హాస్యానందం45-సమాసోక్తి

హాస్యానందం
45-సమాసోక్తి
రెండు మూడు అక్షరాల మాట తో చెప్పాల్సిన దాన్ని పెద్ద సమాసం లో చెప్పటం సమాసోక్తి అన్నారు మునిమానిక్యంగారు .చెంబు అని సింపుల్ గా అనకుండా ‘’జలాది ద్రవ్య ధారక సమర్ధ లోహాదిపదార్ధనిర్మిత ఘటికా విశేషం ‘’అ౦టేఅవతలి వాడి బుర్ర పగిలిపోతుంది .అంటే అల్పమైన భావాన్ని పెద్దసమాసంలో కూర్చటం అన్నారు మాస్టారు .అలాగే అందమైన వాడు అనటానికి ‘’పవనాశనేంద్ర ధర మకుటాలంకార మణి జనక వరపుత్రీ రమణ కుమారరూపదీపితుడు ‘’అంటే క్లిష్టం అయి కావ్యదోశ మౌతుందని ఆలంకారికులు అన్నారు .ఈ డొంక తిరుగుడు వలన వినే వాడికి నవ్వు పుట్టిస్తుంది ,వాడి అందం దేవుడెరుగు .
ప్రగల్భోక్తి –నమ్మటానికి వీల్లేని దాన్ని నమ్మమని చెప్పటమే ప్రగల్భోక్తి అని నిర్వచించారు మాణిక్యంసార్ .ప్రగల్భాలు అతిశయోక్తులే .విస్తరించి చెబితే అర్దాశ్రయ హాస్య ప్రక్రియ అవుతుందన్నారు .ఉదాహరణ –ఒకాయన ఈకాలపు మనుష్యుల బలహీనతలగురించి చెబుతూ ‘’ఈకాలం సన్నాసులు దేనికీ పనికిరారు పిట్ట తిండి పిట్ట కూతగాళ్ళు .మాకాలం లో ఒక్కొక్కడూ సేరు బియ్యం అన్నం ఊదేసే వాళ్ళం .చుట్టలు ఇప్పటివాళ్ళూ కాలుస్తారుకానీ ,అప్పుడు మావాళ్ళూ కాల్చేవారు ఎంతతేడా ఎంతతేడా ?మా వాడు భోంచేసి చుట్ట ముట్టి౦చాడూ అంటే ఆచుట్ట రాత్రంతా అలా కాలుతూనే ఉండేది. రూళ్ళకర్రల్లాగా ఉండేవి ఆకాలం చుట్టలు .ఇప్పుడు వీళ్ళు కాల్చేది చుట్టలుకాదు చుట్టపీకలు .పది నిమిషాలకంటే ఎక్కువ సేపు చుట్ట కాల్చేవాడు దివిటీవేసి వెతికినాదొరకడు ఇప్పుడు .ఆ కాలం వేరు ఆమనుషులు వేరు .
మరో ఉదాహరణ –ఒకాయన ‘’ఇప్పుడు గ్రహణాలు పడితే అర్ధగంట మహా అయితే గంట .మాకాలం లో అసలు గ్రహణాలు పట్టేవేకావు .కర్మ చాలక గ్రహణం పట్టిందా అంటే రెండురోజులు ఏక ధాటిగాఉండేవి .ఇప్పుడేవీ అలంటి గ్రహణాలు పిదపకాలం పిదప గ్రహణాలూ’’అన్నాడట
ఇంకో ముదురాయన ‘’మా తాత పాలు తీయటానికి ముక్కాలు పీట వేసుకొని పొడదుగు దగ్గర కూచున్నాడూ అంటే సాయంత్రం ఆరింటికి కూచున్నవాడు తెల్లార్లూ తీస్తూనే ఉండేవాడు .చివరికి విసుగొచ్చి లేచి ,దూడను వదిల్తే చీకటిపడే దాకా పాలు కుడుస్తూనే ఉండేది .ఇప్పుడు అలాంటి ఆవులూ లేవు అలాటి మనుష్యులూ లేరు ‘’అన్నాడు.
ఆత్మ తృప్తితో అంటున్నమాట కూడాహాస్యమనోహారం చెయ్యచ్చునన్నారు మునిమాణిక్యం .ఒకావిడ భర్తతో పోట్లాడి బావిలో పడిచస్తాను అని బెదిరించింది .భర్తకు ఒళ్ళు మండి ‘’నీ చావు నువ్వు చావు .మనదొడ్లో బావిలేదు .ఎదురింట్లో ఉంది కావాలంటే అందులో దూకి చావు ‘’అన్నాడు .ఆమెకు అభిమానం తన్నుకొచ్చి ‘’ఎవరి బావిలోనో పడి చచ్చే కర్మనాకేం పట్టలేదు .మన ఇంట్లోనే బావి తవ్వించుకొని మరీ చస్తాను’’ .ఇదీ ప్రగల్భోక్తి లాంటిదే అని ప్రగల్భం స్వాభిమానంతో గర్వం తో పుట్టేది అని వివరణ ఇచ్చారు గురూజీ .ప్రగల్భం ఉత్ప్రేక్ష ,అతిశయోక్తి అక్కా చెల్లెళ్ళు లాంటివే .హనుమతుడు రావణుడి ఎదుట తనతోక అతిగా పెంచి ఆదేసి౦హసనమనుకుని కూర్చున్నాడు .ఈ విషయం హనుమంతుడి నోటిద్వారా వస్తే ప్రగల్భోక్తి అయ్యేది,దాన్ని పరమ సత్యంగా భావిస్తాం కనుక హాస్యపు పలుకుగానే ఉంటుందన్నారు మునిమానిక్యంజీ .కానీ ఇది సరైనదికాదు అని ఆయన మిత్రులు వాదించారట .మరింత లోతుగా ఆలోచించాలని ఆపేశారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-14-10-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.