గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-21
ఖైదీలను చిత్ర హింస పాలు చేస్తున్న ప్రభుత్వాన్ని కార్మిచెల్ తీవ్రంగా వ్యతిరేకించినందుకు 1917మార్చి లో ఇండియా వదిలి పెట్టి వెళ్ళాల్సి వచ్చింది .పోలీస్ రాజ్ ను నిరంతరం వ్యతిరేకించే మోతీలాల్ ఆయనతో కలిసి అరెస్ట్ అయిన యువకుల విడుదలకు మధ్యవర్తిత్వం నడిపాడు .అతడు వెళ్ళిపోయే సమయానికి 800మంది ఇంకా జైలులో మగ్గి ఉన్నారు .అతని స్థానం లో రోనాల్డ్ షీ వచ్చాడు .విప్లవోద్యమాన్ని అణచి వేయటం తప్ప గత్యంతరం లేదని భావించాడు .
పరిణామాల సంవత్సరం
1917 మాంటేగ్ సంస్కరణలతో పాటు ఎన్నెన్నో పరిణామాలు తెచ్చిన సంవత్సరంగా గుర్తుండిపోయింది .ఇండియాలో కుట్రలు తిరుగుబాట్లు గురించి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వటానికి బ్రిటన్ నుంచి వచ్చిన జస్టిస్ వాలార్ట్ కమిటీ ఏర్పాటైంది .ఈ రెండు భారత స్వాతంత్ర్య పోరాటం నిర్దుష్టమైన రూపం దాల్చాటానికి తోడ్పడ్డాయి.మోతీలాల్ కు పత్రికకు ఇవి కొత్త కష్టాలను తెచ్చాయి .1917మే 22 న ఆయనపై కోర్టు ధిక్కరణ నేరం మోపారు .కోర్టే ప్రాసిక్యూటర్ అయిఅనప్పుడు ఆరోపణమీద విచారణ కు ఆకోర్టు కు అధికారం లేదని ప్రముఖ న్యాయవాదులు ఆరోపించారు .చివరికి సాక్షాధారాలు లేకపోవటం తో కేసు వెనక్కి తీసుకొన్నది ప్రభుత్వం .ఇది మోతీలాల్ కు డైరెక్టర్ లకు లభించిన ఘన విజయం . 1915మొదట్లో గాంధీ తనగురువు గోఖలే మరణానికి ముందు రెండేళ్ళు దక్షిణాఫ్రికాలో ఉండి, ఇండియా వచ్చాడు .దక్షిణాఫ్రికాలో తాను విజయం సాధించిన అహింసా యుత పోరాటం ఇండియాలోనూ విజయాన్ని సాధిస్తుందని గాంధీ భావించాడు .1917ఏప్రిల్ లో బీహార్ లోని చంపరాన్ జిల్లా ముఖ్యపట్టణం మొతీహారి కి గాంధీ వచ్చాడు .నీలి రైతుల పక్షాన నిలిచి ధైర్యం చెప్పాడు ఆయన్ను అక్కడి నుండి వెళ్ళిపోవాలని పోలీసులు వత్తిడి చేసినా వెళ్ళలేదు .ఆయనపై కేసుపెట్టి విచారించగా ,తన తప్పు ఏమీలేదని ,కావాలంటే తనను శిక్షించవచ్చునని కోర్టు ను సవాల్ చేశాడు .అంతరాత్మ ప్రబోధం అనే అత్యున్నత న్యాయ సూత్రానికి అది విరుద్ధం అన్నాడు .మేజిష్ట్రేట్ కంగుతిని వాయిదా వేసి గవర్నర్ ను సలహా ఇవ్వమని కోరాడు .గాంధీ నిర్భీకతను ఆయన్ను హీరోగా ప్రజలముందు నిలబెట్టింది .గవర్నర్ ఎందుకైనా మంచిదని కేసు ఉపసంహరించాడు .గాంధీ మాత్రం రైతులతో బుజం కలిపి సమస్యలు అధ్యయనం చేసి ,ప్రభుత్వం తో దర్యాప్తు కమీషన్ వేయించి ,నీలిపె౦పకం దార్ల ఇష్టా రాజ్యానికి స్వస్తి పలికించాడు .
