే ఆర్ధిక శాస్త్ర పాఠాలు ఎగగొట్టి ‘’ఘరౌందా’’నవల రాశాడు .1943లో హిందీ లొఎమ్. ఎ .అయ్యాడు .ప్రొఫెసర్ హరిహర నాధ టాండన్ మార్గ దర్శకత్వం లో ‘’భారతీయ మధ్యయుగాలలో సంధికాల అధ్యయనం-గోరఖ్ నాధ యుగం ‘’ పై పరిశోధన చేసి ఆగ్రా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పొందాడు .పరిశోధన సామగ్రికోసం శాంతి నికేతన్ వెళ్లి అక్కడి ద్వివేదీ ‘’నాధ సంప్రదాయం ‘’పై రాసినా,అచ్చు వేయకపోవటం తో రాఘవకిచ్చాడు .అక్కడే అధ్యయనం చేసి కావాల్సిన విషయాలు తీసుకొన్నాడు రాఘవ .గొప్పలకోసం ఈ డిగ్రీని ప్రదర్శించలేదు రాఘవ .అది తాత్విక చిన్తనాధార గ్రంథం.
1937లో ‘’సాప్తాహిక్ విశ్వామిత్ర ‘’పత్రికలో రాఘవ మొదటి గీతం పడింది .ఇదేఅతడి భవిష్యత్తు నిర్ణయించింది సాహిత్య వ్యాసంగాన్ని జీవనాదారంగా ఎన్నుకోన్నాడు .ఆర్ధిక ఇబ్బందులెన్ని ఎదురైనా ఈ దారి వదలలేదు .రచయితగానే స్థిరపడాలనుకొని స్థిరపడ్డాడు .అన్ని ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశాడు .ఇది అంకిత భావంతోసాధించిన విజయం .’’సాహిత్యాకాశం లో రా౦గేయ రాఘవ ఉదయించటం ,అందరికి ఒక తోకచుక్క కాంతి కెరటం లా తోచింది ‘’అన్నాడు ఆయన ప్రొఫెసర్ ప్రకాశ చంద్ర .
రాఘవ ఉంటున్న గ్రామం వైర్ లో కరెంటు లేదు .వేసవి రాత్రులలో దోమతెరలలో లంటారు వెలిగించుకొని జాగారం చేస్తూ రచనలు చేసేవాడు .అందుకే పెళ్లి ఆలోచన రాలేదు . మేడమీద గుడ్డ పంఖాతాడుతో లాక్కొంటూ ఉక్కపోత నుండి తప్పించుకొనే వారు .రాఘవ అలాంటి తాడును కాలి వేళ్ళకు కట్టుకొని లాగుతూ ,బోర్లాపడుకొని రచనలు చేసేవాడు .రాఘవ 33వ ఏట తనకన్నా 14ఏళ్ళు చిన్నదైన సులోచనతో1956లో పెళ్లి జరిగింది .ఇదీ అంత తేలిగ్గా జరగలెదు.ఒకసారి ఒక అయ్యంగార్ల అమ్మాయిశకుంతల ను తనకోసం చూస్తె తన అన్నటిఎల్ఎన్ఆచార్య కు ఇప్పించి పెళ్లి చేయించాడు .అనేకసార్లు సులోచనతో మాట్లాడి తన రచనా వ్యాసంగానికి ఆమె అడ్డు పడదు అని హామీ పొందాకనే మెట్రిక్ చదివిన ఆమె ను పెళ్ళాడాడు .బొంబాయి మాతు౦గాలో వీరి వివాహం 7-5-1956న అతి సామాన్యంగా జరిగింది .ఆరేళ్ళ దాంపత్యం లో వీరిద్దరూ కలిసి ఉన్న కాలం చాలా తక్కువే .రాఘవ కోరిక ప్రకారం బొంబాయిలోనే ఉంటూ ఇంటర్ డిగ్రీ పూర్తీ చేసింది .ఇది ఆమె కు తర్వాతకాలం లో బాగా ఉపయోగపడింది .వీరిఏకైక సంతానం సీమంతిని వయసు రాఘవ తన 39వయేట మరణించే నాటికి కేవలం నాలుగేళ్ళు మాత్రమె .తల్లి కనకవల్లి తో రాఘవకు విడదీయరాని అనుబంధం .ఆమె కేన్సర్ తో 1959లో చనిపోయింది .
రాఘవ 1960లో జైపూర్ వచ్చేనాటికి ఆయన మెడమీద ఒక రాచపుండు ఏర్పడి అది ఆగ్రా వెళ్ళినా నయంకాక ,మళ్ళీ జయపూర్ వచ్చాక జర్మనీ డాక్టర్ హైలింగ్ అది కేన్సర్ అని తేల్చాడు .తర్వాత బాంబేలో టాటా హాస్పిటల్ లో రాఘవ చేరగా ,డాక్టర్ జస్సావాలా బ్లడ్ కాన్సర్ గా గుర్తించి ,చాలాజాగ్రత్తగా చికిత్సలు చేసినా ,12-8-1962మిట్ట మధ్యాహ్నం రచనా భాస్కరుడు రాఘవ అమాంతంగా అస్తమించాడు .క్వీన్స్ రోడ్ లో చందన్ వాడి స్మశాన వాటికలో వానపడుతుండగా అంత్యక్రియలు జరిపారు .
తక్కువకాలం లో ఎక్కువ రచనలు చేసిన అతికొద్దిమందిలో రాఘవ ఒకడు .రాఘవ 39నవలలు,వెయ్యేసి పేజీలున్న రెండుసంపుటాల ‘’మహాయాత్రా ‘’అనే బృహత్ రచన ,అ౦దులోఅపూర్వ గాధలు ,వాటి చారిత్రిక వివరణలు ,ఉన్నాయి ఆయనవి ముద్రితాలైన కథలు 30ఉన్నాయి .అజేయ్ ఖాన్దహార్ , మేధావి ,పాంచాలి కావ్యస్మృతులు ,చారిత్రిక నేపధ్యంలో రాసిన నాటకాలు ,బెంగాల్ కరువు పై రిపోర్ట్ ల సంకలనం ‘’తుఫానోం కే బీచ్ ‘’చారిత్రిక ,సామాజిక శాస్త్ర విశ్లేషణలు గ్రీకు నాటకాలు షేక్స్ పియర్ నాటకాలు గాల్స్ వర్త్ ,శూద్రక కాళిదాస విశాఖదత్త ల రచనానువాదాలు ప్రముఖంగా ఉన్నాయి .సాహిత్య విమర్శలో వివాదాస్పద రచనలు చేశాడు .జీవిత వేగం లో ఆయన ఎక్కడా కుదురుగా లేడు.రచనలు చేస్తూ అలసిపోతె,దేవకీ నందన నవలల ప్రస్తావన తెచ్చుకొని చదివి సేద తీరేవాడు మిత్రులకు సరదాగా నవ్వులాటకోసం ‘’మీ రా౦గేయ్ రాఘవ్ ‘’అని మొదలు పెట్టి రాసేవాడు .
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -30-4-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.