విశ్వ పుత్రిక తోరూ దత్-6
తోరూ బాల్యం
కలకత్తా మధ్యలో మాణిక్ తలావీధిలో రామబాగన్ లో తొరూ దత్ 4-3-1856 న పుట్టింది .పెద్ద వాడు అబ్జూ పుట్టి 14ఏళ్ళకు ,అక్క ఆరూ 1854లో పుట్టిన 20ఏళ్ళకే చనిపోయారు . .తొరూ 21ఏళ్ళు మాత్రమె బతికి 30-8-1877న మరణించింది .గోవిన్ దత్ కుటుంబమంతా కారన్ వాలీస్ స్క్వేర్ లో ఉన్న చర్చిలో మత పరివర్తనం పొందారు .పిల్లలు ముగ్గురికి బాబూ సాహెబ్ చందర్ బెనర్జీ టీచర్ .ఆయన మేనకోడలు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడైన w.c.బెనర్జీ భార్య .బాబూ సాహెబ్ దగ్గరే మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ మొదటి మూడు భాగాలు చదివారు .ముగ్గురికిఅదంతా కంఠతా వచ్చు.అక్క చెల్లెళ్ళు పియానోతోపాటు ఇంగ్లీష్ సంగీతాన్ని మిసెస్ సెనేస్ వద్ద నేర్చారు .మంచి సంగీతకారులుగా గుర్తింపు పొందారు .విశాలమైన ఇల్లు తోట నౌకర్లు చాకర్లు బంధువులతో వాళ్ళ బాల్యం హాయిగా గడచిపోతుండగా 1865లో అన్న అబ్జూ అకస్మాత్తుగా చనిపోయి భరించరాని దుఖాన్ని కలిగించాడు .కొడుకు మరణం తో కుంగిపోయిన తండ్రి మిగిలిన ఇద్దరు పిల్లలనీ కోల్పోతానేమో అనే బెంగ ,భయం పెట్టుకొన్నాడు .కోడుకుపై ఒక కవిత రాశాడు –‘గడిచే రోజుల్ని బరువుగా లేక్కేస్తూ –అలసిన మనసుతో –ఒంటరిగా గుండెలు పగిలి మిగిలిపోయాను ‘.దైవాన్నే నమ్మాడు .తన సంతానం గురించి రాసిన కవితలో ఆయన –‘’జనముద్దు బిడ్డ నా పెద్దకొడుకు –ఆంతర్యం లో పసివాడు –వాడి వయసులో అంత ఎత్తు ఎదిగిన వాళ్ళు లేరు –ఇంటికి దీపం నా రెండో బిడ్డ –గుండెనిండా బెరుకూ భయమూ –తటాలున ఎర్రబడే బుగ్గలు –నిటారుగా తీర్చిన కనుబొమలు –ఆమె తీరు నిర్మలం గంభీరం –సాయం సంధ్యానక్షత్రకా౦తిలాగా శాంతం సుందరం –చిట్ట చివరిబాల-అర్భకంగా అచ్చర కూనలా –అందాలు చిమ్మేపసిపాప –‘’
1869లో చలికాలం లో యూరప్ వెళ్లేముందు కలకత్తాలో ఆకుటుంబం కొంతకాలం గడిపి౦ది .అక్కడి తోటలో ఇల్లు అంటేతోరూకు బాగా ఇష్టం అద్భుతమైన కవిత్వం ఆక్కడి ప్రకృతిపై రాసింది –‘’బ్రహ్మ రాక్షసుల్లా అశ్వత్ధ వృక్షాలు జడలుకట్టిన గచ్చ తీగేలపోదలు – అడవి ద్రాక్ష తీగ గుంపు –గ్రామ్యవనితల భూషణాలై –ఆర్యకవితను వాసికెక్కిన –శిరీష కుసుమ సందడి –అదంతా పచ్చదనాల కడలి –తూర్పున నిలుచున్నా వెదురు పొదల సౌందర్యాన్ని మించింది ఏదీ లేదు –సృష్టి ఆదిలో ఈడేన్ తోటను చూసిన ఆనందం ‘’ఇలాంటి బాగ్ మరీ తోటలో గడిచిన బాల్యం ఆమెది .మిస్ ఎలిజబెత్ కాటన్ తోరూ కు వీరాభిమాని .తోరూచనిపోయిన 30 ఏళ్ళకు వచ్చి అదంతాచూసి ఆమె కవిత్వాన్ని ఆతోట సౌందర్యాన్నీ వాటిని ఆమె వర్ణించిన తీరుకు అప్రతిభురాలైంది .
తొరూ ఆరూ లకు ఫ్రాన్స్ అంటే బాగా ఇష్టం .ఫ్రెంచ్ వాళ్ళు తోరూను ఫ్రెంచ్ అమ్మాయి అనే అనుకొనేవారు .ఫ్రాన్స్ అంటే ప్రాణంగా భావించింది ఆతర్వాత భారతదేశం పై నెమ్మదిగా ఆరాధన కలిగింది తోరూ కు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-22-ఉయ్యూరు