సత్యాగ్రహ శక్తి జనసామాన్యానికి బాగా అర్ధమైంది .అహింసా మార్గం లోనే దేనినైనా సాధించాలని మోతీలాల్ మొదటి నుంచి నమ్మాడు .గాంధీ విజయం ఆయనకు మరింత హుషారిచ్చింది .బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి సారి గాంధీజీ ఇక్కడే చంపారాన్ లో కలిశారు .చంపారాన్ పొత్తిళ్ళలో స్వాతంత్ర్య పోరాట బిడ్డ ఎదుగుతూ ఉంటె ,మాంటేగు తర్వాతి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు .ప్రభుత్వం శాలాట్ కమిటీని వేసింది .ప్రపంచ మంతటా విప్లవ బీజాలు వ్యాప్తి చెందాయని గ్రహించారు .భారత సైన్యం లో సిక్కులు పంజాబ్ పేదరైతాంగం కూడా విప్లవం లో పాలుపంచుకొనే ధోరణి ప్రబలమైంది .
ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికా కెనడాలకు వలసపోయిన భారతీయులు ముఖ్యంగా సిక్కులు ‘’గదర్ పార్టీ ‘’స్థాపించారు .బెంగాల్ లోని ‘’యుగంతర్ పార్టీ’’ తో సంబంధాలు పెట్టుకొన్నారు .మొదటి ప్రపంచయుద్ధం మొదలవగానే ఈ సిక్కులు బ్రిటిష్ ప్రభుత్వం పై సాయుధ పోరాటం చేయటానికి ఇండియా వచ్చారు .కానీ ఈ భారీ పధకం నీరు కారిపోయింది .అయినా వారి ప్రయత్నాలు ఆగలేదు .1916చివరకు ఈశక్తులు పూర్తిగా క్షీణించి పోయాయి .యుద్ధం లో మిత్రరాజ్యకూటమి గెలుపు గ్యారంటీఅని తేలింది .సంస్కరణలు ప్రకటించే వరకు ప్రభుత్వానికి సహనం నశించింది .అణచి వేస్తె ప్రజలు కుక్కిన పేనులుగా ఉంటారన్న గర్వం పెరిగింది .రౌలట్ నివేదిక ప్రభుత్వాన్ని సంతృప్తి పరచేట్లుగా తయారైంది .రీఅప్పీల్ కు అవకాశం ఇవ్వలేదు .మాంటేగు సంస్కరణలకు ము౦దేరౌలట్ సంస్కరణలు వచ్చి సంస్కరణలకు గండి కొట్టింది .తెల్ల ప్రభుత్వ కుత్సితఉ ద్దేశ్యాలు ప్రజలకు బాగా తెలిసిపోయాయి .1918ఆగస్ట్ బొంబాయి కాంగ్రెస్ ప్రత్యెక సభలో గాంధీతో సహా మితవాదులు విడిపోయి ‘’జాతీయ విమోచనా సమాఖ్య ‘స్థాపించారు .మరో 15ఏళ్ళలోపు పూర్తిస్వరాజ్యం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది .మా౦టేగు సంస్కరణలను మోతీలాల్ సమర్ధించి ,జాతీయవాదులను విశేషంగా ఆకర్షించాడు .అనిబి సెంట్ కూడా మద్దతు పలికింది .కొందరు అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులతో కలిసి మోతీలాల్ బొంబాయి నుంచి పూనా వెళ్లి తిలక్ ను కలిశారు హో౦ రూల్ విషయం పై చర్చించటానికి .తీవ్ర ఆస్వస్థత వలన మోతీలాల్ మొదటి రోజు సమావేశానికి వెళ్ళలేదు .రెండవ రోజు నీరసం తోనే కొన్న మాటలు మాట్లాడాడు .ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన చిదంబరం పిళ్ళై కనిపించగానే ఆయనకు ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకు వచ్చింది .’’మిత్రమా ‘’అంటూ ఆప్యాయంగా కౌగలించాడు .1918 తుఫాను ముందు ప్రశా౦త౦ గా గడచి పోయింది .
సశేషం